LPG Price Hike: పండుగ సీజన్‌లో దేశ ప్రజల నెత్తిన 'బండ' పడేశాయి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (OMCలు). ఇప్పటికే ద్రవ్యోల్బణం దెబ్బతో విలవిల్లాడుతుంటే, LPG సిలిండర్ ధరను 100 రూపాయలకు పైగా పెంచాయి.


ఈ రోజు ‍‌(బుధవారం, 01 నవంబర్‌ 2023) నుంచి, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర (Commercial LPG Cylinder Price) 103.50 రూపాయల చొప్పున పెరిగింది. దీని ప్రభావం ముఖ్యంగా ఆహార పరిశ్రమ, రెస్టారెంట్ వ్యాపారంపై కనిపిస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్‌ రేట్స్‌ మరింత ఖరీదుగా మారే అవకాశం ఉంది.


వివిధ నగరాల్లో వాణిజ్య గ్యాస్‌ ధరలు 
ఈ రోజు నుంచి, దేశ రాజకీయ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ LPG సిలిండర్ ధర 101.50 రూపాయలు పెరిగి 1,833 రూపాయలకు చేరింది. గత నెల, అక్టోబర్ 1 న అది 1731.50 రూపాయలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 1,785.50 రూపాయలకు పెరిగింది. అక్టోబర్‌ 1న ఇది సిలిండర్‌కు 1684 రూపాయలుగా ఉంది. కోల్‌కతాలో 19 కిలోల గ్యాస్‌ బండ రేటు రూ. 103.50 పెరిగి రూ. 1,943కి చేరుకుంది, గత నెలలో రేటు రూ. 1839.50. చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,999.50 కి పెరిగింది, అక్టోబర్‌లో ఈ ధర రూ. 1898 గా ఉంది.


తెలుగు రాష్ట్రాల్లో... 
హైదరాబాద్‌లో రూ. 1,863.50, విజయవాడలో రూ. 1,796 వద్దకు చేరాయి.


గత నెలలో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను చమురు కంపెనీలు రూ. 209 పెంచి ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చాయి. ఇప్పుడు, వరుసగా రెండో నెలలోనూ వాణిజ్య గ్యాస్‌ బండ రేటును పెంచాయి.


డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌ రేటులో మార్పు లేదు
ఇళ్లలో వంటకు ఉపయోగించే దేశీయ LPG ధరలో  (Domestic LPG Cylinder Price) ఎలాంటి మార్పు లేదు, పాత రేటునే OMCలు కొనసాగించాయి. దేశంలోని ప్రధాన నగరాలను పరిశీలిస్తే... 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర దిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50, హైదరాబాద్‌లో రూ.955, విజయవాడలో రూ.944.50 గా ఉంది. రవాణా ఛార్జీలను బట్టి ఈ రేటులో స్వల్ప మార్పులు ఉండొచ్చు.


ఆగస్టులో ₹200 తగ్గిన డొమెస్టిక్‌ LPG రేటు
దేశంలోని మహిళలకు రక్షా బంధన్ బహుమతిగా, ఆగస్టు నెలలో, కేంద్ర ప్రభుత్వం దేశీయ ఎల్‌పీజీ ధరను రూ. 200 చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద మరో రూ. 200 సబ్సిడీకి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో, ఉజ్వల పథకం లబ్ధిదార్లకు ఒక్కో సిలిండర్‌ మీద మొత్తం రూ. 400 సబ్సిడీ లభించింది. ఆ ధరలు 30 ఆగస్టు 2023 నుంచి అమల్లోకి వచ్చాయి.


LPG సిలిండర్ రేటును ఎక్కడ చెక్‌ చేయాలి?
LPG సిలిండర్ రేటును ఆన్‌లైన్‌లో చెక్‌ చేయాలనుకుంటే, ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఈ సైట్‌లో LPG ధరలతో పాటు జెట్ ఫ్యూయల్‌, ఆటో గ్యాస్, కిరోసిన్ వంటి ఇంధనాల కొత్త రేట్లు కనిపిస్తాయి.


మరో ఆసక్తికర కథనం: సెన్సెక్స్ 63,830 దిగువన, నిఫ్టీ 19 వేల పైన - స్వల్ప నష్టాల్లో స్టార్టయిన స్టాక్‌ మార్కెట్లు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial