CM Jagan Comments on Chandrababu: సీఎం జగన్ అనంతపురం పర్యటన సందర్భంగా జగనన్న వసతి దీవెన నిధులను విడుదల చేశారు. జిల్లాలోని నార్పలలో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును నరమాంస భక్షకుడితో పోల్చారు. ఈ సందర్భంగా పంచతంత్రంలోని ఓ పులి కథను చెప్పి వినిపించారు. ఇటీవల రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ఓ కాంక్లేవ్‌లో చంద్రబాబు మాట్లాడిన మాటలను చూస్తే తనకు ఆ కథ గుర్తుకు వచ్చిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. నర మాంసానికి అలవాటు పడిన పులి ముసలిదై వేటాడే శక్తి కోల్పోయాక గుంట నక్కలను వెంట వేసుకొని తిరుగుతుందని మాట్లాడారు. బంగారు కడియం ఆశ చూపి మనుషులను మింగేసే పులి లాగానే చంద్రబాబు కూడా వెన్నుపోటు కుట్రలు పన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాయమాటలు చెప్పే చంద్రబాబు లాంటి వారిని నమ్మకూడదని, కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.
రుణ మాఫీ చేస్తానని రైతులను సైతం మోసం చేసి 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న నగలను సైతం విడిపిస్తానని టీవీల్లో యాడ్లు వేయించేవారని గుర్తు చేశారు. మొత్తానికి సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేసేసి, అక్కాచెల్లెమ్మల పొదుపు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారు. నిరుద్యోగ సాయం చేస్తానని హామీ ఇచ్చి మొండి చేయి చూపించాడని సీఎం జగన్ ధ్వజమెత్తారు.
‘‘దోచుకో, పంచుకో, తినుకో అనే సిద్ధాంతం చంద్రబాబు హాయంలో ఉండేది. చంద్రబాబుకు తోడుగా ఓ గజదొంగల ముఠా ఉంది. అది ఎల్లో మీడియాతో పాటు వారికి తోడుగా ఒక దత్తపుత్రుడు. ఇది గజదొంగల ముఠాగా ఉంది. చంద్రబాబు చెప్తున్న అబద్దాలను, మోసాలను నమ్మకండి. కేవలం మీ బిడ్డ జగనన్న వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో ఆలోచించండి. జరిగితే మీ బిడ్డకు అండగా నిలబడండి. మీ జగనన్న నమ్ముకున్నది దేవుడి దయను, ప్రజలను. నా ఆత్మవిశ్వాసం మీరే. రాబోయే రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగనుంది. మీ దీవెనలు నాకు ఉండాలి’’ అని సీఎం జగన్ ఆకాంక్షించారు.