Upcoming IPOs: ప్రస్తుతం, మన మార్కెట్‌లో IPOలకు బాగా గ్యాప్‌ వచ్చింది. ఇంటర్నేషనల్‌ మార్కెట్ల నుంచి ఇండియన్‌ మార్కెట్లు డీ-కప్లింగ్‌ కావడంతో పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. ఇప్పుడు మార్కెట్‌ సెంటిమెంట్‌ బాగా లేదు. దీంతో, పబ్లిక్‌ ఆఫర్లను ప్రారంభించడానికి కంపెనీలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయి.


ఇక, రెండు కంపెనీలు ధైర్యం చేసి త్వరలో పబ్లిక్‌లోకి అడుగు పెట్టబోతున్నాయి. వాటిలో మొదటి కంపెనీ బాలాజీ సొల్యూషన్స్ (Balaji Solutions). రెండో కంపెనీ ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ (Enviro Infra Engineers). బాలాజీ సొల్యూషన్స్ ఒక IT హార్డ్‌వేర్ & మొబైల్ యాక్సెసరీస్ సంస్థ. ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్, వ్యర్థ జలాల నిర్వహణకు పరిష్కారం చూపే సంస్థ.


ఈ రెండు కంపెనీలు ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ SEBIకి ముసాయిదా పత్రాలను సమర్పించాయి. 2022 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఆ పేపర్లను సదరు సంస్థలు సమర్పించాయి. 2023 జనవరి 23న సెబీ ఈ రెండు కంపెనీల IPOలకు సూత్రప్రాయ ఆమోదం అంటే, పరిశీలన లేఖ లభించింది. సెబీ నుంచి పరిశీలన లేఖ పొందకుండా ఏ కంపెనీ కూడా IPOకు రాలేదు.


బాలాజీ సొల్యూషన్స్ IPO వివరాలు:
సెబీకి ఈ కంపెనీ సమర్పించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లోని (DRHP) సమాచారం ప్రకారం... ఐపీవో ద్వారా రూ. 120 కోట్ల విలువైన ఫ్రెష్‌ షేర్లను బాలాజీ సొల్యూషన్స్ మార్కెట్లోకి తీసుకురానుంది. ఇది కాకుండా, కంపెనీ & గ్రూప్ ప్రమోటర్ ఎంటిటీ ద్వారా ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా మొత్తం 75 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఈ ఐపీఓలో కంపెనీ ప్రమోటర్‌ రాజేంద్ర తన షేర్లను విక్రయించనున్నారు. దీంతో పాటు, రూ. 24 కోట్ల ప్రి-ఐపీవో ప్లేస్‌మెంట్‌కు వెళ్లాలని కూడా కంపెనీ యోచిస్తోంది. ఒకవేళ, ప్రి-ఐపీవో ప్లేస్‌మెంట్‌కు కంపెనీ వెళితే, మొత్తం IPO సైజ్‌ తగ్గే అవకాశం ఉంది. IPO ద్వారా సేకరించిన మొత్తంలో రూ. 86.60 కోట్లను వర్కింగ్ క్యాపిటల్‌గా ఉపయోగించాలని కంపెనీ ప్లాన్ చేసింది.


ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ IPO వివరాలు:
సెబీకి ఈ కంపెనీ సమర్పించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లోని (DRHP) సమాచారం ప్రకారం... ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ తన IPO ద్వారా పూర్తిగా తాజా షేర్లను జారీ చేస్తుంది. ఇందులో OFS ద్వారా ఒక్క షేరు కూడా జారీ చేయదు. అంటే, కంపెనీ ప్రమోటర్స్‌ గానీ, ఇప్పటికే ఉన్న షేర్‌హోల్డర్స్‌ గానీ తమ వద్ద ఉన్న స్టేక్‌లో ఒక్క షేర్‌ కూడా అమ్మడం లేదు. కంపెనీ భవిష్యత్‌ వృద్ధిపై నమ్మకం ఉంటేనే షేర్ల అమ్మకానికి ఇష్టపడరు. ఇలా, OFS లేని IPOలను పాజిటివ్‌గా చూడవచ్చు. ఈ ఐపీవోలో, మొత్తం 95 లక్షల ఫ్రెష్‌ ఈక్విటీ షేర్లు జారీ కానున్నాయి. IPO ద్వారా సేకరించిన డబ్బును వర్కింగ్ క్యాపిటల్‌ పెంచుకోవడానికి, ఇతర అవసరాలను తీర్చుకోవడానికి కంపెనీ ఉపయోగిస్తుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.