GHMC Engineers Salary Cut: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) లో పని చేస్తున్న కొంత మంది ఇంజినీర్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. విధుల్లో ఆలసత్వం వహించారనే కారణంతో ఏకంగా వారి జీతంలో కోత విధించారు. ఈ మేరకు సంబంధిత ఇంజినీర్ల జీతంలో ఒకరోజు వేతనాన్ని కట్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తం 38 మంది ఇంజినీర్లపై చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో నగరంలో కొన్ని ప్రాంతాల్లో మరమ్మతులు చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, మంత్రి కేటీఆర్, స్పెషల్‌ సీఎస్‌ల నుంచి గతంలో ఆదేశాలు, హెచ్చరికలు వచ్చినా ఇంజినీర్లు నిర్లక్ష్యంగా వహించారని తాజాగా జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంది. 


జీహెచ్ఎంసీ 13 సర్కిల్స్ కు చెందిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు (ఈఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు (డీఈఈ), అసిస్టెంట్లు ఇంజినీర్లు (ఏఈ) ఈ చర్యలు తీసుకున్న వారిలో ఉన్నారు. డీఈఈలే ఈఈలుగా కూడా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నవారు వీరిలో ముగ్గురు ఉన్నారు.  


వరుస సమీక్షల్లో మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలు
గత సంవత్సరం అక్టోబర్‌లో వర్షాకాలంలో తలెత్తిన నాలాల సమస్యలను పరిష్కరిస్తామని గత అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా నాలాలు సరిదిద్దడంపై సమీక్షా సమావేశాలు చేపట్టారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, అప్పటికే పూర్తి కావాల్సిన పనులు కాలేదని గత నెలాఖరులో కూడా స్పెషల్ సీఎస్ తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. జూన్‌ 5లోగా పనులు పూర్తిచేయాలని మెమో జారీచేశారు.


ఈ క్రమంలోనే నిర్దేశించిన పనులకు సంబంధించి పూర్తి కాని పనులను ఫోటోలతో సహా పంపిస్తూ దాదాపు 50 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. పనులు త్వరితగతిన పూర్తిచేసి, సంబంధిత ఫొటోలు పంపాలని, ఆలస్యానికి గల వివరణ కూడా ఇవ్వాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే ఎలాంటి నోటీసు లేకుండానే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయినా పనులు ముందుకు జరగకపోవడంతో దీన్ని తీవ్ర తప్పిదంగా పరిగణిస్తూ తాజాగా జీతాల్లో కోత విధింపు చర్యను తీసుకున్నారు.