War Impact On Crude Oil Indian Petro Rates: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం కారణంగా మధ్యప్రాచ్యంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా టెన్షన్‌ పెరిగింది. ఈ యుద్ధం తాలూకు అతి పెద్ద ప్రభావం ముడి చమురు ఉత్పత్తి మీదే ఉంటుంది. యుద్ధ ప్రభావంతో, గ్లోబల్‌ మార్కెట్‌లో వరుసగా 3 రోజులుగా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం ముడి చమురు ధరలు దాదాపు 5% పెరిగితే, బుధవారం 1.5-2% మధ్య జంప్ చేశాయి. ఈ రోజు (గురువారం) కూడా 1% పైగానే పెరిగాయి. వాస్తవానికి, ఇరాన్ ప్రపంచ ముడి చమురు అవసరాల్లో మూడింట ఒక వంతు అందిస్తుంది. తాజా దాడుల తర్వాత ఆ దేశంలో చమురు ఉత్పత్తి ప్రభావితం కావచ్చు.


ఈ రోజు ముడి చమురు ధరలు ఎలా ఉన్నాయి?
బ్యారెల్‌ బ్రెంట్ క్రూడ్‌ ధర 1.01 శాతం పెరిగింది, దాదాపు 75 డాలర్ల వద్దకు చేరుకుంది. ప్రస్తుతం, 74.65 డాలర్ల వద్ద కదులుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ (WTI క్రూడ్) 1.14 శాతం పెరిగి, దాదాపు 71 డాలర్ల స్థాయికి చేరింది. ప్రస్తుతం, బ్యారెల్‌కు 70.90 డాలర్ల వద్ద ఉంది. క్రూడ్ ఆయిల్‌ రేటు దాదాపు 75 డాలర్లకు చేరుకుంది కాబట్టి, ధరలు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


భారతదేశంలో యుద్ధ ప్రభావం ఎంతవరకు కనిపిస్తుంది?
దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఈ రోజు పెట్రోలు, డీజిల్ ధరలను పరిశీలిస్తే... రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.94.72, డీజిల్ లీటరు రూ.87.62 చొప్పున విక్రయిస్తున్నారు. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.103.44, డీజిల్ రూ.89.97కు అమ్ముతున్నారు. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.104.95, డీజిల్ రూ.91.76 పలుకుతోంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.100.75, డీజిల్ రూ.92.34 వద్ద ఉన్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రత్యక్ష ప్రభావం దేశంలోని పెట్రోల్ - డీజిల్ ధరలపై ఇంకా కనిపించలేదు, ఈ రేట్లలో ఎలాంటి మార్పు లేదు.


Also Read: రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !


వాస్తవానికి, గ్లోబల్‌ రేట్లతో ముడిపెట్టి ఇండియాలో పెట్రోల్‌ - డీజిల్‌ అమ్మడం లేదు. ఇక్కడ, శుద్ధి చేసిన చమురు ధరలను ప్రభుత్వం నియంత్రిస్తోంది. కాబట్టి, ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల తక్షణ ప్రభావం భారత్‌పై ఉండదు.


అంతర్జాతీయ సంస్థల ఆందోళన
మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి దాడులు పరిస్థితిని మరింత దిగజార్చడమేనని UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ చెప్పారు. ఈ యుద్ధంలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు.


స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం
గాంధీ జయంతి కారణంగా బుధవారం భారతదేశంలో స్టాక్ మార్కెట్‌కు సెలవు. ఈ కారణంగా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం తక్షణ ప్రభావం భారతీయ ఈక్విటీ మార్కెట్లపై కనిపించలేదు. అయితే, ఈ ఉదయం (గురువారం) మార్కెట్ ప్రారంభ సమయంలో కొంత భయాందోళనలు కనిపించాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్ రంగంలో పని చేస్తున్న కంపెనీలు, చమురు మార్కెటింగ్ కంపెనీల (OMCs) షేర్లలో ఈ ప్రభావాన్ని చూడొచ్చు. 


మరో ఆసక్తికర కథనం: గ్లోబల్‌గా చమురు రేట్ల మంట - మీ నగరంలో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి