Income Tax Return 2025: ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఎలాంటి ఆడిట్ చేయించుకోవలసిన అవసరం లేని వ్యక్తులు, సంస్థలకు చివరి తేదీ సెప్టెంబర్ 15. మరో రెండు వారాల్లో ఐటీ రిటర్న్ దాఖలు చేయడానికి గడువు మిగిలి ఉంది. ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ SMS రిమైండర్‌లను పంపడం మొదలుపెట్టింది. ఈ SMSలో ఇలా పేర్కొంది. ఇప్పటివరకు 3 కోట్లకు పైగా ITRలు దాఖలయ్యాయి. మీరు దయచేసి 15.09.25 (సెప్టెంబర్ 15వ తేదీ) లోపు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ మీ ITRని దాఖలు చేసి, ఇ-వెరిఫై చేయండి. కొన్ని రోజుల కిందట ఐటీఆర్ ఫైల్ చేసిన వారికి రీఫండ్ ప్రక్రియ మొదలైంది.

ఏడాదికి 3 లక్షల జీతం ఉన్నవారు ఐటీ రిటర్న్ నింపాలా?

సెప్టెంబర్ 15లోపు ఎవరెవరు ITR రిటర్న్స్ సమర్పించాలి. ఏడాదికి 3 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలా? ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం..0 నాంగియా & కో. LLP ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజోలి మహేశ్వరి దీనిపై స్పందించారు. ''ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి ఆదాయ పరిమితి పన్ను చెల్లింపుదారుని మొత్తం ఆదాయంతో పాటు ఎంచుకున్న పన్ను విధానం (Tax Regime) పాత లేదా కొత్త అనే దానిపై ఆధారపడి ఉంటుంది.''

ఆమె ఇంకా మాట్లాడుతూ ''మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే ఎక్కువగా ఉంటే, పన్ను చెల్లింపుదారు (Tax Payers) తప్పనిసరిగా ITR దాఖలు చేయాలి. కొత్త పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ. 3 లక్షలు ఉండగా, పాత పన్ను విధానానికి పరిమితి రూ. 2.5 లక్షలు'' అని తెలిపారు.

విద్యార్థులు ITR నింపాలా?

సాధారణంగా ఉద్యోగం చేసేవారు లేదా వ్యాపారం చేసేవారు ఐటీఆర్ సమర్పించాలి అని ప్రజలు అనుకుంటారు. అయితే అందులో వాస్తవం లేదు. నేడు, విద్యార్థులు, నిరుద్యోగ యువతను కూడా తమ ITRని దాఖలు చేయాలని ప్రోత్సహిస్తున్నారు. వారి ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు అని సూచిస్తున్నారు. కానీ వారికి ఇది తప్పనిసరి కాదు. ఎందుకంటే ITR ఫైల్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు, ఇది ఆర్థిక విశ్వసనీయత, మీ నిజాయితీని పెంచుతుంది. మీ ఆదాయం పన్ను పరిధిలో ఉంటే కనుక రీఫండ్ క్లెయిమ్ చేసుకోవడం సులభం అవుతుంది. ఏ ఇబ్బంది లేకుండా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసుకోవడానికి వీలుంటుంది. లేకపోతే మీరు చేసే నగదు బదిలీ, వ్యాపార, ఆర్థిక లావాదేవిలతో చిక్కుల్లో పడతారు.