Udayshivakumar Infra IPO: ఉదయశివకుమార్ ఇన్‌ఫ్రా ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) సబ్‌స్క్రిప్షన్ ఇవాళ (సోమవారం, 2023 మార్చి 20) ప్రారంభమైంది. మార్చి 23 వరకు ఓపెన్‌లో ఉంటుంది.
ప్రైస్ బ్యాండ్
IPOలో ఒక్కో షేరుకు రూ. 33-35 ధరను ప్రైస్ బ్యాండ్‌గా కంపెనీ నిర్ణయించింది. ఒక్కో లాట్‌కు 428 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది, పెట్టుబడిదార్లు కనీసం 428 షేర్లు, ఆ తర్వాత దీని గుణిజాల్లో బిడ్ వేయవచ్చు.
IPO ద్వారా రూ. 66 కోట్ల వరకు విలువైన షేర్ల తాజా ఇష్యూ చేస్తున్నారు. ఈ ఆఫర్‌లో దాదాపు 60% రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు, 30% నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. మిగిలిన 10% అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల (QIBs) కోసం రిజర్వ్ చేశారు.
వ్యాపారం
ప్రధానమంత్రి స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్టుల క్రింద జాతీయ & రాష్ట్ర రహదారులు, జిల్లా రోడ్లు, స్మార్ట్ రోడ్లు మొదలైన వివిధ రహదారి ప్రాజెక్టులను నిర్మించే వ్యాపారాన్ని ఉదయశివకుమార్ ఇన్‌ఫ్రా చేస్తోంది.
2022 డిసెంబర్ నాటికి, కంపెనీ వద్ద 111 నిర్మాణ పరికరాలు, 46 డంపర్‌లు, 51 ఇతర నిర్మాణ వాహనాలు, 7 రెడీ-మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లు ఉన్నాయి.
రెలిగేర్ బ్రోకింగ్ ఈ IPOలో "న్యూట్రల్" రేటింగ్ ఇచ్చింది. కంపెనీ దగ్గర మంచి ఇంజినీరింగ్ బృందం, ఆధునిక నిర్మాణ యంత్రాలు, పరికరాలు ఉన్నాయని, ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేసే నైపుణ్యత కంపెనీ సొంతమని వెల్లడించింది.
డిసెంబర్ త్రైమాసికం నాటికి కంపెనీ చేతిలో 46 వర్క్ ఆర్డర్‌లు ఉన్నాయి, మొత్తం ఆర్డర్ బుక్ విలువ రూ. 1,291 కోట్లు. వీటిలో 30 ప్రస్తుతం కొనసాగుతున్నాయి, మిగిలిన 16 కొత్త వర్క్ ఆర్డర్‌లు ఇంకా ప్రారంభం కాలేదు.
లాభనష్టాలు
FY22లో (2021-22 ఆర్థిక సంవత్సరం) ఉదయశివకుమార్ ఇన్‌ఫ్రా రూ. 185 కోట్ల ఆదాయాన్ని, రూ. 12 కోట్ల లాభాన్ని ఆర్జించింది. FY20-22 కాలంలో కంపెనీ గ్రోత్ ట్రెండ్ మిశ్రమంగా ఉంది. ఈ కాలంలో ఆదాయం 2.1% CAGR వద్ద తగ్గింది, ఎబిటా (EBITDA) ఫ్లాట్‌గా ఉంది, పన్ను తర్వాతి లాభం (PAT) 7.6% CAGR పెరిగింది.
FY22 ఆదాయాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఇష్యూ పూర్తిగా పైసా వసూల్ పద్ధతిలో వచ్చిందని సెబీ-రిజిస్టర్డ్ ఎనలిస్ట్ దిలీప్ దావ్డా చెప్పారు. అత్యంత పోటీతత్వ వ్యాపారంలో ఉందని, మార్జిన్‌లు ఎంతకాలం కొనసాగుతాయన్నదానిపై అనిశ్చితి ఉందని, దీర్ఘకాలానికి మాత్రం ఈ ఇష్యూలో పార్టిసిపేట్ చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాడు.
ఉదయశివకుమార్ ఇన్‌ఫ్రా ఒక మైక్రో మార్కెట్ క్యాప్ కంపెనీ అయినందున, మార్కెట్‌లోని అన్ని వర్గాల నుంచి ఈ IPO ఆరోగ్యకరమైన ప్రతిస్పందనను పొందడం కష్టమని మెహతా ఈక్విటీస్‌కి చెందిన ప్రశాంత్ తాప్సే చెప్పారు.
కంపెనీకి కీలక రిస్క్‌ల్లో క్లయింట్ బేస్ ఒకటి. ప్రధానంగా ప్రభుత్వం & ప్రభుత్వం నిధులు సమకూర్చే ఇతర సంస్థల నుంచి వచ్చే ఆర్డర్ల మీదే ఈ కంపెనీ ఆధారపడి ఉంది. మరీ ముఖ్యంగా, కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన లేదా ఇచ్చే ప్రాజెక్టులపై ఆధారపడి ఉంటుంది. కంపెనీ ఆదాయంలో ఎక్కువ మొత్తం పరిమిత సంఖ్యలోని క్లయింట్ల నుంచి వస్తోంది. ఇది మరొక రిస్క్ ఫ్యాక్టర్.