Nandamuri Balakrishna Recieves Rare Honor Of World Book Of Records: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం లభించింది. యూకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయన పేరును ఇటీవల చేర్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆయనకు ప్రతినిధులు గుర్తింపు పత్రం అందించారు. దీంతో పాటే మెడల్ అందించి సన్మానం చేశారు. బాలయ్య పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్టెన్ ఎడిషన్‌లో చేరింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ అవార్డుకు ఎంపికైన ఫస్ట్ హీరోగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ వేడుకలో ఆయన అల్లుడు, ఏపీ మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, సీనియర్ నటి జయసుధ పాల్గొన్నారు.
భారతీయ సినిమాలో హీరోగా 50 ఏళ్లుగా సినీ కళామ తల్లికి బాలయ్య చేసిన విశేష సేవలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఈ గౌరవం పొందిన ఫస్ట్ ఇండియన్ హీరోగా ఆయన నిలిచారు. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్'... ఇండియా, USA, కెనడా, స్విట్జర్లాండ్, UAE, యూకేల్లో విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి ఈ గౌరవం అందిస్తుంది. గత 5 దశాబ్దాలుగా సినీ పరిశ్రమతో పాటు బసవతారకం ఇండో క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతోమందికి ఉచితంగా చికిత్స అందించి సమాజానికి నిరంతర సేవ చేసిన బాలయ్యకు ఈ గౌరవం దక్కింది.
Also Read: హిజ్ నేమ్ ఈజ్ ప్రసాద్ బెహర - పర్ఫెక్ట్ కామెడీ పంచెస్... హిట్ వెబ్ సిరీస్‌లకు కేరాఫ్ అడ్రస్
నా ముద్దుల మామయ్య
బాలకృష్ణ అందరికీ బాలయ్య బాబు అయితే... తనకు ముద్దుల మామయ్య అని ఏపీ మంత్రి లోకేశ్ అన్నారు. చరిత్ర సృష్టించాలన్నా... దాన్ని తిరగ రాయాలన్నా అది బాలకృష్ణకే సాధ్యమన్నారు. 50 ఏళ్లుగా సినీ రంగంలోనే కాకుండా పాలిటిక్స్‌లోనూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారని కొనియాడారు. 'బాలయ్య బాబు ఎప్పుడూ యంగ్‌గానే ఉంటారు. తన కెరీర్‌లో ఎన్నో జానర్స్‌లో మూవీస్ చేశారు. చారిత్రక, జానపద, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ ఇలా ఏదైనా పాత్రలో ఒదిగిపోతారు. అందుకే సినీ పరిశ్రమ ఆయన్ను అమితంగా ప్రేమిస్తుంది. బసవతారకం ఆస్పత్రి ఆయనలోని మానవత్వానికి నిదర్శనం. బాలయ్య లాంటి వ్యక్తి పరిశ్రమలో మరొకరు లేరు. ఓటీటీలో ఆయన చేసిన అన్ స్టాపబుల్ నిజంగా ఓ రికార్డే. బాలయ్యకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం నిజంగా గర్వకారణం.' అంటూ ప్రశంసించారు.
తెలుగు ప్రజలకు గర్వకారణం
బాలకృష్ణకు ఈ గౌరవం దక్కడం తెలుగు ప్రజలకు గర్వ కారణమని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆయన వయసు 65 ఏళ్లైనా 25 ఏళ్ల కుర్రాడిలా యంగ్‌గా కనిపిస్తారని ప్రశంసించారు. 'తాను చెప్పాలనుకున్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్తారు బాలయ్య. 50 ఏళ్లు సినీ పరిశ్రమలో హీరోగా ఉండడం గొప్ప విషయం. డాక్టర్ కావాల్సిన బాలయ్య యాక్టర్ అయ్యి కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. ఇదే జోష్‌తో బాలయ్య రాణించాలి.' అంటూ ఆకాంక్షించారు.