Marsons Stock: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి ఎల్లప్పుడూ పెన్నీ స్టాక్స్ అంటే ఇష్టమే. ఎందుకంటే తక్కువ రేటు వద్ద అందుబాటులో ఉండే ఈ కంపెనీలు.. ఇన్వెస్టర్లకు పేలుడు లాభాలను అందిస్తుంటాయి. అయితే వీటిలో మంచి ఫండమెంటల్స్, భవిష్యత్తులో వృద్ధికి ఆస్కారం ఉన్న కంపెనీలను ఎంచుకోవటం ముఖ్యం. ఉదాహరణకు ఒకప్పుడు కేవలం రూ.2 వద్ద ఉండే టైటాన్ కంపెనీ షేర్లు ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఏ స్థాయికి ఎదిగాయో తెలుసుగా. ఐపీవో సమయంలో కేవలం లక్షలు పెట్టుబడి పెట్టి ఇప్పటి వరకు హోల్డ్ చేసుకున్నవారు ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారారు. 


పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రాబడి
అయితే ఇప్పుడు మనం మార్సన్స్ లిమిటెడ్ పనితీరు గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ పరికరాలకు సంబంధించిన కంపెనీ మార్సన్స్ షేర్లు ఈ సంవత్సరం పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రాబడులను అందించాయి. వాస్తవానికి డిసెంబర్ 2023లో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.7 వద్ద ఉండేది. అప్పటి నుంచి స్టాక్ 602 శాతం లాభపడింది. నేడు మార్కెట్లో షేర్ ధర 2 శాతం పెరిగి రూ.54.38 స్థాయికి చేరుకున్నాయి. వాస్తవానికి ఇది కంపెనీ షేర్లకు 52 వారాల గరిష్ఠ ధర కావటం గమనార్హం. అలాగే గడచిన ఏడాది కాలంగా కంపెనీ షేర్ల పనితీరును గమనిస్తే స్టాక్ 831 శాతానికి పైగా పెరిగింది. అలాగే జూలై 2023లో ఒక్కో షేరు ధర కేవలం రూ.4.95 వద్ద మాత్రమే ఉంది. 


మార్సన్స్ లిమిటెడ్ షేర్లు 2024లో ఇప్పటివరకు సుమారు 5 నెలల కాలంలో సానుకూల రాబడిని ఇచ్చాయి. స్టాక్ ఏప్రిల్‌లో దాదాపు 37 శాతం, మార్చిలో 39 శాతం, ఫిబ్రవరిలో 45 శాతం, జనవరి 2024లో స్టాక్ 135.5 శాతం రాబడిని ఇచ్చి పెట్టుబడిదారులకు కనకవర్షం కురిపించింది. ప్రస్తుతం మే నెల కొనసాగుతుండగా ఇప్పటివరకు ఈ నెలలో మే 8 శాతానికి పైగా లాభపడింది. దీర్ఘకాలంగా కంపెనీ షేర్లలో పెట్టుబడులు కొనసాగించిన ఇన్వెస్టర్లు సైతం మంచి రాబడులను అందుకున్నారు. మూడేళ్ల కాలంలో కంపెనీ షేర్లు 447 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించగా.. 5 ఏళ్ల కాలంలో పెన్నీ స్టాక్ ఇన్వెస్టర్లకు 543 శాతం రాబడిని అందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 


మార్సన్స్ లిమిటెడ్ షేర్లు ప్రస్తుతం ఎన్‌హాన్స్‌డ్ సర్వైలెన్స్ మెజర్స్ స్టేజ్ 2 కింద ట్రేడ్ అవుతున్నాయి. ESM అనేది భారతదేశంలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నియంత్రణ సంస్థ. పెట్టుబడిదారుల భద్రత, మార్కెట్‌పై విశ్వాసాన్ని నిర్ధారించడం దీని లక్ష్యం.


కంపెనీ వ్యాపారం: మార్సన్స్ లిమిటెడ్ కంపెనీ భారతదేశంలో పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌ల తయారీ, సరఫరా, కమీషన్‌లో వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ 10 KVA నుంచి 160 MVA, 220 KV వరకు పంపిణీ అండ్ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌లను అందిస్తుంది. 1976లో స్థాపించబడిన కంపెనీ కోల్‌కతా కేంద్రంగా వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. డిసెంబర్ త్రైమాసికంలో మార్సన్ లాభం 74.58 శాతం క్షీణించి రూ.0.15 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో కంపెనీ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 64.5 శాతం తగ్గి రూ.0.65 కోట్లకు చేరుకున్నాయి. 


Note: పైన ఇచ్చిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ వివరాల ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. వ్యక్తిగత విచక్షణ పెట్టుబడుల్లో కీలకం.