Mukesh Ambanis Daughter Isha set to be Named Chairperson of Reliance Industries Retail Unit : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) నుంచి మరో సంచలన ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. తమ వ్యాపార సామ్రాజ్యంలోని రిటైల్‌ విభాగానికి కుమార్తె ఇషా అంబానీని (Isha Ambani) ఛైర్‌ పర్సన్‌గా నియమించాలని ముకేశ్‌ అంబానీ భావిస్తున్నట్టు తెలిసింది. కుదిరితే బుధవారం సాయంత్రం లోపు అధికారికంగా ఈ నిర్ణయం వెల్లడిస్తారని సమాచారం.


ఆసియాలోని అత్యంత సంపన్నుల కుటుంబాల్లో ముకేశ్ అంబానీది (Mukhesh Ambani) ఒకటి! కొన్నేళ్లుగా రిలయన్స్‌ వ్యాపార సామ్రాజ్యాన్ని ముకేశ్‌ తిరుగులేకుండా నడిపిస్తున్నారు. ఇప్పుడాయన తన వారసులకు బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. ఇందుకు ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే ఆకాశ్ అంబానీని రిలయన్స్‌ జియోకు ఛైర్మన్‌గా నియమించారు. ఇప్పుడు రిటైల్‌ విభాగాన్ని ఇషాకు అప్పగించనున్నారు.


బుధవారం సాయంత్రంలోపు ఇషా అంబానీ నియామకాన్ని అధికారికంగా ప్రకటిస్తారని రిలయన్స్‌ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఆమె రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. జియో స్థాపనలో ఆకాశ్‌కు తోడుగా ఇషా నిలబడ్డారు. ఈ కవలలు ఇద్దరూ కలిసి దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీని ముందుకు తీసుకెళ్లారు. ఎయిర్‌టెల్‌కు పోటీగా నిలబెట్టారు. మున్ముందు చిన్న కొడుకు అనంత్‌ (27)కు సైతం వేరే విభాగం బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు.


అంతకు ముందు టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో ఛైర్మన్‌గా ఆకాశ్‌ అంబానీ ఎంపికయ్యారు. బోర్డు మంగళవారం ఆయన నియామకాన్ని ఆమోదించింది. అదే సమయంలో జియో డైరెక్టర్‌ పదవి నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ తప్పుకున్నారు. జూన్‌ 27 నుంచి ఇది కొనసాగుతుంది.


రమీందర్‌ సింగ్‌ గుజరాత్‌, కేవీ చౌదరీ ఐదేళ్ల కాలానికి జియో డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. 2022, జూన్‌ 27 నుంచి వారి పదవీకాలం మొదలవుతుంది.  కాగా పంకజ్‌ మోహన్‌ పవార్‌ను ఐదేళ్ల కాలానికి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించారు. 2022, జూన్‌ 27 నుంచి ఆయన పదవీకాలం మొదలవుతుంది.