Actor Nagababu: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో (Jangareddygudem Deaths Issue) వరుసగా మరణాలు సంభవిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం అవి సహజ మరణాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. కల్తీ సారా వల్లే నాలుగు రోజుల్లోనే 18 మంది చనిపోయారని విపక్షాలు వాదిస్తున్నాయి. అంతా ఆస్పత్రిపాలై ఒకే తరహాలో చనిపోవడాన్ని బట్టి అవి మామూలు మరణాలు కావని నొక్కి చెబుతున్నాయి. కానీ, మంత్రులు, అధికార పార్టీ నేతలు ముందు నుంచి అవి కల్తీ సారా మరణాలు కావని చెబుతూ వస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (YS Jagan) కూడా అవి సహజ మరణాలని అసెంబ్లీలోనే తేల్చి చెప్పడం చర్చనీయాంశం అయింది. దీనిపై టీడీపీ సహా జనసేన కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. తాజాగా జనసేన నేత, నటుడు నాగబాబు దీనిపై స్పందించారు.


జంగారెడ్డి గూడెంలో (Jangareddygudem) జరిగిన దుర్ఘటన గురించి తెలుసుకొని తీవ్ర విషాదానికి గురైన నాకు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి మాటలు ఎంతో వూరటని కలగచేసాయి. మొదటిగా నేను డాక్టర్లు, మీడియా మరియు స్థానికుల అనుకుంటున్నట్లు ఇవి కల్తీ సారా మరణాలుగా పరిగణించినా... మన జగన్ రెడ్డి గారు తన ప్రత్యేక డిక్షనరీ సహాయంతో వీటిని సహజ మరణాలుగా దృవీకరించడంతో ఊపిరి పీల్చుకోగలిగా! అందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారైనా... అందులో మరణించిన వారందరూ కేవలం మగవాళ్లే ఐనా... వీరందరూ తమ చూపుని కోల్పోయి, కడుపులోని అవయవాలన్ని కాలిపోయి వున్నా... అందరూ ఒకే విధంగా గంటల వ్యవధిలో హఠాత్మరణానికి గురైనా.. ఈ చావులకు - కల్తీ సారాకు ఎటువంటి సంబంధం లేదని, ఇవన్నీ కేవలం సహజ మరణాలుగా నిర్ధారించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి జోహారు! ఇలా ఇంకా ఎంత మంది చనిపోయినా మనం వీటిని కేవలం సహజ మరణాలుగా పరిగణించాల్సిన దుస్థితి రావటం మన అంధ్రుల కర్మ’’ అని నాగబాబు సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు.


అసెంబ్లీలో జగన్ ప్రకటన ఇదీ..
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగినవి సహజ మరణాలని (Normal Deaths) సీఎం జగన్ (CM Jagan) ను అన్నారు. శాసనసభలో జంగారెడ్డిగూడెం మరణాలపై మాట్లాడిన సీఎం...జంగారెడ్డిగూడెం జనాభా యాభైవేలకు పైగా ఉంటుందన్నారు. ఇంత పెద్ద మున్సిపాలిటీలో అక్కడక్కడా జరిగిన మరణాల సంఖ్య  రెండు శాతం అనుకున్నా కనీసం తొంభైమంది సహజంగా చనిపోతారన్నారు. అలాంటిది ఇలా కేవలం సహజ మరణాలను కూడా వక్రీకరించి టీడీపీ(TDP) రాద్దాంతం చేస్తుందని సీఎం జగన్ అన్నారు. కల్తీ మద్యం చేసేవాళ్లను ఎందుకు సపోర్ట్ చేస్తామని సీఎం అన్నారు. చంద్రబాబు(Chandrababu) హయాంలో జరిగినట్లే ఇప్పుడు అక్కడక్కడా నాటుసారా సమస్య ఉందని సీఎం అన్నారు. అందుకే ప్రత్యేక పోలీసు ఫోర్స్ తీసుకొచ్చామన్నారు. కల్తీ మద్యాన్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించమన్నారు.