Glenn maxwell marries vini raman: ఆస్ట్రేలియా విధ్వంసకర క్రికెటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (Glenn Maxwell) ఓ ఇంటివాడు అయ్యాడు! తన ప్రేయసి, భారత సంతతి అమ్మాయి వినీ రామన్‌ను (Vini raman) పెళ్లాడాడు. మార్చి 18, శుక్రవారం నాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. 2020, మార్చి 14న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అంతకన్నా ముందు నుంచే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.


పెళ్లికి సంబంధించిన వివరాలను మాక్సీ, వినీ బయటకు వెల్లడించలేదు. ఇద్దరూ ఒకే చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మాక్స్‌వెల్‌' అంటూ వినీ మాత్రమే కామెంట్‌ పెట్టింది. ఇక మాక్సీ అయితే ఒక ఫొటో పెట్టి ఊరుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా మాక్సీ సన్నిహితులు, అభిమానులు మ్యారేజ్‌ విషెస్‌ చెబుతున్నారు.


'తమ జీవితాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతున్న మాక్స్‌వెల్‌, వినీ రామన్‌కు అభినందనలు. మీ జోడీని చూసి ఆర్‌సీబీ ఫ్యామిలీ (RCB Family) ఎంతో సంతోషిస్తోంది' అని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) ట్వీట్‌ చేసింది. 'మీ ఇద్దరి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం' అని కామెంట్‌ పెట్టింది.






వినీ రామన్‌ మాటకు మాక్స్‌వెల్‌ ఎంతో విలువిస్తాడు. రెండేళ్ల క్రితం మాక్సీ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి విరామం తీసుకున్నాడు. మానసిక ఆరోగ్యమే ఇందుకు కారణమని చెప్పాడు. అతడిలోని ఈ సమస్యను మొదట వినీ రామనే గుర్తించింది. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు కొన్నాళ్లు విరామం తీసుకుంటే బెటరని సూచించింది. నిపుణులు సంప్రదించిన అతడు అలాగే ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. తన ఆరోగ్యం మెరుగవ్వగానే మళ్లీ ఆట మొదలు పెట్టాడు.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో మాక్స్‌వెల్‌ది విచిత్రమైన కెరీర్‌! పంజాబ్‌ తరఫున ఒక సీజన్లో అదరగొట్టాడు. ఆ తర్వాత ప్రతి సీజన్లోనూ నిరాశపరిచాడు. ప్రతిసారీ వేలం ముంగిట అతడిని విడిచేసేశారు. మళ్లీ భారీ ధరకు తీసుకొనేవారు. 2021లో అతడిని ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియాకు ఎలాంటి పాత్ర పోషిస్తాడే అలాంటి స్థానమే ఇచ్చింది. దాంతో అతడు రెచ్చిపోయి ఆడాడు. అర్ధశతకాలతో జట్టును చాలా మ్యాచుల్లో గెలిపించాడు. మ్యాచ్‌ ఫినిషర్‌గా ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ సీజన్లోనూ అతడి నుంచి ఆర్‌సీబీ అలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది.