Escobar Android Malware: ఆండ్రాయిడ్‌ యూజర్లకు (Android Users) అలర్ట్‌! ఓ పాత మాల్వేర్‌ (Malware) తన రూపం మార్చొకొని, బలం పెంచుకొని మరోసారి విరుచుకుపడుతోంది. బ్యాంకు ఖాతాల్లోని డబ్బును మాయం చేస్తోంది. మీ ఆర్థిక వివరాలు (Financial details), పాస్‌వర్డులను (Passwords) గుట్టుచప్పుడు కాకుండా హ్యాకర్లకు పంపించేస్తోంది. ఆ కొత్త వైరస్‌ పేరు 'ఎస్కో బార్‌' (Escobar) అని బ్లీపింగ్‌ కంప్యూటర్స్‌ చెబుతోంది.


ఏంటీ Escobar?


ఈ ఎస్కోబార్‌ మాల్వేర్‌ (Escobar malware) ఇప్పటి వరకు 18 దేశాల్లోని 190 ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ కస్టమర్లను లక్ష్యంగా ఎంచుకొందని తెలిసింది. ప్రస్తుతానికైతే ఆ మాల్వేరు దాడి చేసిన దేశాలు, కస్టమర్ల వివరాలు బయటకు రాలేదు. ఈ మాల్వేర్‌ గూగుల్‌ అథెంటికేటర్‌ మల్టీ ఫ్యాక్టర్‌ అథెంటిక్‌ కోడ్స్‌ను (Google Authenticator multi-factor authentication codes) చోరీ చేస్తోంది. ఇతరులు మన ఈమెయిల్‌ (E mail) లేదా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సర్వీసుల్లో (Online Banking)  లాగిన్‌ అవుతోంటే ఈ గూగుల్‌ అథెంటికేటర్‌ మనకు సందేశాలను పంపిస్తుంటుంది. గూగుల్‌ అథెంటికేటర్‌ మల్టీ ఫ్యాక్టర్‌ అథెంటిక్‌ కోడ్స్‌ను హ్యాకర్లకు పంపించడం వల్ల వారు మన పర్సనల్‌, ఫైనాన్షియల్‌ డేటాను సులభంగా యాక్సెస్‌ చేయగలరు.


ఎస్కోబార్‌ మాల్వేర్ సేకరించిన ప్రతి సమాచారం సీ2 సర్వర్లో అప్‌లోడ్‌ అవుతుండటం అందరినీ భయపెడుతోంది. ఎస్‌ఎంఎస్‌ కాల్‌ లాగ్స్‌, కీ లాగ్స్‌, నోటిఫికేషన్లు, గూగుల్‌ అథెంటికేటర్‌ కోడ్స్‌ను ఈ సర్వర్లో నిక్షిప్తం చేస్తోంది.


పూర్తిగా Escobar కంట్రోల్లోకి


బ్యాంకింగ్‌ ట్రోజన్‌ వైరస్‌లు రావడం ఇదే తొలిసారి కాదు. 2021లోనూ అబెర్‌బాట్‌ ఆండ్రాయిడ్‌ బగ్‌కు ఇలాంటి సామర్థ్యాలే ఉండేవి. వందల మంది ఆండ్రాయిడ్‌ యూజర్లను ఇది లక్ష్యంగా ఎంచుకుంది. 'ఎస్కో బార్‌' సైతం అచ్చం అలాగే ఉంది. కేపబిలిటీస్‌ మాత్రం మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయి. ఈ ఎస్కో బార్‌ వైరస్‌ సోకిన డివైజ్‌ను పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఫొటోలు క్లిక్‌ చేస్తోంది. ఆడియోలను రికార్డు చేస్తోంది. క్రెడెన్షియల్స్‌ను చోరీ చేసేందుకు కొన్ని యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తోంది. ఏపీకే ఫైల్స్‌ ద్వారా లాగిన్‌ ఫామ్స్‌ను తీసుకుంటోంది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ యాప్స్‌, వెబ్‌సైట్ల లాగిన్‌ సమాచారం తీసుకుంటోంది.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి


ఎస్కోబార్‌ మాల్వేర్‌ దాడి నుంచి తప్పించుకోవాలంటే ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే స్టోర్‌ యాప్స్‌  (google play store) మాత్రమే ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. బయటి ఏపీకే ఫైల్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దు. స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ ప్లే ప్రొటెక్ట్‌ ఆప్షన్‌ ఎనేబుల్‌ చేయాలి. దాంతో మాల్వేర్‌ ఇన్‌స్టాల్‌ అయ్యేటప్పుడు మనకు సందేశాలు వస్తాయి. పైగా ఏపీకే ఫైల్స్‌ ఇన్‌స్టాల్‌ అవ్వవు. యాప్స్‌కు ఇచ్చే పర్మిషన్లను తనిఖీ చేసుకోవడం ముఖ్యం. తెలియని, రక్షణ లేని యాప్‌లకు పర్మిషన్లు ఇవ్వడం వల్ల రిస్క్‌లో పడతారు. ఇన్‌స్టాల్‌ చేసుకొనే ఫైల్‌, యాప్స్‌ పేర్లు, డిస్క్రిప్షన్‌ను సరిగ్గా చెక్‌ చేసుకోవాలి.