The Richest Village Madhapar: భారతదేశంలోని ఓ గ్రామం అనే ఆలోచన రాగానే దాదాపు అందరికీ ఒకేలాంటి చిత్రం మదిలో మెదులుతుంది. విద్యుత్, పాఠశాలలు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేకుండా మట్టి రోడ్లు, చిన్నపాటి ఇళ్లతో కూడిన ప్రాంతం స్ఫురిస్తుంది. కానీ గుజరాత్‌లోని ఒక గ్రామం.. గ్రామం అనే ఆలోచనను సమూలంగా మార్చేసింది. గ్రామాలకు సంబంధించిన అన్ని రకాల మూస పద్ధతులను/సమస్యలను విచ్ఛిన్నం చేసి ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామంగా మారింది. ఆ గ్రామం పేరు మాధాపర్.
అంబానీలు, అదానీల వంటి ధనిక వ్యాపారవేత్తలు, సంపన్నుల స్వరాష్ట్రమైన గుజరాత్‌లోని కచ్ జిల్లాలో మాధాపర్ (Madhapar) గ్రామం ఉంది. ఈ ఊరిలో 7,600 ఇళ్లు ఉన్నాయి, మొత్తం జనాభా 92,000. వీళ్ల కోసం ఏకంగా 17 బ్యాంకులు మాధాపర్‌లో పని చేస్తున్నాయి. పల్లెల మొహం చూడడానికి ఇష్టపడని హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఐసీఐసీఐ వంటి బ్యాంక్‌ల బ్రాంచ్‌లు కూడా ఈ ఊరిలో ఉండడం విశేషం.
భారత్‌లోనే అన్ని పల్లెల్లాగే మాధాపర్ కూడా వ్యవసాయ సంప్రదాయాలను కొనసాగిస్తూనే, ఆధునికతను కూడా స్వీకరించింది. 1990ల్లో, భారత్‌లో సాంకేతికత కొత్త పుంతలు తొక్కడం ప్రారంభమైనప్పుడు, మాధాపర్ ఆ మార్పును మనస్పూర్తిగా స్వీకరించింది. ఫలితంగా, ఆ గ్రామం భారతదేశంలోనే మొదటి హైటెక్ విలేజ్‌గా మారింది.
ఫుల్లీ లోడెడ్ బ్యాంక్ అకౌంట్స్
బ్యాంక్ డిపాజిట్ల పరంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామంగా మాధాపర్ నిలిచింది. మాధాపర్‌లోని 17 బ్యాంకుల బ్రాంచీల్లో దాదాపు రూ. 5,000 కోట్ల విలువైన డిపాజిట్లు ఉన్నాయి. ఒక్కో కుటుంబానికి సగటున 15 లక్షల విలువైన డిపాజిట్లు ఉన్నాయి. ఈ భారీ మొత్తానికి ప్రధాన కారణం యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడాలో నివసిస్తున్న నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (NRIలు). గ్రామంలోని 92,000 మంది జనాభాలో 65% మంది ఎన్నారైలే. ఈ ఎన్నారైలు తమ పుట్టిన ఊరితో సంబంధాలు కొనసాగిస్తూ, గ్రామాభివృద్ధికి భారీగా సహకరించారు. ఈ ఎన్నారైలు 1968లో లండన్‌లో ‘మధాపర్ విలేజ్ అసోసియేషన్’ పేరుతో ఒక సంస్థను కూడా స్థాపించారు. మాధాపర్ నుంచి యూకే వచ్చేవారికి సాయం చేయడం లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తుంది.
సౌకర్యాలు పుష్కలం
ముందే చెప్పుకున్నట్లు మాధాపర్ ఒక హైటెక్ విలేజ్. ఈ గ్రామంలో అడుగడుగునా సాంకేతికత ఉట్టి పడుతుంది. పాఠశాలలు, కళాశాలలు, ఆరోగ్య కేంద్రాలు, మంచినీరు, పారిశుద్ధ్యం, చక్కటి రహదార్లతో పాటు సరస్సులు, పచ్చదనం, ఆనకట్టల వంటి ప్రకృతి సౌందర్యానికి కూడా నిలయంగా నిలుస్తోంది. పురాతన దేవాలయాలు కూడా ఈ ఊరిలో ఉన్నాయి.
ఈ హైటెక్ విలేజ్‌లోకి ఎన్నారైలు డబ్బు వరద పారిస్తున్నప్పటికీ, ఇక్కడ నివసిస్తున్న వారి ప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ గ్రామ ఉత్పత్తులు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి.
మరో ఆసక్తికర కథనం: ఒక్కో మెట్టు దిగొస్తున్న గోల్డ్ రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి