AP Elections 2024: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఎన్నడు లేని విధంగా తొలి సారి 100 శాతం వెబ్ కాస్టింగ్, కేంద్ర బలగాల రక్షణలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎందుకంటే చరిత్రలోనే తొలిసారిగా తిరుపతి నియోజకవర్గాన్ని సమస్యాత్మకంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. దీనివల్ల సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపు మధ్య తిరుపతిలో ఎన్నికలు జరగనున్నాయి. 


తిరుపతిలో పురుషులు 1,49,846 మంది, మహిళలు 1,52,622 మంది, ఇతరులు 35 మంది మొత్తం 3,02,503 మంది ఓటర్లుగా నమోదు చేసుకుని ఉన్నారు. 190 పోలింగ్ కేంద్రాల్లో 274 పోలింగ్ బూత్ లలో ఈసారి పోలింగ్ జరుగనుంది.


తొలిసారి సమస్యాత్మక ప్రాంతంగా
తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం లక్షలాదిమంది భక్తులు తరలివచ్చే తిరుపతి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి నగరం తొలిసారి సమస్యాత్మక ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకుంది. రాష్ట్ర ఎన్నికల పరిశీలకులకు ఇటీవల నియోజకవర్గంలో పర్యటించారు. ఇక్కడ వైసీపీ, కూటమి పార్టీల మధ్య ప్రచారంలో జరిగిన గొడవలు, ఒకరిపై మరొక్కరు దాడులు చేసుకునే పరిస్థితి నెలకొంది. 2021లో జరిగిన ఎంపీ ఉప ఎన్నికల్లో  బోగస్ ఓట్లు చేర్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, టౌన్ బ్యాంకు ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు, ఓట్లు వేసే పరిస్థితి లేకుండా చేయడం, ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు వింటున్నారనే అంశాలపై పూర్తి సాక్షాధారాలతో ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదు లపై పరిశీలన చేసారు. అందులో వారు గుర్తించిన అనేక అంశాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు నివేదిక అందజేశారు. ఇలా గుర్తించిన వాటిలో తిరుపతి కూడా ఉండడంతో 100 శాతం వెబ్ కాస్టింగ్, కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు సాగనున్నాయి.


ప్రతిరోజు మాటల యుద్ధం
ప్రస్తుత ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన కుమారుడు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ఈసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆ పార్టీ నుంచి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయనను వైసీపీ పార్టీ సస్పెండ్ చేసింది. అనూహ్యంగా కూటమి లో భాగంగా తిరుపతి సీటు జనసేనకు కేటాయించారు. తిరుపతి నుండి ఎన్నికల్లో ఆరణి శ్రీనివాసులను జనసేన నుంచి పోటీలోకి దింపారు. ఇటీవల ప్రచారంలో జరిగిన గొడవల నుంచి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుపై వైసీపీ నాయకులు చిత్తూరు రౌడీలు అంటూ మాటల యుద్ధం చేశారు. అందుకు తగిన రీతిలో ఆరణి శ్రీనివాసులు కడప గుండాలు అంటూ వారి మాటలకు ప్రతిదాడి చేస్తున్నారు. నిన్నటి వరకు ఒకే పార్టీలో తిరిగిన ఇద్దరు నాయకులు మీరు రౌడీలు అంటుంటే ప్రజలు మాత్రం ఇన్ని రోజులు కనిపించలేదా అంటున్నారు.


ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే అధికం
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, అన్నమయ్య జిల్లాలోని పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలను ఎన్నికల సంఘం సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 14 సమస్యాత్మకమైన నియోజకవర్గాలుగా ఎన్నికల సంఘం గుర్తించింది. 


14 సమస్యాత్మక నియోజకవర్గాలు ఇవీ..
మాచర్ల
వినుకొండ
గురజాల
పెదకూరపాడు
ఒంగోలు
ఆళ్లగడ్డ
తిరుపతి
చంద్రగిరి
విజయవాడ సెంట్రల్‌
పుంగనూరు
పలమనేరు
పీలేరు
రాయచోటి
తంబళ్లపల్లె