Bomb dropped by U S in World War II explodes at airport in Japan : దీపావళి టపాసుల్లో తుస్సులు అని వదిలేసినవి గంటకో.. అరగంటకో పేలిన సంఘటనలు మనకు అనుభవమవుతూనే ఉంటాయి. దీపావళి టపాసులే కాదు నిజమైన ఇంకా చెప్పాలంటే యుద్ధాల్లో వాడే బాంబులు కూడా ఇలాంటివి ఉంటాయి. ఈ విషయం జపాన్ వాళ్లకు మరోసారి అనుభవం అయింది.
జపాన్‌లోని మియాజకీ ఎయిర్ పోర్టులో హఠాత్తుగా భారీ బాంబు పేలుడు సంభవించింది. రవ్ వేరు కాస్త దూరంగా ఈ పేలుడు సంభవించింది. వెంటనే విమానాల రాకపోకలను రద్దు చేశారు. పేలుడు ఎలా జరిగిందా అని సెర్చ్ చేస్తే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జారవిడిచిన బాంబు ఇప్పుడు పేలిందని గుర్తించారు. ఇప్పుడు ఎందుకు పేలింది ..కారణం ఏమిటి అన్నదానిపై జపాన్ ప్రభుత్వ ఎక్స్ ప్లోజివ్ నిపణులు పరిశోధన చేస్తున్నారు.
ఈ పేలుడు ధాటికి టాక్సీ వేతో పాటు కొంత నష్టం జరిగింది. ఎయిర్ పోర్టులో విమానాలు, ప్రయాణికులు ఎలాంటి నష్టం లేదని చెబుతున్నారు. 1930-40 ప్రాంతాల్లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ పై అమెరికా తీవ్ర స్థాయిలో దాడి చేసింది. అణుబాంబులు కూడా వేసింది. ఇక చిన్నా చితకా బాంబుల గురించి చెప్పాల్సిన పని లేదు . జపాన్ లో విత్తనాలు చల్లినట్లుగా చల్లేశారు. పేలిన్ని పేలిపోగా మిగిలినవన్నీ భూమిలోకి వెళ్లిపోయాయి. ఇవన్నీ తరచూ ఎప్పుడో ఒకటి బయటపడుతూనే ఉన్నాయి.
జపాన్ లో అమెరికా జారవిడిచి పేలని బాంబుల కోసం ప్రత్యేకంగా ఇప్పటికీ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తూనే ఉంటారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాల కోసం.. గోతులు తవ్వితే బాంబులు బయటపడుతూ ఉంటాయి.కొన్ని సార్లు పేలుతూ ఉంటాయి. ఒక్క 2023లోనే ఏకంగా 2348 బాంబుల్ని నిర్వీర్యం చేశారు. జపాన్ లోనే కాదు.. గత ఏడాది ఇంగ్లాండ్ లోనూ ఇలా ప్రపంచయుద్ధం నాటి బాంబు పేలనిది గుర్తించి .. నిర్వర్యం చేశారు.
రెండో ప్రపంచయుద్ధంలో భారీగా నష్టపోయిన దేశాల్లో జపాన్ ఒకటి. ఆ తర్వాత పూర్తిగా కోలుకుని ప్రపంచ టాప్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది.