- తొమ్మిది, పదోతరగతి పుస్తకాల సిలబస్ మార్పు
- సైన్స్ పుస్తకాల నుంచి డార్విన్ సిద్ధాంతం మాయం
- డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని తీసేసిన NCERT
- సిలబస్ రేషలైజేషన్ లో భాగమని చెబుతున్న NCERT
- ఎవల్యూషన్ థియరీపై విద్యార్థుల్లో గందరగోళం
- కేంద్రానికి లేఖలు 1800మంది మేధావులు, శాస్త్రవేత్తలు
- విద్యార్థుల ఆలోచనలు తుంచేయటమేనన్న శాస్త్రవేత్తలు
తొమ్మిది, పదో తరగతి పాఠ్యపుస్తకాల నుంచి ఛార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన 'జీవపరిణామ సిద్ధాంతం' తొలగించింది NCERT. ఇదివరకు ఏదైనా పోటీపరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటే NCERT బుక్స్ చదవమని సలహా ఇచ్చే వాళ్లు లెక్చరర్స్. ఇప్పుడు అవి కూడా రాజకీయ రంగు పులుముకోవటం బాధాకరమనే భావనను మేధావులు, శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎవల్యూషన్ థియరీని అలా విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో తీసేయటానికి గల కారణాలు ఏంటో చెప్పాలని.. అది విద్యార్థుల ఆలోచనలను ఎలా గందరగోళంలో నెట్టనుందో వివరిస్తూ 1800 మంది శాస్త్రవేత్తలు కేంద్రానికి లేఖ రాశారు. ఈ వివాదంపై స్పందించిన NCERT కరిక్యులమ్ రేషనైలేజేషన్ లో భాగంగా తీసేశామని సమాధానం చెబుతోంది.
జీవ పరిణామ సిద్ధాంతంపై భిన్న వాదనలు
డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం జీవం పుట్టుకకు కారణాలను అన్వేషిస్తుంది. అసలు ఈ సిద్ధాంతం మీద దీని శాస్త్రీయత మీద చాలా అనుమానాలు ఎప్పటినుంచో చాలా మంది వ్యక్తపరుస్తూనే ఉన్నారు. కానీ వాటిని అన్నింటినీ తట్టుకుని ఇన్నాళ్లుగా నిలబడుతూ వస్తోంది డార్విన్ థియరీ. మనిషి కోతి నుంచి పరిణామ క్రమంలో ఉద్భవించాడని చెబుతున్న డార్విన్ థియరీని నమ్ముదామా లేదా అనేది పక్కనపెడితే.. కనీసం అదొక థాట్ గా అంగీకరించదగిన విషయమే.
శాస్త్రీయంగానే నిరూపితమైంది..
ఈ విశ్వం మొత్తం ఏదో ఓ చిన్న అణువు పేలటం ద్వారా పుట్టినదే అనే బిగ్ బ్యాంగ్ థియరీని అంతా నమ్ముతున్నప్పుడు.. విశ్వంలో కనిపించే ప్రతీ వస్తువూ కూడా ఇదే విశ్వంలో మరో ఏదో ఒక వస్తువు నుంచి ఉద్భవించిందే. ఉదాహరణకు భూమి, గురుడు, శని, మార్స్ లాంటి గ్రహాలన్నీ సూర్యుడు అనే నక్షత్రం అనే ఎలా అయితే వచ్చాయో... భూమిమీద ఉన్న ప్రతీ జీవి కూడా ఏదో ఒకే ఒక జీవం పరిణామం చెందటం వల్ల వచ్చినవే అని శాస్త్రీయంగానే నిరూపితమైంది. DNA టెస్టులు చేయటం అనే సాంకేతికత అందుబాటులోకి వచ్చాక మనిషి డీఎన్ఏ ఎలుకలు, కుక్కలు, ఏనుగుల డీఎన్ఏకు 90 శాతం దగ్గరగా ఉన్నట్లు నిరూపితమైంది. అందుకే ఏదైనా కొత్తరోగానికి మందు కనుక్కున్నప్పుడు ఎలుకల మీద ప్రయోగిస్తారు. అంతరిక్ష ప్రయోగాలు తొలిసారి చేసినప్పుడు లైకా లాంటి కుక్కలను పంపించారు. వాటి మీద ప్రయోగాలు సక్సెస్ అయితే మనిషి మీద కూడా అవి వర్కవుట్ అవుతాయని..కారణం డీఎన్ఏ అని శాస్త్రవేత్తలు రుజువు చేసి చూపించారు.
అదే చింపాజీలైతే 98 నుంచి 99 శాతం మనిషి డీఎన్ఏకి దగ్గరగా ఉంటాయి. చింపాజీల్లో జరిగిన ఆ ఒక్క శాతం మార్పుతోనే కాలక్రమేణా మనుషులుగా మారాం. ఈ సృష్టిలో ప్రతీది ఛేంజ్ కు గురైనదే. ఒకప్పుడు భూమిపై రాజ్యమేలాయని భావించే డైనోసార్లు నుంచి ఇప్పుడు కనిపించే పక్షుల వరకూ నీళ్లలో ఉండే భారీ మొసళ్ల నుంచి...చెట్ల మీద కనిపించే చిన్న చిన్న తొండల వరకూ అన్నీ మరో జీవి డీఎన్ఏ ను పంచుకున్నవే. చూడాలే కానీ ఈ విశ్వం మొత్తం ఈ సారూప్యత కనిపిస్తుంది. అందుకే గ్రహాంతర వాసులు ఎవరైనా ఉన్నారా అని.. వేరే గ్రహాలు ఏవైనా మనలాంటి తెలివైన జీవజాతిని కలిగి ఉన్నాయా అని నాసా లాంటి అంతరిక్షపరిశోధన సంస్థలు ప్రయోగాలు చేస్తున్నాయి.
మార్స్ మీద కాలనీలు కట్టాలని స్పేఎస్ ఎక్స్ లాంటి సంస్థలు అసలు మనిషి శారీరకంగా లోపాలు లేకుండా ఉండాలని న్యూరాలింక్ లాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. మెటా వర్స్ లు, చాట్ జీపీటీల లాంటి ఆర్టిఫీషియల్ ఇంటిలెజిన్స్ ఇవన్నీ రాబోయే రెండొందలు మూడొందల ఏళ్లను శాసించే స్థాయిలో విస్తరిస్తున్నాయి. భవిష్యత్ ఏంటన్నది ఊహించలేం. బిగ్ బ్యాంగ్ జరిగిందని భావించే 13 బిలియన్ కాంతి సంవత్సరాల నాటి కాంతిని అనలైజ్ చేయాలని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ట్రై చేస్తోంది. మేం మనుషులం భూమి మీద మేం బతుకుతున్నాం.. మా అరుపులు ఇవి. మా ఏడుపులు ఇవి. మేం నవ్వితే ఇలా ఉంటాం. ఏడిస్తే ఇలా ఉంటాం అని మన వేదనను గోల్డెన్ రికార్డ్ లో వినిపిస్తూ 45 ఏళ్లుగా నాసా వోయేజర్ ఈ అనంతమైన విశ్వంలో అలికిడి చేస్తూ ప్రయాణిస్తోంది.
కేంద్రం పునరాలోచించాలన్న సైన్స్ ప్రేమికులు
మనిషిది అవసరం. అవసరం ఆలోచనకు కారణమైంది. ఆలోచన నుంచి ఆవిష్కరణ పుట్టింది. ఆవిష్కరణలు భవిష్యత్తుకు భద్రత కల్పిస్తున్నాయి. ప్రశాంతంగా తిని పడుకునేలా చేస్తాయి. కుటుంబంగా, ఓ సంఘంగా, ఓ దేశంగా.. హ్యాపీగా ఉండేలా చేస్తున్నాయి. ఇది సైన్స్ చేస్తూ వచ్చిన ప్రగతి. మరి అలాంటి థాట్ ప్రాసెస్ కు కారణమయ్యే భవిష్యత్తుకు భరోసా కల్పించే సైంటిఫిక్ థియరీలను విద్యార్థులను అందకుండా చేయకుండా ఎలాంటి నిర్ణయమో కేంద్రమో ఆలోచించాలని సైన్స్ ప్రేమికులు కోరుతున్నారు. కొద్దిరోజుల క్రితం మొఘల్ సామ్రాజ్యాలు, వాటి చక్రవర్తుల చరిత్రను విద్యార్థుల పాఠ్యాంశాలనుంచి తొలగించాలని చాలా రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. భారతీయ చరిత్రలను, భారతీయ రాజుల ఘనతలనే పిల్లలకు పాఠాలుగా చెప్పాలని ఆదేశాలు జారీ చేశాయి.
అసలు చరిత్ర మార్చితే మారిపోయేదా.. చింపితే చిరిగిపోయేదా. ఈ దేశానికి మొఘలులు రావటం.. వాళ్లు పాలించటం, ఆ ఎర్రకోటలు..ఆ తాజ్ మహల్ లు నిజం కాదా. మరి వాటిని ఎవరు కట్టారు. సరే అదంటే చరిత్రకు సంబంధించిన అంశం. భారతీయ చరిత్ర వక్రీకరణకు గురైందని నిర్ణయం తీసుకున్నారు అనుకుందాం. కానీ డార్విన్ సిద్ధాంతం సైన్స్. అసలు ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ టెక్నాలజీ, ఈ సుఖాలకు కారణమైన అందుకు మూలమైన సిద్ధాంతాలను విద్యార్థులకు దూరం చేయటం అంటే..భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలనేది పాలకుల ఆలోచనో. ప్రజలే ఆలోచించుకోవాలని సైన్స్ ప్రేమికులు కోరుతున్నారు.