American brand globally in toilet Former NSA slams Trump: టారిఫ్‌ల పేరుతో ట్రంప్ చేస్తున్న పిచ్చిపనులపై ఆ దేశంలో ఆగ్రంహ వ్యక్తమవుతోంది. పలువురు ప్రముఖులు భారత్ ను దూరం చేసుకోవడం పిచ్చిపని అని మండిపడుతున్నారు. తాజాగా అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) జేక్ సుల్లివన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై విధించిన 50 శాతం టారిఫ్‌లను తీవ్రంగా విమర్శించారు. భారత్‌తో దశాబ్దాలుగా నిర్మించిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దెబ్బతీస్తూ, భారత్‌ను చైనాతో దగ్గరి సంబంధాల వైపు ట్రంప్ నెట్టేస్తున్నారని మండిపడ్డారు. ఈ టారిఫ్‌లను జేక్ “ భారీ వాణిజ్య దాడి”గా అభివర్ణించారు. అమెరికా ప్రపంచ ఖ్యాతి టాయిలెట్‌లో పడిపోయిందన్నారు. ‘ది బుల్వార్క్ పాడ్‌కాస్ట్’లో టిమ్ మిల్లర్‌తో మాట్లాడుతూ జేక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ రష్యన్ చమురు కొనుగోళ్లను కొనసాగిస్తున్నందుకు భారత ఎగుమతులపై 50 శాతం టారిఫ్‌లను విధించారు. ఇందులో 25 శాతం అదనపు జరిమానా టారిఫ్ కూడా ఉంది. ఈ టారిఫ్‌లు భారత జవళి, ఆభరణాలు, యాంత్రిక ఉపకరణాల వంటి రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, దాదాపు 48.2 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లవచ్చని అంచనా. ఏ కారణం చెప్పినా ఈ టారిఫ్‌ల వెనుక ట్రంప్ వ్యక్తిగత అసంతృప్తి, భారత్-పాకిస్తాన్ సంఘర్షణలో మధ్యవర్తిత్వం చేయడానికి అనుమతించకపోవడం వల్లనే ఈ నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
జేక్ సుల్లివన్, జో బైడెన్ పరిపాలనలో ఎన్‌ఎస్‌ఏగా పనిచేశారు. ఈ టారిఫ్‌లు అమెరికా ప్రపంచ భాగస్వాముల మధ్య విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని, చైనా దీనిని ఒక అవకాశంగా ఉపయోగించుకుంటోందని ఆయన హెచ్చరిస్తున్నారు. అమెరికాను నమ్మదగిన భాగస్వామిగా భావించే దేశాలు ఇప్పుడు యూఎస్ నుంచి దూరం కావాలని ఆలోచిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌తో దశాబ్దాలుగా నిర్మించిన ద్వైపాక్షిక సంబంధాలను ఈ చర్యలు నాశనం చేస్తున్నాయని, భారత్ ఇప్పుడు చైనాతో సమావేశాలు జరపాల్సిన పరిస్థితిని ట్రంప్ సృష్టించారని సుల్లివన్ ఆరోపించారు..
గత రెండు దశాబ్దాలుగా, అమెరికా , భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం చైనా పెరుగుతున్న ప్రభావాన్ని అడ్డుకోవడానికి ఒక కీలక అంశంగా ఉంది. ఈ బంధాన్ని బలోపేతం చేయడానికి రెండు దేశాలు ద్వైపాక్షికంగా కృషి చేశాయి. అయితే, ట్రంప్ యొక్క టారిఫ్‌లు ఈ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. భారత్‌ను చైనా, రష్యాతో దగ్గరి సంబంధాల వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు ఏడేళ్ల తర్వాత మొదటి సారిగా సందర్శనకు వెళ్తున్నారు.