Mankind Pharma IPO: ఔషధ (pharma) రంగం IPOల్లో (initial public offer) అతి పెద్ద ఆఫర్, స్టాక్ మార్కెట్ తలుపు తట్టేందుకు సిద్ధమవుతోంది. మ్యాన్‌ఫోర్స్ కండోమ్స్ (Manforce condoms), ప్రెగా న్యూస్‌తో (Prega-news) జనాల్లో బాగా పాపులర్ అయిన మ్యాన్‌కైండ్ ఫార్మా (Mankind Pharma) కంపెనీ ఐపీవోకు రావడానికి రెడీగా ఉంది.
తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) పేపర్లను మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి (SEBI) దాఖలు చేసింది. ఈ ఐపీవో ద్వారా రూ.5500 కోట్లు సమీకరించాలని కంపెనీ చూస్తోంది.
రెండో పెద్ద ఐపీవో
గ్లాండ్ ఫార్మా ఐపీవో రూ.6480 కోట్ల తర్వాత ఇదే రెండో పెద్ద ఐపీవో అవుతుంది.
కంపెనీ ప్రమోటర్లు, ఇప్పటికే ఉన్న వాటాదారులు 4 కోట్లకు పైగా (4,00,58,844) ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్‌లో (OFS) అమ్మేయబోతున్నారు. కంపెనీ ప్రమోటర్లు - రమేష్ జునేజా, రాజీవ్ జునేజా, శీతల్ అరోరా, రమేష్ జునేజా ఫ్యామిలీ ట్రస్ట్, రాజీవ్ జునేజా ఫ్యామిలీ ట్రస్ట్, ప్రేమ్ శీతల్ ఫ్యామిలీ ట్రస్ట్.
సింగపూర్ ప్రభుత్వానికి చెందిన జీఐసీ, సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్ కంపెనీలకు మ్యాన్‌కైండ్ ఫార్మాలో తలో పది శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. క్యాపిటల్ ఇంటర్నేషనల్ సంస్థకు మరో 11 శాతం వాటా ఉంది.
OFS ద్వారా... ప్రమోటర్ జునేజా ఫ్యామిలీ కోటి షేర్లు, క్యాపిటల్ ఇంటర్నేషనల్ సుమారు 2 కోట్ల షేర్లు, బీజ్ కంపెనీ దాదాపు కోటి షేర్లు, లింక్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ 50 వేల షేర్లను విక్రయించబోతోంది.
మొత్తం ఆఫర్ ఫర్ సేల్ రూట్‌లోనే
ఐపీవో మొత్తం ఆఫర్ ఫర్ సేల్ రూట్‌లోనే సాగుతుంది. అంటే ఫ్రెష్ ఈక్విటీ షేర్ ఒక్కటి కూడా లేదు. OFS ద్వారా వచ్చే డబ్బు మొత్తం ఆయా ప్రమోటర్లు, షేర్‌హోల్డర్ల జేబుల్లోకే వెళ్తుంది తప్ప కంపెనీకి ఒక్క రూపాయి కూడా రాదు. ఒకవేళ మీరు ఈ ఐపీవోలో పాల్గొనాలనుకుంటే, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం మంచిది.
1991లో ప్రారంభమైన మ్యాన్‌కైండ్ ఫార్మా, మన దేశంలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటి. బ్రాండెడ్ జెనరిక్ మెడిసిన్స్‌తో పాటు; కంపెనీ అమ్ముతున్న ఫేమస్ బ్రాండ్లలో ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌లు, మ్యాన్‌ఫోర్స్ కండోమ్‌లు, గ్యాస్-ఓ-ఫాస్ట్ (Gas-O-Fast) ఆయుర్వేదిక్ యాంటాసిడ్స్, మొటిమలను తగ్గించే ఔషధం ఆక్నీస్టార్ (AcneStar) ఉన్నాయి.
ఈ ఏడాది మార్చి 31 నాటికి, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో సహా భారతదేశం అంతటా 23 తయారీ కేంద్రాలు ఉన్నాయి.
ఆదాయాలు
2020, 2021, 2022 ఆర్థిక సంవత్సరాల్లో, భారతదేశంలో కార్యకలాపాల ద్వారా వరుసగా ₹5,788.8 కోట్లు, ₹6,028 కోట్లు, ₹7,594.7 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. విదేశీ ఆదాయాన్ని కూడా కలుపుకుని చూస్తే, ఆయా సంవత్సరాల్లో భారతదేశ వ్యాపార వాటా వరుసగా 98.70%, 97.01%, 97.60%. భారత్ తరువాత దీని ప్రధాన మార్కెట్లు అమెరికా, స్టేట్స్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్.
అగ్రిటెక్ విభాగంలోకి ప్రవేశించడానికి మ్యాన్‌కైండ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించనున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ కంపెనీ ప్రకటించింది. రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ₹200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.