Parkash Singh Badal Passes Away: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూశారు. శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ మంగళవారం రాత్రి 8.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 95. వయసురీత్యా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ప్రకాష్ సింగ్ బాదల్.. ఆదివారం మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఐసీయూలోనే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి పంజాబ్ మాజీ సీఎం బాదల్ తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు, ఎస్‌ఏడీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ వెల్లడించారు. బుధవారం బాదల్ భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించనున్నారు.
కరోనాతో క్షీణించిన ఆరోగ్యం..
జనవరి 2022లో ప్రకాష్ సింగ్ బాదల్ కరోనా బారిన పడ్డారు. కోవిడ్19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో లుథియానాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అనంతరం ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. కరోనా నుంచి కోలుకున్న అనంరతం ముందుజాగ్రత్తగా పలు రకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. దాంతో ఫిబ్రవరి 2022లో పోస్ట్ కోవిడ్ మెడికల్ టెస్టుల కోసం మొహాలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు గుండె, శ్వాసకోశ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు.
బాదల్ మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహాలు పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ‘పంజాబ్ రాజకీయాల్లో ఎన్నో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన రాజకీయ నాయకుడు ప్రకాష్ సింగ్ బాదల్. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో రైతుల సంక్షేమానికి అనేక విశేషమైన కృషి చేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో శ్రమించిన వ్యక్తి. పుట్టినగడ్డకు జీవితాంతం సేవలు అందించారు. పలు సమస్యలపై బాదల్ తో నేను చేసిన చర్చను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. ఆయన మరణం తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. బాదల్ తన సేవలకుగానూ 2015లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు.
చిన్న వయసులో ముఖ్యమంత్రిగా..
1927 డిసెంబరు 8న పంజాబ్‌లోని అబుల్ ఖురానా అనే గ్రామంలో జన్మించిన ప్రకాశ్ సింగ్ బాదల్ 5 పర్యాయాలు సీఎంగా చేశారు. అతిపిన్న వయసులో పంజాబ్ సీఎం అయిన నేతగా నిలిచారు. 44 ఏళ్ల వయసులో పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రికార్డు సృష్టించారు. ఈయన 1970-71, 1977-80, 1997-2002, 2007-2017 లలో పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. అతిపెద్ద వయసులోనూ సీఎం అయిన నేతగానూ రికార్డు నెలకొల్పారు. శిరోమణి అకాలీదల్ పార్టీకి 1995 నుంచి 2008 వరకు అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆయన తరువాత 2008లో కుమారుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు.