Kurnool Jail : కర్నూలు జిల్లా జైలు నుంచి రిమాండ్ ఖైదీ(Remand Prisoner) నాని మళ్లీ పరారయ్యాడు. శనివారం ఉదయం బాత్ రూమ్ కు వెళ్తున్నానని చెప్పి గోడ దూకి పారిపోయాడు. విషయం తెలుసుకున్న జైలు సిబ్బంది ఖైదీ నాని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహానంది(Mahanandi) మండలం అభిపురానికి చెందిన నాని హత్యాయత్నం కేసులో గత నెల 16వ తేదీ నుంచి జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈనెల 12న ఉదయం ఖైదీలను బయటకు వదిలిన సమయంలో ఖైదీ నాని గోడ దూకి ఉడాయించాడు. గమనించిన జైలు సిబ్బంది అదే రోజు రాత్రి నానిని పట్టుకొచ్చి జైలులో ఉంచారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం బాత్ రూమ్ కు అని చెప్పి మరోసారి గోడ దూకి పరారయ్యాడు. చెట్లు ఎక్కే అనుభవం ఉండటంతో ఎత్తైన గోడను సైతం చాలా ఈజీగా ఎక్కి పరారైనట్లు తెలుస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే ఖైదీ నాని రెండుసార్లు పరారవ్వడంపై జైళ్ల శాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
వారం రోజుల క్రితం పరారీ, మళ్లీ జైలు
కర్నూలు జిల్లా పంచలింగాల కారాగారం నుంచి రిమాండ్ ఖైదీ కుల్లాయి అలియాస్ నాని మళ్లీ పరారయ్యాడు. వారం క్రితమే ఈ ఖైదీ కర్నూలు సబ్ జైలు(Kurnool Sub Jail) అధికారుల కళ్లుగప్పి తప్పించుకుపోగా, కుటుంబ సభ్యులు అతన్ని మందలించి రెండ్రోజుల క్రితమే జైలర్ కు తిరిగి అప్పగించారు. ఖైదీని అప్పగించి మూడు రోజుల కాకముందే మరోసారి జైలు సిబ్బంది కళ్లు గప్పి ఖైదీ నాని మళ్లీ తప్పించుకోవడం గమనార్హం. నిరంతరం సీసీ కెమెరాలు పహారా, సిబ్బంది నిఘా, ఎత్తైన ప్రహరీ గోడ, వీటి చుట్టూ ఇనుప కంచె, తీగలకు విద్యుత్ ప్రసారం ఉన్నప్పటికీ ఖైదీ పరారవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను సీరియస్ గా పరిగణించిన జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పంచలింగాల సమీపంలోని జైలును స్వయంగా పరిశీలించారు. ఖైదీ తప్పించుకున్న తీరుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో జైలర్, జైలు సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అన్నారు.
జైలు సిబ్బంది నిర్లక్ష్యం
ఇటీవలె కర్నూలు జిల్లా జైలును ఆధునికీకరణ చేశారు. జైలు కాంపౌండ్ వాల్స్ అందనంత ఎత్తులో నిర్మించారు. గోడల పైన ఎలక్ట్రిక్ పెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా గోడను ఎక్కితే కరెంట్ షాక్‌కు గురవుతారు. ఒకవేళ అన్నింటినీ తట్టుకుని గోడపై నుంచి దూకినా కాళ్లు చేతులు విరిగే అవకాశం ఉంది. ఇలాంటి జైలు నుంచి ఖైదీ తప్పించుకున్నాడు. హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న ఓ ఖైదీ పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం తిరిగి జైలులో ప్రత్యక్షమయ్యాడు. దీంతో జైలు అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నాని ఓ హత్య కేసులో అరెస్టు అయి ఫిబ్రవరి నుంచి జిల్లా జైలులో ఉంటున్నాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పోలీసుల పహారా ఉన్నా ఖైదీ జైలు నుంచి ఎలా పారిపోతున్నాడని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జైళ్లశాఖ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమనే ఆరోపణలున్నాయి.