Balakrishna Reaction On World Book Of Records Honor: తన తల్లిదండ్రుల తర్వాత ఫ్యాన్స్, సినీ దర్శక నిర్మాతలే తనకు స్ఫూర్తి అని గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అరుదైన గౌరవాన్ని ఆయన దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య... ఏపీలోనూ చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తనకు అరుదైన గౌరవం అందించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఏపీ మంత్రి లోకేశ్, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, సీనియర్ నటి జయసుధ ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

కళకు భాష, ప్రాంతీయ భేదం లేదు

కళకు భాష, ప్రాంతీయ భేదం లేదని... సినిమా ఎప్పుడూ సినిమానే అని అన్నారు బాలకృష్ణ. 'నాకు జన్మనిచ్చిన నా గురువు, దైవం విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారికి, నా తల్లి బసవ రామ తారకం గారికి ఘన నివాళి అర్పిస్తున్నా. నాది చాలా పెద్ద కుటుంబం. నాన్న నుంచి వారసత్వంగా వచ్చింది. ఫ్యాన్స్, దర్శక నిర్మాతలే నాకు స్ఫూర్తి. అందరికీ నేను రుణపడి ఉన్నా. ప్రస్తుతం తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ఆస్కార్ అవార్డులు సాధించింది. తెలుగు వారి సత్తాను సినిమా రంగం ద్వారా ప్రపంచానికి చూపించుకోగలుగుతున్నాం. అందరూ గర్వించే సమయం ఇది.' అని అన్నారు.

ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి

ఏపీలోనూ సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని బాలకృష్ణ అన్నారు. 'ఏపీలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. వాటిని గుర్తించి డెవలప్ చేయాలి. దీని ద్వారా ఉద్యోగ కల్పన చేయాలి. న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలి. కళకు భాష, ప్రాంతం ఇలాంటి భేదాలేవీ ఉండవు.' అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల వల్ల ఎంతో మంది నిరాశ్రయులయ్యారని... రైతులు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారని బాలయ్య అన్నారు. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Also Read: బాలయ్యకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అరుదైన గౌరవం - భారతీయ చిత్ర పరిశ్రమలో ఫస్ట్ హీరోగా...