Stanley Lifestyles IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస ఐపీవోల లిస్టింగ్ ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను తెచ్చిపెడుతున్నాయి. నిజానికి ఇన్వెస్టర్లు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లలోని లిస్టెడ్ కంపెనీలపై బెట్టింగ్ వేయటం కంటే తక్కువ కాలంలో ఎక్కువ రాబడిని అందించే ఐపీవోలను సంపాదనకు మార్గంగా మలుచుకుంటున్నారు. జూన్ నెల చివరికి వచ్చినప్పటికీ ఐపీవోల వేడి మాత్రం మార్కెట్లో తగ్గకపోవటంతో పాటు దాదాపు 95 శాతానికి పైగా లిస్టింగ్ కోసం వస్తున్న ఐపీవోలు ప్రీమియం ధరల వద్ద జాబితా అవటం ఇన్వెస్టర్లను సంతోషంలోకి నెట్టేస్తున్నాయి. 


ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో అడుగుపెట్టిన స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ ఐపీవో షేర్ల గురించే. వాస్తవానికి నేడు మార్కెట్లో కంపెనీ షేర్లు దాదాపు 34 శాతానికి పైగా ప్రీమియం రేటుకు అడుగుపెట్టాయి. దీంతో ఎన్ఎస్ఈలో ఒక్కో షేరు రూ.494.95 రేటు వద్ద జాబితా అయ్యాయి. అయితే ఐపీవో ఇష్యూ సమయంలో కంపెనీ వాస్తవంగా ఐపీవో ప్రైస్ బ్యాండ్ గరిష్ఠ ధర ఒక్కో షేరుకు రూ.369గా ఉంచింది. ఈ ఐపీవో దేశంలోని రిటైల్ ఇన్వెస్టర్ల కోసం జూన్ 21 నుంచి జూన్ 25 వరకు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.


తాజా ఐపీవో ద్వారా కంపెనీ ఈక్విటీ మార్కెట్ల నుంచి మెుత్తంగా రూ.537.02 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందులో రూ.200 కోట్లకు మాత్రమే తాజా ఇష్యూ ఉంది. ఇందుకోసం కంపెనీ 0.54 కోట్ల ఫ్రెష్ ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఇదే క్రమంలో మిగిలిన రూ.337.02 కోట్లను కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ రూపంలో మార్కెట్లో విక్రయిస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ కింద ఇన్వెస్టర్లకు ఐపీవోలో కంపెనీ 0.91 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఈ క్రమంలో వాస్తవంగా ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధర ఒక్కో షేరుకు రూ.351-369గా నిర్ణయించబడింది. 


స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ ఐపీవో ఇష్యూ పనితీరును పరిశీలిస్తే.. జూన్ 25న బిడ్డింగ్ చివరి రోజున రిటైల్, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి గణనీయమైన డిమాండ్‌ను చూసింది. దీంతో రూ.537-కోట్ల ఐపీవో 96.98 రెట్లు సబ్‌స్క్రిప్షన్ రేటును సాధించింది. ఈక్రమంలో ఇన్వెస్టర్లు ఏకంగా 99.32 కోట్ల ఈక్విటీ షేర్ల కోసం దరఖాస్తులు సమర్పించారు.


కంపెనీ వ్యాపారం:
2007లో స్థాపించబడిన స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ భారతదేశంలో ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్. సూపర్-ప్రీమియం, లగ్జరీ విభాగాల్లో తయారీ, రిటైల్‌ వ్యాపారంలో కంపెనీ నిమగ్నమై ఉంది. ప్రస్తుతం కంపెనీ తన ఫర్నిచర్ ఉత్పత్తులను "స్టాన్లీ" బ్రాండ్ క్రింద మార్కెట్ చేస్తోంది. ప్రస్తుతం కంపెనీకి రెండు తయారీ యూనీట్లు ఉన్నాయి. ఇవి రెండు కర్ణాటకలోని బెంగళూరు నగరంలో ఉండగా ఒకటి ఎలక్ట్రానిక్ సిటీలో మరొకటి బొమ్మసాంద్ర జిగాని లింక్ రోడ్‌లో ఉన్నాయని తెలుస్తోంది.