చూస్తుంటే ఇండియాకు మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తోంది! రూపీ-రియాల్‌ (Rupee Rial trade) చెల్లింపుల పద్ధతిలో తాము కావాల్సినంత ముడి చమురును ఎగుమతి చేస్తామని ఇరాన్‌ భారీ ఆఫర్‌ ఇస్తోంది. ఇందుకు మోదీ ప్రభుత్వం అంగీకరిస్తే 30 బిలియన్‌ డాలర్ల మేరకు వాణిజ్యం పెరగనుంది. డాలర్‌తో పనిలేదు కాబట్టి రూపాయీ బలపడే ఛాన్సుంది! పైగా పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గే అవకాశం లేకపోలేదు! ముడి చమురు ఎగుమతికి రూపీ-రియాల్‌ ట్రేడ్‌ను తిరిగి ఉపయోగించుకుందామని భారత్‌లో ఇరాన్‌ రాయబారి అలీ చెంగానీ అంటున్నారు.


ఇండియాకు ఒకప్పుడు రెండో అతిపెద్ద చమురు స్లపయర్‌గా ఇరాన్‌ (Iran) ఉండేది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశంలో న్యూక్లియర్ డీల్‌ను ఉపసంహరించుకోవడం, వారి చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో భారత్‌ వెనక్కి తగ్గింది.


'రూపీ-రియాల్‌ పద్ధతిలో ముడిచమురు ఎగుమతి చేయడం ద్వారా ఇండియా ఇంధన అవసరాలు తీర్చేందుకు ఇరాన్‌ సిద్ధంగా ఉంది' అని ఎంవీఐఆర్‌డీసీ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో చెంగానీ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. 'రూపీ-రియాల్‌ ట్రేడ్‌ పద్ధతిని పునరుద్ధరించడం వల్ల రెండు దేశాల్లోని కంపెనీలు నేరుగా లాభపడతాయి. థర్డ్‌పార్టీ ఇంటర్మీడియేషన్‌ ఖర్చులు ఉండవు' అని ఆయన అన్నారు. 


చాలా రోజులు భారత్‌, ఇరాన్‌ ట్రేడ్‌ సెటిల్‌మెంట్‌ కోసం రూపీ-రియాల్‌ బార్టర్‌ తరహా పద్ధతిని అనుసరించాయి. ఇండియన్‌ ఆయిల్‌ రిఫైనరీలు స్థానిక ఇరాన్‌ బ్యాంకుల్లో రూపాయిల్లో చెల్లించేవి. అవే నిధులను ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకు ఉపయోగించేది. దాంతో సౌదీ అరేబియాను మించి ఇరానే మనకు అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా మారింది. 2019లో రెండు దేశాల మధ్య 17 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరగ్గా ఆంక్షల వల్ల ప్రస్తుతం ఇది 2 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోయింది.


ప్రస్తుతం చమురును భారత్‌కు ఎగుమతి చేసేందుకు ఇరాన్‌ భారీ ఆశలు పెట్టుకొంది. ఇరాన్‌-పాకిస్థాన్‌-ఇండియా పైప్‌లైన్‌ ప్రాజెక్టును మరో దారిలో నిర్మించేందుకు దారులో వెతుకుతోంది. ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా నుంచి క్రూడాయిల్‌ను కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధంగా ఉండటంతో ఇరాన్‌ మనపై నమ్మకం పెట్టుకున్నట్టుంది. అతి తక్కువ ధరలకే ఇండియన్‌ ఆయిల్‌ 3 మిలియన్‌ బ్యారెళ్లు, బీపీసీఎల్‌ 2 మిలియన్‌ బ్యారెళ్లు క్రూడాయిల్‌ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది.


Also Read: డిజీలాకర్‌లో మీ డాక్యుమెంట్లు ఉన్నాయా? అయితే ఇది మీ కోసమే!!


Also Read: ఈ డేంజర్‌ వైరస్‌ మీ ఆండ్రాయిడ్‌ ఫోన్లో చొరబడిందంటే! డబ్బంతా మాయం!


Also Read: పెళ్లి ఖర్చులకు పీఎఫ్‌ డబ్బు కావాలా? సింపుల్‌గా ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేయండి!