India - America Deals In PM Modi US Visit: భారత ప్రధాని నరేంద్ర మోదీ , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ద్వైపాక్షిక చర్చలు శుక్రవారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి) ముగిశాయి. ఈ సంభాషణలో, రెండు దేశాల మధ్య వాణిజ్యం నుంచి సాంకేతికత వరకు అనేక అంశాలు చర్చకు వచ్చాయి. రక్షణ రంగం సహా ప్రతి విభాగంలో పరస్పర సహకారాన్ని పెంచుకునేందుకు గట్టి నిర్ణయాలు తీసుకున్నారు. 


రక్షణ, భద్రత, ఇంధనం, వాణిజ్యం, సాంకేతికతకు సంబంధించిన అనేక అంశాలపై ఇరువురు నాయకులు (ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌) చర్చించారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ సంభాషణలో, ప్రతి రంగంలో భారతదేశం - అమెరికా మధ్య భాగస్వామ్యాన్ని (India-US partnership) బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు.


మోదీ పర్యటనలో భారత్‌ - అమెరికా మధ్య ఏయే ఒప్పందాలు జరిగాయి?


* ఇండో పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంచడానికి భారత్‌ - అమెరికా కలిసి పని చేయాలని నిర్ణయం. దీని అర్థం చైనాను ఎదుర్కోవడానికి క్వాడ్‌ (QUAD)కు ప్రాధాన్యత ఇస్తారు. క్వాడ్‌ అనేది భారతదేశం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సమూహం.


* కీలక ఖనిజాలు, అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌, ఔషధాల కోసం బలమైన సరఫరా గొలుసు సృష్టించాలని నిర్ణయం. ఉమ్మడి తయారీ, ఉమ్మడి అభివృద్ధి & సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి అధిక ప్రాధాన్యత ఇస్తారు.


* లాస్ ఏంజిల్స్ & బోస్టస్‌లో భారత కాన్సులేట్లు ప్రారంభమవుతాయి. భారతదేశంలో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను తెరవడానికి అమెరికన్ విశ్వవిద్యాలయాలను ఆహ్వానించారు.


* భారత్‌ - అమెరికా మధ్య చమురు & గ్యాస్ వ్యాపారం బలపడుతుంది. అంటే భారతదేశం ఇప్పుడు అమెరికా నుంచి మరింత చమురు & గ్యాస్ కొనుగోలు చేస్తుంది.


* భారతదేశంలోని అణుశక్తి రంగంలో చిన్న మాడ్యులర్ రియాక్టర్ల విషయంలో అమెరికా సహకారం పెరుగుతుంది.


* ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పని చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో, 26/11 దాడి సూత్రధారులలో ఒకరైన తహవ్వూర్ రానోను త్వరలో అమెరికా నుంచి భారత్‌కు పంపనున్నారు.


* రక్షణ ఒప్పందాలలో, అమెరికా నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి భారతదేశం చేసుకున్న ఒప్పందం కీలకంగా ఉంది. భారతదేశం అమెరికా నుంచి F-35 స్టెల్త్ ఫైటర్ విమానాలను కొనుగోలు చేయనుంది.


* IMEC (ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్) నిర్మాణంలో అమెరికా సహాయం చేస్తుంది. ఈ కారిడార్‌ భారతదేశం నుంచి ఇజ్రాయెల్, ఇటలీ & అమెరికాకు వెళ్తుంది. 


సుంకం & డీపోర్టేషన్‌పై ఒప్పందం జరిగిందా?


సుంకాలకు సంబంధించి స్పష్టమైన ప్రకటన జారీ కాలేదు. అయితే, మోదీ-ట్రంప్ చర్చలకు ముందే, ట్రంప్ ప్రతి దేశంపై 'టిట్ ఫర్ టాట్' సుంకాలను విధించాలని నిర్ణయించిన ఉత్తర్వుపై సంతకం చేశారు. అంటే.. భారతదేశం అమెరికన్ ఉత్పత్తులపై ఏ సుంకం విధిస్తుందో, అమెరికా కూడా భారతీయ ఉత్పత్తులపై అదే సుంకాన్ని విధిస్తుంది. సుంకాల యుద్ధం మధ్యే, ఈ రెండు దేశాలు రాబోయే ఐదు సంవత్సరాలలో, అంటే 2030 నాటికి ఇండియా-యుఎస్ వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించాయి. 


 డీపోర్టేషన్‌ విషయానికి వస్తే, అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయ వలసదారుల బహిష్కరణ కొనసాగుతుంది. అయితే, వాళ్లను సైనిక విమానాలలో చేతి, కాళ్లకు సంకెళ్లతో తీసుకువస్తారా, లేదా అనే విషయంపై స్పష్టత లేదు.


మరో ఆసక్తికర కథనం: అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన