Adani Enterprises Share: ఇవాళ్టి (మంగళవారం) ఇంట్రా డే ట్రేడ్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises) స్టాక్ కొత్త రికార్డులు సృష్టించింది. కొత్త 52 వారాల గరిష్టానికి చేరడంతోపాటు, రూ.4 ట్రిలియన్ల (రూ.4 లక్షల కోట్లు) మార్కెట్ విలువను (మార్కెట్ క్యాపిటలైజేషన్) దాటింది. 


మధ్యాహ్నం 01:24 గంటల సమయానికి రూ.4.04 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌తో, బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్స్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ 15వ స్థానంలో నిలిచింది. 


నాలుగో లిస్టెడ్‌ కంపెనీ
గౌతమ్‌ అదానీ గ్రూప్‌లో, రూ.4 ట్రిలియన్ల మార్కెట్‌ విలువను దాటిన నాలుగో లిస్టెడ్‌ కంపెనీ ఇది. గ్రూప్‌ కంపెనీల జాబితాలో అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission) అగ్రస్థానంలో ఉంది, దీని మార్కెట్ క్యాప్ రూ.4.48 ట్రిలియన్లు లేదా రూ.4.48 లక్షల కోట్లు. ఆ తర్వాత అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas - రూ.3.96 ట్రిలియన్లు), అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy - రూ.3.72 ట్రిలియన్లు) ఉన్నాయి.


అదానీ గ్రీన్ ఎనర్జీ, ఈ ఏడాది ఏప్రిల్ 19న రికార్డు స్థాయిలో రూ.4.83 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌ను తాకింది, ఆ తర్వాత కాస్త చల్లబడింది. గత నెల 30న అదానీ టోటల్ గ్యాస్ కూడా తన అత్యధిక మార్కెట్ క్యాప్ రూ.4.20 ట్రిలియన్లను తాకి వెనక్కు వచ్చింది.


మూడు నెలల్లో 70 శాతం ర్యాలీ
గత నెల రోజుల్లో, నిఫ్టీ 50 ఇండెక్స్‌లో 2 శాతం పెరుగుదలతో పోలిస్తే, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ధర 24 శాతం పెరిగింది. గత మూడు నెలల్లో, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో 15 శాతం ర్యాలీతో పోలిస్తే, ఈ స్క్రిప్‌ ఏకంగా 70 శాతం ర్యాలీ చేసింది.


బెంచ్‌మార్క్ నిఫ్టీ 50 ఇండెక్స్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ చేరుతుందని ఈ నెల 1న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రకటించింది. ఈ నెల 30 నుంచి, శ్రీ సిమెంట్ ‍‌(Shree Cement) స్థానంలో ఇండెక్స్‌లో కనిపిస్తుంది.


గౌతమ్ అదానీ గ్రూప్‌లో ఫ్లాగ్‌ షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్. విస్తృత ఉత్పత్తులు, సేవలను అందిస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపార సంస్థల్లో ఇది ఒకటి. రవాణా & లాజిస్టిక్స్, ఎనర్జీ & యుటిలిటీ రంగాల్లో కొత్త వ్యాపారాలను ఏర్పాటు చేస్తూ, ఒక ఇంక్యుబేటర్‌గా ఈ కంపెనీ పనిచేస్తోంది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్ చేస్తున్న చాలా కొత్త వ్యాపారాలు ఇప్పటికీ పెట్టుబడి దశలో లేదా లాభాల ప్రారంభ దశలోనే ఉన్నందున వీటి మీద పర్మినెంట్‌గా ఒక అభిప్రాయానికి రాకూడదు. ఆ కంపెనీల్లో పైకి కనిపించే ఆర్థికాంశాలు వాటి నిజమైన సామర్థ్యాన్ని ప్రతిబింబించవని గుర్తుంచుకోవాలి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.