ఉక్రెయిన్‌లో నెలకొన్న కల్లోల పరిస్థితుల వేళ అక్కడ చిక్కుకున్న భారతీయులు స్వదేశాలకు వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం కూడా ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలిస్తోంది. అయితే, ఈ తరలింపు ఘట్టంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను కాపాడడంలో తొలిసారి రష్యా సైన్యం సాయం చేసింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్‌సన్ నగరం రష్యా సైనికుల వశం కాగా అక్కడ చిక్కుకుపోయిన ముగ్గురు భారతీయులను అక్కడి నుంచి తరలించడంలో రష్యా సైన్యం సాయం చేసింది. అనంతరం వారికి రష్యాలోని భారత రాయబార కార్యాలయం వారికి సహకారం అందించింది. ఒక విద్యార్థి సహా ఇద్దరు వ్యాపారులను రష్యా సైన్యం కాపాడగా క్రిమియా - రష్యా మీదుగా స్వదేశానికి చేరుకున్నారు. మాస్కోలోని భారత ఎంబసీ ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.


‘‘ఉక్రెయిన్‌లోని ఖేర్‌సన్ నగరంలో చిక్కుకున్న వారిని బస్సు ద్వారా క్రిమియాలోని సిమ్‌ఫరోపోల్ నగరానికి చేర్చి అక్కడి నుంచి మాస్కోకు రైలు ద్వారా తీసుకొచ్చారు. అనంతరం వారు విమానం ద్వారా మాస్కో నుంచి భారత్‌కు పయనం అయ్యారు. వీరిలో విద్యార్థి చెన్నైకి చెందిన వ్యక్తి కాగా, ఇద్దరు వ్యాపారులు అహ్మదాబాద్‌కు చెందిన వారు.’’ అని ఆ ప్రతినిధి తెలిపారు.


రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించడంలో రష్యా సాయం చేయడం ఇదే తొలిసారి. దాదాపు 22 వేల మంది భారతీయుల్లో ఇప్పటికే 17 వేల మందిని ప్రత్యేక విమానాల ద్వారా ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చారు. అంతేకాక, ఇప్పటిదాకా చిక్కుకున్న వారిని ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలైన పోలెండ్, హంగేరీ, రొమానియా, స్లోవేకియా దేశాల గుండా తీసుకొచ్చారు. కానీ, ఇప్పుడు మాత్రం ఈ ముగ్గురిని ఉక్రెయిన్ తూర్పు సరిహద్దు దేశం, రష్యాలోని రాజధాని మాస్కో మీదుగా వీరిని భారత్‌కు తరలించారు. ఈ పరిణామం కూడా తొలిసారి కావడం విశేషం. 


రష్యా రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఓ అంతర్జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ నగరం తర్వాత, ఖేర్‌సన్ సిటీని కూడా మా ఆధీనంలోకి తీసేసుకున్నాం. మా బలగాలు ఖేర్‌సన్‌ను ఆక్రమించుకొన్నాయి’’ అని తెలిపారు.


మరోవైపు, భారతీయులను ఉక్రెయిన్ నుంచి తరలించే ‘ఆపరేషన్ గంగ’లో భాగస్వాములు అయిన వ్యక్తులతో ప్రధాని మోదీ తాజాగా మాట్లాడారు. ఉక్రెయిన్, పోలెండ్, స్లోవేకియా, రొమేనియా, హంగేరీ తదితర దేశాల్లో ఉండే ఇండియన్ కమ్యూనిటీకి చెందిన వారు భారతీయుల తరలింపులో కీలకంగా మారారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన సరిహద్దు దేశాలకు వచ్చిన భారతీయులకు విమానాల ద్వారా వెళ్లేందుకు సాయం చేయడం, తాత్కాలిక ఏర్పాట్లు చేయడం వంటివి చేస్తున్నారు. వీరితో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘ఆపరేషన్ గంగ’ను విజయవంతం చేయడంలో భాగం అయినందుకు ధన్యవాదాలు తెలిపారు.