Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులు కొనసాగిస్తోంది. రాజధాని కీవ్ నగరంలో భవనాలను ధ్వంసం చేస్తూ విధ్వంసకాండను పెంచుకుంటూ తన లక్ష్యం దిశగా రష్యా అడుగులువ వేస్తోంది. యుద్ధానికి తెరదించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రష్యా వ్యతిరేకిస్తున్నట్లుగా తమ దేశం నాటో (NATO) కూటమిలో సభ్యత్వం విషయంలో వెనక్కి తగ్గాలని భావిస్తోంది. అయితే తమ దేశానికి భద్రతకు సంబంధించిన హామీలు ఇస్తే నాటో సభ్యత్వంపై ఆలోచనను తాత్కాలికంగా ఉపసరంహరించుకునేందుకు ఉక్రెయిన్ సిద్ధమైంది.
తమ దేశం ఇంకా ప్రాణ, ఆస్తి నష్టానికి గురికావొద్దని భావించి అధ్యక్షుడు జెలెన్ స్కీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ నుంచి మా ప్రాణాలను తప్ప మీరు ఏం తీసుకోలేరు. కానీ మేం ఎందుకు చనిపోయాలి అని ప్రశ్నిస్తూ ఓ వీడియో విడుదల చేసినట్లు అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. నాటో సభ్యత్వం విషయంలో రాజీ పడేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలిచ్చారు. ఈ నిర్ణయం రష్యాను ఆశ్చర్యానికి గురిచేసింది. తమ దేశానికి సంబంధించి కొన్ని ప్రత్యేక భద్రతా హామీలు ఇస్తేనే ఉక్రెయిన్ ఈ అంశంలో వెనక్కి తగ్గుతుందనేది జెలెన్ స్కీ అభిప్రాయం.
మరోవైపు రష్యా 20వ రోజు ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తోంది. ఓడరేవు నగరం మారియుపోల్ లో జరిపిన బాంబు దాడుల్లో కనీసం 5 మంది మరణించారు. పెను ప్రమాదం పొంచిఉన్నప్పటికీ పోలాండ్, స్లోవేనియా, చెక్ రిపబ్లిక్ నాయకులు మాకు సంఘీభావంగా ఇక్కడికి వచ్చారు. రష్యా దాడి నేపథ్యంలో పౌరులను సాధ్యమైనంత వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగవంతమైంది. దాదాపు 2,000 పైగా కార్లలో పౌరులు పోర్ట్ సిటీ మారియుపోల్‌ను వదిలివెళ్లారు. ఈ నగరంలో పౌరులకు ఆహారం, నీరు సమకూర్చే సామాగ్రితో వెళ్తున్న కాన్వాయ్ మధ్యలోనే చిక్కుకుపోయిందని ఉప ప్రధాని ఇరినా వెరెష్‌చుక్ తెలిపారు.
రష్యా, ఉక్రెయిన్ నేతలు మంగళవారం మరో దఫా చర్చలు ప్రారంభించారు. ఉక్రెయిన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో రష్యా ఇంకా సఫలం కాలేదని, త్వరలోనే యుద్ధం ముగిసే అవకాశం ఉందని కీవ్ ప్రతినిధులు ఆకాంక్షిస్తున్నారు. మార్చి 24న బ్రస్సెల్స్‌లో ఇరు దేశాల నేతలు చర్చించుకుని సమస్యను పరిస్కరించుకోవాలని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ (NATO chief Jens Stoltenberg) సూచించారు. ఉత్తర అమెరికా, యూరప్ దేశాలు ఈ క్లిష్ట సమయంలో వారికి మద్దతుగా నిలవాలని పేర్కొన్నారు.
యుద్ధాన్ని ఇకకైనా ఆపాలి..
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలైన తరువాత విదేశాల నుంచి తొలి ప్రతినిధులుగా రష్యాతో చర్చించేందుకు పోలాండ్, చెక్ రిపబ్లిక్, స్లోవేనియా ప్రధాన మంత్రులు కీవ్ నగరానికి చేరుకున్నారు. ఈ వినాశనాన్ని ఇకనైనా ఆపుదామని పోలెండ్ ప్రధాని ఫేస్‌బుక్ ద్వారా పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ జరిగిన యుద్ధంలో ఉక్రెయిన్ నైతిక విజయం సాధించిందని, కేవలం వారం రోజుల్లో ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకుంటానని రష్యా భావించినట్లు ఆయన తెలిపారు.
రష్యా వైమానిక దాడులు, తుపాకీ మోతలతో విరుచుకుపడినా ఉక్రెయిన్‌లోని 10 అతిపెద్ద నగరాలను కూడా స్వాధీనం చేసుకోలేకపోయింది. వందల మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 30 లక్షల మంది ఉక్రెయిన్ నుంచి సరిహద్దు దేశాలకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లిపోయారు. రష్యా దాడుల్లో మొత్తం 97 మంది చిన్నారులు మరణించారని ఉక్రెయిన్ మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించింది.
సానుకూల అంశాలు..
చర్చలు జరుగుతున్న సమయంలో నిర్ణయాలను ముందుగానే ఊహించలేమని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నారు. కానీ అంతా సానుకూల నిర్ణయాలు రావాలని భావిస్తున్నట్లు చెప్పారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని కొన్ని దేశాలు భావించాయని, అయితే రష్యా సైన్యం పోరాటం సాగించలేక అలసిపోయిందని జెలెన్ స్కీ ప్రతినిధులలో ఒకరు ఒలెస్కీ అన్నారు. త్వరలోనే రెండు దేశాల మధ్య చర్చలు ఫలించనున్నాయి. తమ లక్ష్యాలు నెరవేరితే రష్యా యుద్ధాన్ని ఆపేస్తుందని ఆ దేశ ప్రతినిధి ఐక్యరాజ్యసమితి ప్రతినిధులకు స్పష్టం చేశారు.
కొనసాగుతున్న విధ్వసం..
పశ్చిమ ఉక్రెయిన్‌లోని రివ్నేలో టీవీ టవర్‌పై రష్యా జరిపిన వైమానిక దాడిలో 19 మంది మరణించారు. దీన్ని అధికారులు ధ్రువీకరించినట్లయితే పౌరులపై నార్త్-వెస్ట్ ప్రాంతంలో జరిగిన దారుణమైన దాడి అవుతుంది. ఈశాన్య ప్రాంతంలోని సుమీ నగరం నుంచి దాదాపు 100 కంటే ఎక్కువ బస్సుల్లో పౌరులు సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖెర్సన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించుకుంది. దీంతో రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్ మరిన్ని ఆంక్షలు విధించాయి.
ఎనర్జీ విభాగంలో పెట్టుబడులలో రష్యాపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించింది. విలాసవంతమైన వస్తువులు, స్టీల్ ప్రాడక్ట్స్ రష్యాకు ఎగుమతి చేయడం లేదు. చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్ యజమాని రోమన్ అబ్రమోవిచ్ ఆస్తులను ఫ్రీజ్ చేశారు. ఇదివరకే చాలా మంది రష్యా కుబేరుల బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయి.
Also Read: Ukraine Crisis Updates: ఉక్రెయిన్ నుంచి ఇండియన్స్ తరలింపులో కీలక పరిణామం - ఇది చాలా స్పెషల్!
Also Read: Elon Musk Tweet: పుతిన్‌కు ఎలాన్ మస్క్ ఛాలెంజ్- దమ్ముంటే సింగిల్‌గా యుద్ధం చేయాలని ట్వీట్