Sai Swami Metals And Alloys IPO: ప్రస్తుతం ప్రైమరీ మార్కెట్‌ (ఐపీవో మార్కెట్‌) చాలా ఉత్సాహంగా ఉంది. కొత్తగా ఏ కంపెనీ వస్తున్నా ఇన్వెస్టర్లు సాదరంగా ఆహ్వానిస్తున్నారు, ఫుల్‌/ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ చేస్తున్నారు. మెయిన్‌ బోర్డ్‌లోకి వస్తున్నా, SME విభాగంలో లిస్ట్‌ అవుతున్నా... ప్రస్తుతం సంస్థనూ నిరాశపరచడం లేదు. IPOలపై కురిపించిన ప్రేమకు బదులుగా ఇన్వెస్టర్ల జేబులు నిండుతున్నాయి. 


తాజాగా, సాయి స్వామి మెటల్స్ & అల్లాయ్స్ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు (IPO) అతి భారీ స్పందన లభించింది. ఈ కంపెనీ పెట్టుబడిదార్లకు బాగా నచ్చినట్లుంది. సబ్‌స్క్రిప్షన్‌ చివరి రోజైన శుక్రవారం (03 మే 2024) నాటికి ఏకంగా 543 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. ఇప్పుడు, షేర్ల లిస్టింగ్ కోసం ఇన్వెస్టర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


ఈ కంపెనీ IPO ఏప్రిల్ 30న ప్రారంభమైంది. పబ్లిక్‌ ఆఫర్‌ కోసం ఒక్కో షేరు ధరను రూ. 60గా కంపెనీ నిర్ణయించింది. అందుబాటులోకి తెచ్చిన మొత్తం షేర్లలో 50 శాతం వాటాను రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేసింది. ఐపీఓ ద్వారా వచ్చిన డబ్బును యంత్రాల కొనుగోలుకు, అనుబంధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం కంపెనీ ఉపయోగిస్తుంది.


రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి విపరీతమైన ఇంట్రెస్ట్‌
సాయి స్వామి మెటల్స్ & అల్లాయ్స్ ఒక చిన్న కంపెనీ. దీని ఐపీవో సైజ్‌ కేవలం 15 కోట్ల రూపాయలు. SME (Small and Medium Enterprises) విభాగంలో ఇది లిస్ట్‌ అవుతోంది. IPO కోసం ఈ కంపెనీ మొత్తం 23,72,000 ఈక్విటీ షేర్లను అమ్మకానికి పెట్టింది. కానీ... ఇన్వెస్టర్లు ఈ ఐపీఓ మీద అత్యంత ఆసక్తి కనబరిచారు, 128.98 కోట్ల ఈక్విటీ షేర్ల కోసం బిడ్స్‌ వేశారు. ఈ లెక్కన ఈ పబ్లిక్‌ ఆఫర్‌ 543 రెట్లు ఎక్కువ స్పందన అందుకుంది. 


IPOలో, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 11,86,000 ఈక్విటీ షేర్లను (50%) కంపెనీ విడుదల చేసింది. ఈ విభాగంలో 62,74,02,000 ఈక్విటీ షేర్ల కోసం బెట్స్‌ వచ్చాయి. నాన్-రిటైల్ ఇన్వెస్టర్ల కేటగిరీ కోసం కూడా 11,86,000 ఈక్విటీ షేర్లు కేటాయిస్తే... 63,32,50,000 ఈక్విటీ షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి.  నాన్-రిటైల్ ఇన్వెస్టర్ల విభాగమే 538 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్ పొందింది. చరిత్రను తిరగేస్తే.. రిలయన్స్‌, టాటా కంపెనీలకు కూడా ఈ రేంజ్‌లో రెస్పాన్స్‌ రాలేదు.


లిస్టింగ్‌ తేదీ
సాయి స్వామి మెటల్స్ & అల్లాయ్స్ షేర్లు ఈ నెల 8న (బుధవారం, 08 మే 2024) BSE SME ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్‌ అవుతాయి. 


కంపెనీ వ్యాపారం - లాభనష్టాలు
అహ్మదాబాద్‌ కేంద్రంగా సాయి స్వామి మెటల్స్ & అల్లాయ్స్ పని చేస్తోంది. స్టెయిన్‌లెస్ స్టీల్ పరికరాలను తయారు చేసి, మార్కెటింగ్‌ చేస్తుంది. 2023 డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో ఈ కంపెనీ రూ. 1.79 కోట్ల నికర లాభం ఆర్జించింది. అదే కాలంలో రూ. 33.33 కోట్ల ఆదాయం సంపాదించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో (FY23) కంపెనీ నికర లాభం రూ. 3.83 లక్షలు కాగా.. ఆదాయం రూ. 6.27 కోట్లుగా ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి