కృష్ణా జిల్లా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో టెండర్ల నిర్వహణ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భక్తులు సమర్పించిన చీరల విక్రయాల టెండర్లతో పాటుగా టోల్ గేట్ నిర్వహణ టెండర్,సెక్యూరిటీ టెండర్ నిర్వహణ విషయాల్లో ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.టెండర్లు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించకపోవటంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం టెండర్ జరగలేదా!
టెండర్ పిలిచిన తరువాత షెడ్యూల్ ప్రకారం టెక్నిల్ బిడ్ ప్రైజ్ బిడ్ తెరిచిన తరువాత నిబంధనల ప్రకారం టెండర్ కేటాయించాలి. అయితే సెక్యూరిటీ టెండర్ విషయంలో అనుమాలు వ్యక్తం చేస్తున్నారు. గత నెల 25న జరిగిన టెండర్లు తొమ్మిది మంది దాఖలు చేయగా టెక్నికల్ బిడ్ ప్రకారం నలుగురు అందుకు అర్హత సాధించారు. ప్రైజ్ బిడ్ ను తెరచి రివర్స్ టెండరింగ్ పిలవగా అందులో ఒకరు అనర్హులయ్యారు. మిగతా ముగ్గురిలో ఒకరికి టెండర్ నిర్ధారించడానికి డాక్యుమెంట్ల పరిశీలన పేరిట రెండు వారాలుగా కాలం గడుపుతున్నారు, అదేమంటే, స్పందించిన అదికారులు లేరని టెండర్ దారులు అంటున్నారు.
అధికారులపై రాజకీయ ఒత్తిడి ఉండటంతో టెండర్ ఖరారులో జాప్యం జరుగుందన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో దేవస్థానం అదికారులు చీరల టెండర్ పిలిచారు. ఏడాదికి నాలుగు కోట్ల ఆదాయం వచ్చే చీరల టెండర్ను కరోనా సాకుగా చూపించి, మూడు కోట్ల రూపాయలకే దేవస్థానం కట్టబెట్టిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే నిర్వహణ భారం తగ్గిందని అధికారులు, పాలకమండలి తమ వాదన వినిపించారు. టోల్ గేట్ వ్యవహారంలో కూడ గతంలో కాంట్రాక్టర్ దేవస్థానానికి 25 లక్షల రూపాయలు చెల్లించకుండా ఏడాది పాటు భక్తుల నుంచి టోల్ టాక్స్ కింద డబ్బులు వసూలు చేశారు.
దేవస్థానానికి నిర్దిష్ట ఆదాయం వస్తున్నప్పటికి, టోల్ వసూళ్ళను కూడా టెండర్ పిలిచేందుకు దేవస్థానం అధికారులు సన్నాహాలు చేయటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే నిబంధనల మేరకే సెక్యూరిటీ టెండర్ ను పిలిచి షెడ్యూల్ ప్రకారం టెక్నిల్ బిడ్ నిర్వహిస్తామని అదికారులు చెబుతున్నారు. దేవస్థానానికి బాకీ పడిన కాంట్రాక్టర్లుకు నోటీసులు ఇచ్చామని స్పందించమని పక్షంలో బ్లాక్ లిస్టులో పెడతామని వివరణ ఇస్తున్నారు. మరి అధికారులు చర్యలు రాజకీయ ఒత్తిళ్లు ఉన్న క్రమంలో ఎంత వరకు ఫలితాలు ఇస్తాయన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలి.
Also Read: Pegasus YSRCP TDP : "పెగాసస్"పై అప్పుడే క్లారిటీ ఇచ్చిన గౌతం సవాంగ్ - ఇప్పుడు వాడేస్తున్న టీడీపీ