Inox Green Energy IPO: ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) కోసం మరోమారు సెబీ తలుపు తట్టిన ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్‌కు ‍‌(Inox Green Energy Services) అనుమతి లభించింది. గతంలోనూ ఒకసారి, ఐపీవో కోసం డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను (DRHP) ఫిబ్రవరిలో సెబీకి  దాఖలు చేసింది ఈ కంపెనీ. ఆ తర్వాత, ఎలాంటి కారణం వెల్లడించకుండా సదరు డ్రాఫ్ట్ ఆఫర్ డాక్యుమెంట్లను ఏప్రిల్ చివరిలో వెనక్కు తీసుకుంది. 


ఐనాక్స్‌ విండ్‌కు 95 శాతం స్టేక్‌
స్టాక్‌ మార్కెట్‌లో ఇప్పటికే లిస్ట్‌ అయిన ఐనాక్స్ విండ్ ‍‌(Inox Wind) అనుబంధ సంస్థే ఈ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్. ఈ కంపెనీలో ఐనాక్స్‌ విండ్‌కు 95 శాతం వాటా ఉంది. 


ఈ ఐపీవో ద్వారా రూ.740 కోట్ల వరకు సమీకరించడానికి క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ నుంచి ఐనాక్స్‌ గ్రీన్‌కు అనుమతి వచ్చింది.


రూ.370 కోట్ల ఫ్రెష్‌ ఇష్యూ 
DRHP ప్రకారం, IPOలో రూ.370 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల ఫ్రెష్‌ ఇష్యూ ఉంటుంది. దీంతోపాటు, ప్రమోటర్ కంపెనీ ఐనాక్స్ విండ్ నుంచి మరో రూ.370 కోట్ల విలువైన ఈక్విటీ స్టాక్స్‌ ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉంటుంది.


మరో విషయం.. ఐపీవో ద్వారా పూర్తిగా రూ.740 కోట్లను సేకరించకపోవచ్చు. ప్రి-ఐపీవో ప్లేస్‌మెంట్‌ ద్వారా కూడా నిధులను సమీకరించే ఆలోచననూ ఈ కంపెనీ చేస్తోంది. ఒకవేళ ప్లేస్‌మెంట్ పూర్తయితే, ఫ్రెష్‌ ఇష్యూ సైజ్‌ తగ్గుతుంది.


డ్రాఫ్ట్ IPO పేపర్లను జూన్ 20న సెబీకి దాఖలు చేసిన ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్, ఈ నెల 13న రెగ్యులేటర్ నుంచి పరిశీలన లేఖను (observation letter) పొందింది. దీని అర్ధం ఏమిటంటే, పూర్తి స్థాయి అనుమతి రాలేదు గానీ, IPO ప్రాసెస్‌ను ఈ కంపెనీ ముందుకు తీసుకువెళ్లవచ్చు.


సెబీకి సమర్పించిన ముసాయిదా (Draft Papers) పత్రాల ప్రకారం, ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని అప్పులు తీర్చడానికి ఈ కంపెనీ ఉపయోగిస్తుంది. మిగిలిన డబ్బును సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వాడుకుంటుంది.


విండ్‌ టర్బైన్ల మెయింటెనెన్స్ 
విండ్ ఫామ్ ప్రాజెక్ట్‌ల దీర్ఘకాలిక ఆపరేషన్ &మెయింటెనెన్స్ (O&M) సేవలను అందించే వ్యాపారాన్ని ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ చేస్తోంది, ప్రత్యేకించి విండ్ టర్బైన్ జనరేటర్లకు (WTGs) ఈ తరహా సేవలు అందిస్తంది. విండ్ ఫామ్‌ల్లో సాధారణ మౌలిక సదుపాయాల కల్పన వంటివి కూడా చూస్తుంది.


1,600 మెగావాట్ల తయారీ సామర్థ్యంతో విండ్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ను ప్రమోటర్ కంపెనీ ఐనాక్స్‌ విండ్‌ అందిస్తోంది. గత నెల రోజుల్లోనే ఈ స్టాక్‌ 39 శాతం పెరిగింది. గత ఆరు నెలల కాలంలో దాదాపు 32 శాతం, గత ఏడాది కాలంలో 43 శాతం ర్యాలీ చేసింది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.