SoftBank OYO Valuation: ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ను (IPO) ప్రారంభించాలనుకుంటున్న ఓయో హోటల్స్ & హోమ్స్‌కు (Oyo Hotels & Homes) భారీ షాక్‌ కొట్టింది. ఈ కంపెనీలో అతి పెద్ద పెట్టుబడిదారు అయిన జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ (SoftBank), ఓయో గాలి తీసేసింది. కంపెనీ అంతర్గత విలువను $2.7 బిలియన్లకు (దాదాపు రూ.21,600 కోట్లు) తగ్గించింది.


గత అక్టోబర్‌లో మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి (Sebi) ఓయో దాఖలు చేసిన డ్రాఫ్ట్ IPO పేపర్ల ప్రకారం, ఈ కంపెనీలో సాఫ్ట్‌బ్యాంక్‌కు 46 శాతం కంటే ఎక్కువ వాటా ఉంది. సాఫ్ట్‌బ్యాంక్‌ను ఓయో ప్రమోటర్‌గా ఆ పేపర్లలో చూపించారు.


సాఫ్ట్‌బ్యాంక్‌తో పాటు, ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్‌ కూడా దాదాపు 33% వాటాతో కంపెనీ ప్రమోటర్‌గా ఉన్నారు. 


జూన్ త్రైమాసికం నాటికి పబ్లిక్ మార్కెట్లలో ఉన్న సారూప్య సంస్థలతో పోల్చి, ఓయో విలువను సాఫ్ట్‌బ్యాంక్‌ తగ్గించిందని తెలుస్తోంది. ఈ మేరకు, ఓయో విలువను $2.7 బిలియన్లుగా తన బుక్స్‌లోనూ సాఫ్ట్‌బ్యాంక్‌ పేర్కొన్నట్లు మార్కెట్‌ వర్గాలకు సమాచారం వచ్చింది.


గతంలో $3.4 బిలియన్లు
ఇది, గతంలో అంచనా వేసిన విలువ అయిన $3.4 బిలియన్ల (దాదాపు రూ.27,200 కోట్లు) కంటే 20 శాతం పైగా తక్కువ. 


ఈ విషయం మీద సాఫ్ట్‌బ్యాంక్‌ అధికారికంగా స్పందించలేదు. ఓయో స్పందించింది, అన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేసింది.


గత ఏడాది సెప్టెంబర్‌లో, మైక్రోసాఫ్ట్ నుంచి వ్యూహాత్మక పెట్టుబడిని సేకరించినప్పుడు ఓయో విలువ చివరిగా $9.6 బిలియన్లకు (ప్రస్తుత విలువ ప్రకారం రూ.77 వేల కోట్లకు పైగా) చేరింది.


ఐపీవో ద్వారా రూ.8,430 కోట్లు
ఐపీవో కోసం 9 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.72,000 కోట్లు) విలువను ఓయో లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఇంటర్నేషనల్‌ బ్రోకరేజ్‌ బ్లూంబర్గ్‌ నివేదిక ప్రకారం తెలుతోంది. ఐపీవో ద్వారా రూ.8,430 కోట్లు (దాదాపు 1 బిలియన్‌ డాలర్లు) సమీకరించబోతున్నట్లు గతేడాది సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రాల్లో  ఓయో పేర్కొంది. 


ఆ సమయంలో ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) అచ్చంగా సెల్లింగ్‌ మోడ్‌లో ఉన్నారు. మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. దీంతో వెనకడుగు వేసిన ఓయో, IPO ప్రతిపాదనను తాత్కాలికంగా ఉపసంహరించుకుంది.


కొవిడ్‌ పరిణామాల తర్వాత వ్యాపారం పుంజుకుంటున్న నేపథ్యంలో మళ్లీ ఐపీవో ఆలోచన చేసింది. తమ సంస్థ అంచనా విలువ తగ్గకపోవచ్చని, వ్యాపార పనితీరు ఆధారంగానే సంస్థ విలువను లెక్కగడతారని చెబుతోంది. పబ్లిక్‌ ఇష్యూకు ఎప్పుడు రావాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.


సెబీ క్లియరెన్స్ పొందిన తర్వాత, ఐపీవో ఓయో విలువ సుమారు $5 బిలియన్లుగా (ప్రస్తుత విలువ ప్రకారం రూ.40 వేల కోట్లకు పైగా) స్థిరపడవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.