AP CM Camp Office In Vizag: వైజాగ్ లోని రుషికొండపైనే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయమని వైసీపీ సర్కార్ తేల్చేసింది. రుషికొండపైన ఉన్న రిసార్టు భవనాలే సీఎం క్యాంపు కార్యాలయానికి అనుకూలమని త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించింది. రుషికొండపై ఉల్లంఘనలు జరిగినట్లు హైకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా న్యాయస్థానం మంగళవారం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు కోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ రుషికొండపై ఉన్న భవనాలే సీఎం క్యాంపు కార్యాలయానికి అనుకూలమని ప్రభుత్వం నిర్ణయించింది. అది సీఎం క్యాంపు కార్యాలయమంటూ లాంఛన ప్రకటన జారీ మాత్రమే మిగిలింది.


జగన్ కు త్రిసభ్య కమిటీ నివేదిక
ఉల్లంఘనల ప్రభావం పర్యావరణంపై ఏ మేరకు ఉంటుందనేది మదింపు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. పర్యావరణ చట్టం ప్రకారం శిక్షించే విషయాన్నీ పరిశీలించాలని సూచించింది. అయినప్పటికీ రుషికొండ రిసార్టు భవనాలే సీఎం క్యాంపు కార్యాలయానికి అనుకూలమైన ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా త్రిసభ్య కమిటీ సిఫార్సును తెరపైకి తెచ్చింది. విశాఖలో ముఖ్యమంత్రి, మంత్రుల క్యాంపు కార్యాలయాలు, అధికారులకు తాత్కాలిక వసతి కోసం భవనాల ఎంపికకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు సీఎం జగన్‌ను కలిసి మాట్లాడారు. ముఖ్యమంత్రి, కార్యదర్శుల కార్యకలాపాలకు, రుషికొండపై ఉన్న భవనాలు సరిపోతాయని,  పార్కింగ్‌, కార్యాలయం, వసతి, భద్రతా సిబ్బందికి ఇబ్బంది ఉండదని త్రిసభ్య కమిటీ సీఎంకు ఇచ్చిన నివేదికలో తెలియజేసింది. 


కళింగ బ్లాక్‌లో సీఎంవో
సీఎం కుటుంబంతో ఉండేందుకు విజయనగర బ్లాక్‌ను  3,764 చ.మీ.లతో నిర్మాణం చేస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే సముద్రం అందాలు ఆహ్లాదకరంగా కనిపించనున్నాయి. ఇందులోనే ప్రెసిడెన్షియల్‌ సూట్‌ గదులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం కళింగ బ్లాక్‌ను సిద్ధం చేస్తున్నారు అధికారులు. 5,753 చ.మీ.లలో కళింగ బ్లాక్ నిర్మాణం చేపట్టినప్పటికీ, ఆ తర్వాత 7,266 చ.మీ.లకు పెంచారు. ప్రస్తుతం నిర్మిస్తున్న నాలుగు భవనాల్లో ఇదే పెద్దది.  1,821.12 చ.మీ.లలో వేంగి బ్లాకులను ఇప్పటికే సిద్ధం చేయగా, 690.40 చ.మీ.లలో నిర్మిస్తున్న గజపతి బ్లాక్‌ పనులు చివరి దశలో ఉన్నాయి.  ముఖ్యమంత్రి విమానాశ్రయం నుంచి రుషికొండకు హెలికాప్టర్‌ ద్వారా చేరుకునేలా బీచ్‌లోని హెలిప్యాడ్‌ ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో హెలీ టూరిజం నిర్వహించిన సమయంలో హెలిప్యాడ్‌ నిర్మించారు. అక్కడి నుంచి నేరుగా రుషికొండకు చేరుకునేలా ఇప్పటికే ఒక మార్గాన్ని కొండ వెనుక నుంచి ఏర్పాటు చేస్తున్నారు.


24 గంటలూ నిఘా
ముఖ్యమంత్రి విమానాశ్రయం నుంచి రుషికొండకు హెలికాప్టర్‌ ద్వారా చేరుకునేలా బీచ్‌లోని హెలిప్యాడ్‌ ఉపయోగిస్తారన్న ప్రచారం సాగుతోంది. రుషికొండ చుట్టూ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసేశారు. కొండ చుట్టూ మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు పెట్టారు. 24 గంటలూ నిఘా పెట్టారు. కొండ వద్ద విశాఖ- భీమిలి బీచ్‌ రోడ్డు వైపు రెండు, కొండ వెనుక సముద్ర తీరంలో ఒక తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరూ రాకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. త్రిసభ్య కమిటీ కూడా రుషికొండ పైన ఉన్న భవనాలు సీఎం కార్యాలయానికి అనుకూలమని నివేదిక సమర్పించడంతో గస్తీ మరింత పెంచనున్నారు.