Park Hotels IPO: అపీజే సురేంద్ర పార్క్‌ హోటల్స్‌ లిమిటెడ్‌ (Apeejay Surrendra Park Hotels Ltd  - ASPHL), తన IPO ప్లాన్‌ మార్చుకుంది. గతంలో ప్రకటించినట్లుగా రూ. 1000 కోట్లు కాకుండా రూ. 1500 కోట్లు సమీకరించాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ. 1500 కోట్ల IPOను లాంచ్‌ చేసే అవకాశం ఉంది.


ఈ కంపెనీ, ది పార్క్‌ (The Park) బ్రాండ్‌ కింద హోటల్‌ చైన్‌ను ఈ కంపెనీ నడుపుతోంది. 


యాక్సిస్ బ్యాంక్, JM ఫైనాన్షియల్, ICICI సెక్యూరిటీస్ ఈ IPOకి లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి. పార్క్ హోటల్స్ విలువను రూ. 5000 కోట్లుగా ఇవి లెక్కించాయి. ఆ ప్రకారం IPO షేరు ధరను నిర్ణయిస్తాయి.


30% వాటా ఆఫ్‌లోడ్‌
ఈ IPO ద్వారా దాదాపు 30% వాటాను మార్కెట్‌లోకి తీసుకొస్తారు. ప్రైమరీ (ఫ్రెష్‌ షేర్లు), సెకండరీ ‍‌(ఆఫర్‌ ఫర్‌ సేల్‌ - OFS) మిశ్రమంగా ఈ ఐపీవో ఉంటుదని తెలుస్తోంది.


ఈ హోటల్ చైన్, 2020 జనవరిలో ₹1,000 కోట్ల IPO కోసం డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను (DRHP) దాఖలు చేసింది, రెగ్యులేటర్ సెబీ ఆమోదం కూడా పొందింది. అదే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌ IPO లాంచ్‌ చేయాలని భావించినా, కొవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా వేసింది. ఆ తర్వాత, 2021 ఏప్రిల్‌నూ మరోమారు వాయిదా పడింది.


ఫ్యూచర్‌ ఫ్లాన్స్‌
మొత్తం 2,000 గదులున్న 22 హోటళ్లను ఈ కంపెనీ ప్రస్తుతం నడుపుతోంది. రాబోయే నాలుగేళ్లలో హోటళ్ల సంఖ్యను 40కి చేర్చాలని, మరో 2,000 గదులను జోడించాలన్నది ప్లాన్‌. ప్రస్తుతం ఉన్న హోటళ్లలో 7 సొంత భవనాల్లో నడుస్తుండగా, 13 మేనేజ్‌మెంట్‌ కాంట్రాక్ట్‌ కింద, మిగిలినవి లీజు మోడల్ కింద రన్‌ అవుతున్నాయి. 


బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, నవీ ముంబై, న్యూదిల్లీ, విశాఖపట్నంలో పార్క్‌ హోటళ్లు ఉన్నాయి.


1965లో కొనుగోలు చేసిన ప్రసిద్ధ బ్రాండ్‌ ఫ్లూరిస్ (Flurys) బ్రాండ్‌ కూడా ఈ కంపెనీ చేతిలో ఉంది. పశ్చిమ బంగాల్, ముంబై, దిల్లీలో 65 ఫ్లూరిస్ ఔట్‌లెట్స్‌ ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా కొత్తగా 200 ఫ్లూరిస్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.


ప్రస్తుతం, Apeejay ప్రమోటర్లు & గ్రూప్ కంపెనీలకు హోటల్ చైన్‌లో 75% పైగా వాటా ఉంది. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ Credit Suisse యాజమాన్యంలోని RECP IV పార్క్ హోటల్ ఇన్వెస్టర్స్‌ కూడా పార్క్‌ హోటల్‌ చైన్‌లో 2007లో పెట్టుబడి పెట్టింది, దీనికి దాదాపు 8% వాటా ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.