పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు నిజమో కాదో స్పష్టత లేదు. ఆమె అలా అన్నట్లు ఉన్న వీడియో ఎక్కడా కనిపించడం లేదు. కానీ ఏపీలో రాజకీయ నేతలు మాత్రం ఒకరిపై ఒకరు బురద చల్లేసుకుంటున్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు టీడీపీపై ఎదురుదాడి చేయడానికి మమతా బెనర్జీ స్టేట్‌మెంట్‌ను ఓ పెద్ద ఆయుధంగా ఉపయోగించుకుని సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభించారు.  


 



తెలుగుదేశం పార్టీ కూడా వెంటనే కౌంటర్ ఇచ్చింది.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే గతంలో సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాధానాన్ని బయట పెట్టింది. పెగాసస్ వివాదం తలెత్తినప్పుడు కర్నూలుకు చెందిన నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి ఆర్టీఐ చట్టం ఏపీ పోలీసు శాఖను పెగాసస్ కొన్నారా.. వాడారా అని ప్రశ్నించారు. అలాంటిదేదీ కొనడం కానీ.. వాడటం కానీ చేయలేదని అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. దాన్ని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. వైఎస్ఆర్‌సీపీపై విమర్శలు గుప్పించారు. 


 






అధికారంలో ఉన్నప్పుడు తామే పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగించి ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి ప్రాణం కాపాడి ఉండేవాళ్లమని.. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వైఎస్ఆర్‌సీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. 


 






నిజానికి చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసి ఉంటే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆ విషయాన్ని బయట పెట్టడం క్షణాల్లో పని . అధికార పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు కానీ కొన్నట్లుగా ఆదారాలు బయట పెట్టడం లేదు.  అసలు కొనలేదని ఇదే ప్రభుత్వం ఇచ్చిన పత్రాలను టీడీపీ వైరల్ చేస్తోంది.  మరో వైపు అసలు మమతా బెనర్జీ చంద్రబాబు ఆ స్పైవేర్‌ను కొన్నారని నిజంగా చెప్పారో లేదో కూడా క్లారిటీ లేదు.