Bihar News: బీహార్‌లోని అర్వాల్ జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తికి.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది మహిళలకు భర్తగా ఉంటున్నాడు. వినడానికే మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోందా. ఏ అదంతా అబద్ధం ఓ ముగ్గురు నలుగురో లేదంటే పది మందో ఉండొచ్చు అంతే.. అనుకుంటున్నారు కదా. కానీ ఇదే నిజం. నిజంగానే 40 మంది మహిళలు తమ భర్త ఒక్కడేనని అంటున్నారు. బిహార్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతం రెండో దశ కుల గణన చేస్తుండగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 


అసలేం జరిగిందంటే..?


బిహార్ అర్బన్ ఏరియాలోని రెడ్‌లైట్ ఏరియా వార్డు నంబర్ 7లో ఉన్న 40 మంది మహిళలు ఒకే వ్యక్తిని తమ భర్తగా చెప్పుకుంటున్నారు. 40 ఏళ్లుగా పిల్లలతో సహా వీరంతా అక్కడే ఉంటున్నారు. పిల్లలను ప్రశ్నించినా ఒకే వ్యక్తి పేరు తమ తండ్రిగా చెబుతున్నారు. తమ భర్త పేరు రూప్ చంద్ అని.. కులగణన కోసం వచ్చిన అధికారులకు చెప్పారు. అయితే అందరూ అదే పేరు చెబుతుండడంతో.. క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు అధికారులు వెళ్లారు. ఈ క్రమంలోనే అసలు విషయం బయటపడింది. ఆ రెడ్ లైట్ ఏరియాలో రూప్ చంద్ అనే డ్యాన్సర్ ఉన్నాడు. అతడు చాలా ఏళ్లుగా పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి అక్కడ సొంత నివాసం కూడా లేదు. అయినప్పడికీ అతడిపై అభిమానంతోనే ఆ మహిళలంతా తమ భర్త రూప్ చంద్ అని చెప్పుకుంటున్నారు. అలాగే వారి పిల్లలు కూడా అతడినే తండ్రిగా చూపిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉండే వారికి కులం అంటూ ఏదీ లేదని అధికారులు చెబుతున్నారు.