India1 Payments IPO: మార్కెట్‌ అస్థిరతను చూసి మరో కంపెనీ భయపడింది. IPO ప్రారంభించడానికి సెబీ (SEBI) నుంచి అనుమతి వచ్చినా, ఆఫర్‌ ప్రారంభిచడానికి వెనుకాడింది. దీంతో, సెబీ అనుమతికి కాల పరిమితి ముగిసింది.


దేశంలోని అతి పెద్ద వైట్ లేబుల్ ATM ఆపరేటర్ అయిన ఇండియా1 పేమెంట్స్ లిమిటెడ్‌కు (India1 Payments Ltd), పబ్లిక్‌ ఆఫర్‌ ప్రారంభించడానికి నవంబర్ 2021లోనే రెగ్యులేటర్ ఆమోదం లభించింది. ఈ అనుమతి కాల పరిమితి 2022 నవంబర్‌లో ముగిసింది.


మార్కెట్‌లో అస్థిరతతో పాటు కొన్ని కొత్త IPOలు కఠిన సవాళ్లు ఎదుర్కోవడంతో సరైన సమయం కోసం ఇండియా1 పేమెంట్స్ లిమిటెడ్‌ ఎదురుచూస్తూ కూర్చుంది. ఈ ఎదురుచూపుల్లోనే కాలం కరిగిపోయింది, మార్కెట్‌ పరిస్థితి బాగు పడలేదు.


సెబీ ఇచ్చిన అనుమతి కాల గడువు ముగిసింది కాబట్టి, IPO ప్రారంభించాలంటే, తాజా ఆర్థిక గణాంకాలతో ఈ కంపెనీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. అయితే, ఇప్పుడు కూడా అస్థిర మార్కెట్ కారణంగా కొత్త అనుమతి కోసం సెబీకి వద్దకు ఈ కంపెనీ వెళ్లడం లేదు. పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తామని కంపెనీ చెబుతున్నా, ఆ విషయంలో తొందపడడడం లేదని వివరించింది.


"ఈ సమయంలో నేను మీకు (ఐపిఓ గురించి) చెప్పడానికి ఏమీ లేదు. మేము పబ్లిక్ మార్కెట్‌లోకి ఎప్పుడు తిరిగి చూడాలో తగిన సమయంలో బోర్డు నిర్ణయిస్తుంది" - ఇండియా1 పేమెంట్స్ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.శ్రీనివాస్‌


కంపెనీ తన ఏటీఎం బిజినెస్‌ను విస్తరించడానికి తగినంత నగదును సమకూర్చుకుంటుందని శ్రీనివాస్‌ చెప్పారు. ఇప్పటికే ఉన్న వాటాదారుల నుంచి కాకుండా, సంస్థ అంతర్గత నిల్వల నుంచి క్యాష్‌ జెనరేట్‌ చేయాలని ఈ కంపెనీ భావిస్తోంది.


వైట్ లేబుల్ ATM అంటే ఏంటి?
వైట్ లేబుల్ ATM అంటే.. ఆ ఏటీఎంను దాని సొంత బ్యాంక్‌ కాకుండా నాన్-బ్యాంకింగ్ సంస్థ నిర్వహిస్తుంది. ఇందుకోసం సంబంధిత బ్యాంక్‌ నుంచి ఫీజ్‌ వసూలు చేస్తుంది. ఏ బ్యాంక్ కస్టమర్ అయినా వీటిని ఉపయోగించవచ్చు.


మన దేశంలో దాదాపు 2,55,000 ATMలు ఉన్నాయి, వీటిలో దాదాపు 37,000 వైట్ లేబుల్ మెషీన్లు ఉన్నాయి.


ప్రతి సంవత్సరం 1,000 మనీ వెండింగ్ మెషీన్లను అమర్చాలని వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. RBI ఆదేశాల ప్రకారం ఏటీఎంలను రోల్‌-ఔట్‌ చేసేందుకు అవసరమైన మూలధనం కోసం ఇండియా1 పేమెంట్స్ లిమిటెడ్‌ ప్రయత్నిస్తోంది.


మార్కెట్‌లో మూడింట ఒక వంతు వాటా
2014 మే నెలలో, కర్నాటకలో తన మొదటి ATMని ఇండియా1 పేమెంట్స్ లిమిటెడ్‌ ఇన్‌స్టాల్ చేసింది. ప్రస్తుతం దాని బెల్ట్‌లో దాదాపు 12,200 మెషీన్‌లు ఉన్నాయి. వైట్-లేబుల్ ATM మార్కెట్‌లో మూడింట ఒక వంతును ఈ కంపెనీ నియంత్రిస్తోంది. హిటాచీ పేమెంట్ సర్వీసెస్, టాటా కమ్యూనికేషన్ పేమెంట్ సొల్యూషన్స్, వక్రాంగీ దీని రైవల్‌ కంపెనీలు. సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో మాత్రమే ATMలను ఏర్పాటు చేసి, నిర్వహిస్తుంది ఇండియా1.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.