Pawan Kalyan Sena tho Senani:  విశాఖలో సేనతో సేనాని కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. మూడు రోజులుగా జరుగుతున్న పార్టీ కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం జనసేన కార్యకర్తలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలి వచ్చారు. ఒడిషా, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. 

వీరిలో కర్ణాటక కార్యకర్తలు కర్ణాటక రాష్ట్ర కండువా,  జెండాను తీసుకు వచ్చారు. జనసేన జెండాలతో కలిపి ఆ జెండాను కూడా కార్యకర్తలు ప్రదర్శించారు. దీంతో పవన్ కల్యాణ్ ఆ జెండాతో పాటు కండువాలను ను తెప్పించుకున్నారు. మెడలో వేసుకుని జెండాను ఊపారు. దీంతో సభ జరుగుతున్న ప్రాంతం మార్మోగిపోయింది.  

 దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక జెండా లేదు కానీ కర్ణాటకకు ఉంది కానీ అది అధికారికం కాదు.  భారతదేశంలో రాష్ట్రాలకు జెండాలు ఉండవు.  కానీ కర్ణాటక ప్రభుత్వంతోపాటు   ప్రజలంతా కర్ణాటక జెండాను తమ గుర్తుగా చూస్తారు.  కర్ణాటకలో ఎక్కడికి వెళ్లినా ఆ జెండా కనిపిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఆ జెండాను గౌరవిస్తాయి. పవన్ కల్యాణ్ కూడా ఆ గౌరవం ఇచ్చారని కర్ణాటక జనసేన పార్టీ అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. . పవన్ కల్యాణ్‌కు కర్ణాటకలోనూ పెద్ద  ఎత్తున ఫాలోయింగ్ ఉంది. ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలు మాత్రమే కాకుండా జనసేన పార్టీకి స్వచ్చమైన కన్నడిగులు కూడా కార్యకర్తలుగా ఉన్నారని భావిస్తున్నారు. 

ఇక తమిళనాడు, ఒడిషా, తెలంగాణ నుంచి కూడా భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. తమిళనాడులో పవన్ కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ గతంలో.. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ప్రశ్నించారు. దీంతో  తమిళనాడులోనూ పవన్ భావజాలంపై విస్తృత చర్చ జరిగింది. నిజానికి పవన్ కల్యాణ్ ..కర్ణాటక రాష్ట్ర జెండాను మెడలో వేసుకున్నప్పుడు అందరూ.. అది విజయ్ పార్టీ జెండా అనుకున్నారు.  విజయ్ టీవీకే పార్టీ జెండా కూడా అలాగే ఉంటుంది.  కానీ తర్వాత క్లారిటీ వచ్చింది.  విజయ్ కూడా.. పవన్ కల్యాణ్ లాగే సినిమాల్లో స్టార్ గా మారి రాజకీయాల్లోకి రావడంతో ఆయనకు మద్దతుగా పవన్ కండువా మెడలో వేసుకున్నారని అనుకున్నారు.         

ఒడిషా, తెలంగాణ నుంచి కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అందుకే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అక్కడ కూడా జనసేన పార్టీ భావజాలం పట్ల ఆకర్షితులయ్యే వారినిపార్టీలోకి తీసుకుని పార్టీని బలోపేతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నరు.