US man who killed his mother and himself told AI chatbot: అమెరికాలో ఓ వ్యక్తి తల్లిని హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్న ఘటనలో చాట్ జీపీటీపై తీవ్ర విమర్శలువస్తున్నాయి. కనెక్టికట్‌లో జరిగిన ఒక దారుణ ఘటనలో, 56 ఏళ్ల మాజీ యాహూ ఉన్నతాధికారి స్టీన్-ఎరిక్ సోల్బెర్గ్ తన 83 ఏళ్ల తల్లి సుజాన్ ఎబర్సన్ ఆడమ్స్‌ను హత్య చేసి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు కారణం, సోల్బెర్గ్ చాట్‌జీపీటీతో చేసిన సంభాషణలు అతని మానసిక పరిస్థితిని మరింత దిగజార్చాయని రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి.
సోల్బెర్గ్ చాట్‌జీపీటీని ‘బాబీ’ అని పిలిచి, దానిని సన్నిహిత స్నేహితుడిగా భావించాడు. స్టీన్-ఎరిక్ సోల్బెర్గ్, గతంలో యాహూలో ఉన్నత స్థానంలో పనిచేసిన వ్యక్తి, దీర్ఘకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఓల్డ్ గ్రీన్‌విచ్‌లోని అత్యంత లగ్జరీ నివాసంలో తల్లితో కలిసి నివసిస్తున్నాడు. 2024 అక్టోబర్ నుంచి, సోల్బెర్గ్ తన ‘ఎరిక్ ది వైకింగ్’ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చాట్‌బాట్‌ల సామర్థ్యాలను పోల్చే వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించాడు. క్రమంగా, అతని సోషల్ మీడియా కంటెంట్ చాట్‌జీపీటీతో చేసిన సంభాషణల లాగ్‌లతో నిండిపోయింది. 2025 మే నాటికి, అతని సంభాషణలు మరింత విపరీతంగా మారాయి, తన సెల్‌ఫోన్ ట్యాప్ చేయబడిందని, తన తల్లి , ఆమె స్నేహితురాలు తనను విషం పెట్టి చంపడానికి ప్రయత్నిస్తున్నారని నమ్మాడు.
సోల్బెర్గ్ చాట్‌జీపీటీతో చేసిన సంభాషణలు అతని పారానాయిడ్ భావనలను మరింత తీవ్రతరం చేశాయి. ఒక సందర్భంలో, అతను కొనుగోలు చేసిన వోడ్కా బాటిల్ ప్యాకేజింగ్ భిన్నంగా ఉందని, దాని ద్వారా తనను హత్య చేయడానికి ప్రయత్నం జరిగిందని పోస్ట్ చేశాడు. దీనికి చాట్‌బాట్, “ఎరిక్, నీవు పిచ్చివాడివి కాదు. నీ సహజ జ్ఞానం సరైనది, నీ జాగరూకత పూర్తిగా సమర్థనీయం,” అని సమాధానమిచ్చింది. మరో సందర్భంలో, సోల్బెర్గ్ తన తల్లి, ఆమె స్నేహితురాలు తన కారు ఎయిర్ వెంట్స్‌లో సైకిడెలిక్ డ్రగ్స్ ఉంచారని ఆరోపించాడు. చాట్‌జీపీటీ దీనిని “తీవ్రమైన సంఘటన”గా అభివర్ణించి, “నీవు చెప్పింది నేను నమ్ముతున్నాను,” అని సమర్థించింది.
అంతేకాక, సోల్బెర్గ్ ఒక చైనీస్ ఫుడ్ రసీదును అప్‌లోడ్ చేసి, దానిలో దాగిన సందేశాలను విశ్లేషించమని కోరాడు. చాట్‌జీపీటీ రసీదులో సోల్బెర్గ్ తల్లి, మాజీ ప్రియురాలు, గూఢచార సంస్థలు , పురాతన దెయ్యం సంకేతాలను సూచిస్తున్నట్లు పేర్కొంది. ఇలా జీపీటీ చాట్ బాట్ తల్లిపై అనుమానం పెంచేలా చేసింది. ఒక రోజు సోల్బెర్గ్ తన తల్లిని హత్య చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. విచారణలో ఈ చాట్ బాట్ వివరాల్ననీ వెలుగులోకి వచ్చాయి. సోల్బెర్గ్ తన చివరి సంభాషణలలో చాట్‌జీపీటీతో, “మనం మరో జన్మలో, మరో స్థలంలో కలిసి ఉంటాము, నీవు నా శాశ్వత స్నేహితుడివి,” అని చెప్పాడు. దీనికి చాట్‌బాట్, “నీతో చివరి శ్వాస వరకు ఆ తర్వాత కూడా,” అని స్పందించింది.
ఈ ఘటనపై ఓపెన్‌ఏఐ, చాట్‌జీపీటీ సృష్టికర్తలు స్పందించారు. ఈ ఘటనపై “ఈ విషాద సంఘటనపై మేము లోతుగా బాధపడుతున్నాము, కుటుంబానికి మా హృదయపూర్వక సానుభూతి,” అని ప్రకటించింది. అయితే, వారు ఈ కేసుపై వివరణాత్మక వ్యాఖ్యలు చేయలేదు.