Maruti Suzuki Q4 Results: 2023 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి, ఆటో మేజర్‌ మారుతి సుజుకి హైస్పీడ్‌ నంబర్లను పోస్ట్‌ చేసింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ స్వతంత్ర (standalone) నికర లాభం సంవత్సరానికి (YoY) చాలా బలంగా 43% పెరిగి రూ. 2,624 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 1,839 కోట్లు.


మార్చి త్రైమాసికంలో ఈ ఆటో మేజర్ ఆదాయం కూడా 20% పెరిగి రూ. 32,048 కోట్లకు చేరుకుంది. అదే ఏడాది క్రితం రూ. 26,740 కోట్లుగా ఉంది.


అంచనాలను దాటిన లాభం
Q4లో మారుతి సుజుకీ రూ. 2,502 కోట్ల లాభాన్ని ఆర్జిస్తుందని మార్కెట్‌ అంచనా వేస్తే, అంతకుమించి సాధించింది. అయితే, ఆదాయం అంచనాల కంటే కాస్త తక్కువగా ఉంది. టాప్‌లైన్ రూ. 32,529 కోట్లుగా అంచనా వేశారు.


మార్చి త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ లాభం సంవత్సరానికి 47% పెరిగింది. అధిక అమ్మకాలు, మార్కెట్ నుంచి మెరుగైన రియలైజేషన్, అనుకూలంగా ఉన్న ఫారెక్స్ కారణంగా ఇది సాధ్యమైంది.


వాహన విక్రయాలు
సమీక్ష కాల త్రైమాసికంలో మారుతి సుజుకి మొత్తం 5,14,927 వాహనాలను విక్రయించింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 5.3% అధికం.


Q4FY22తో పోలిస్తే, Q4FY23లో దేశీయ మార్కెట్‌లో అమ్మకాలు 7.1% పెరిగి 4,50,208 యూనిట్లకు చేరాయి. విదేశీ మార్కెట్‌లో అమ్మకాలు 64,719 యూనిట్లుగా ఉన్నాయి, Q4FY22లో ఇవి 68,454 యూనిట్లు.


మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2022-23 మొత్తంలో) కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.లక్ష కోట్ల మార్కును దాటింది.


"ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత ఉన్నప్పటికీ, 40వ వార్షికోత్సవ సంవత్సరంలో కంపెనీ అత్యధిక వార్షిక అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ వార్షిక టర్నోవర్ 1 లక్ష కోట్ల రూపాయల మార్కును అధిగమించింది" అని కంపెనీ ప్రకటించింది. 


నిరక లాభం FY22లోని రూ. 3,766 కోట్ల నుంచి FY23లో రెండింతలు పెరిగి రూ. 8,049 కోట్లకు చేరుకుంది. 


ఒక్కో షేర్‌కు ₹90 డివిడెండ్‌
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ. 90 డివిడెండ్‌ను మారుతి సుజుకి బోర్డు ఆమోదించింది.


సంవత్సరానికి 1 మిలియన్ వాహనాలను అదనంగా ఉత్పత్తి చేసేందుకు కంపెనీ బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. మనేసర్, గురుగావ్‌ ప్లాంట్ల ప్రస్తుత మొత్తం సామర్థ్యం దాదాపు 13 లక్షల యూనిట్లు. 


ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా యుటిలిటీ వాహనాల విభాగంలో ప్రవేశపెట్టిన కొత్త మోడళ్లు, ప్రొడక్ట్ రిఫ్రెషర్‌లకు మంచి మార్కెట్ స్పందన లభించిందని మారుతి తెలిపింది.


ఫలితాల ప్రకటన తర్వాత, ఫ్లాట్‌గా ట్రేడయిన మారుతి సుజుకి షేర్లు 0.19% లాభంతో రూ. 8,485 వద్ద క్లోజ్ అయ్యాయి. ఇండెక్స్ హెవీవెయిట్ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఫ్లాట్ రిటర్న్స్ ఇచ్చింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.