Patanjali Group IPOs: ₹5 ట్రిలియన్ల మార్కెట్ విలువను (క్యాపిటలైజేషన్) లక్ష్యంగా పెట్టుకున్న పతంజలి గ్రూప్ (Patanjali Group), అందులో భాగంగా, వచ్చే ఐదేళ్లలో తన గ్రూప్‌లోని మిగిలిన నాలుగు కంపెనీలను స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయాలని చూస్తోంది.
కొత్తగా లిస్ట్ చేయాలనుకుంటున్న కంపెనీలు - పతంజలి ఆయుర్వేద్ (Patanjali Ayurved), పతంజలి వెల్‌నెస్ (Patanjali Wellness), పతంజలి లైఫ్‌స్టైల్ (Patanjali Lifestyle), పతంజలి మెడిసిన్ (Patanjali Medicine).
పతంజలి గ్రూప్‌లో ఇప్పటికే ఒక లిస్టెడ్ ఎంటిటీ పతంజలి ఫుడ్స్ (Patanjali Foods) ఉంది. గతంలో దీని పేరు రుచి సోయా ఇండస్ట్రీస్ (Ruchi Soya Industries). ఆహార వ్యాపారాన్ని రుచి సోయా ఇండస్ట్రీస్‌కు బదిలీ చేసేందుకు పతంజలి ఆయుర్వేద్ బోర్డు ఇటీవలే ఆమోదం కూడా తెలిపింది.
విజన్-2027
ఇవాళ (శుక్రవారం), పతంజలి కంపెనీ మేనేజ్‌మెంట్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. తన అజెండా-2027 విజన్‌ను ఆ సమావేశంలో వివరిస్తుంది. కొత్త కంపెనీల లిస్టింగ్, భవిష్యత్ ప్రణాళికలను ప్రకటిస్తుంది.
రుచి సోయా పేరును పతంజలి ఫుడ్స్‌గా మార్చడానికి ముందే; దేశంలో పెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీగా అవరించేలా పతంజలి ఫుడ్స్ ఒక స్టెప్ వేసింది. పతంజలి ఆయుర్వేద్ మొత్తం ఆహార వ్యాపారాన్ని రూ.690 కోట్లకు కొనుగోలు చేసింది.
పతంజలి ఆయుర్వేద్ నుంచి కొనుగోలు చేసిన ఆహార వ్యాపారంలో నెయ్యి, తేనె, మసాలాలు, జ్యూస్‌లు, గోధుమపిండి వంటి 21 ఉత్పత్తులు ఉన్నాయి. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) ద్వారా రూ.4,300 కోట్లను కూడా ఈ కంపెనీ సమీకరించింది. FPO ఆదాయంలో ఎక్కువ భాగాన్ని రుణాల చెల్లింపు కోసం, మిగిలిన మొత్తాన్ని కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వినియోగిస్తామని కంపెనీ తెలిపింది.
పెరిగిన ఆదాయం, లాభం
2021-22లో, కార్యకలాపాల ద్వారా పతంజలి ఫుడ్స్ సంపాదించిన ఆదాయం (రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్) రూ. 24,205 కోట్లు. అంతకుముందు ఏడాది 2020-21లో ఇది రూ.16,318.6 కోట్లు. 2021-22లో లాభం రూ.806.3 కోట్లు కాగా, అంతకుముందు సంవత్సరంలో ఇది రూ.680.77 కోట్లుగా ఉంది.
భారతదేశంలోని అతి పెద్ద ఆయిల్ పామ్ (పామాయిల్) ప్లాంటేషన్ సంస్థల్లో పతంజలి ఫుడ్స్ ఒకటి. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, ఒడిశా, అసోం, మిజోరాం, త్రిపుర సహా 11 రాష్ట్రాల్లోని 55 జిల్లాల్లో దీనికి ఆస్తులు ఉన్నాయి. మొత్తం 60,000 హెక్టార్ల విస్తీర్ణంలో పామ్ ప్లాంటేషన్ చేస్తోంది.
కొత్త ఐపీవోల వార్తల నేపథ్యంలో, ఇవాళ్టి భారీ బలహీన మార్కెట్‌లోనూ పతంజలి ఫుడ్స్ షేర్ దమ్ము చూపించింది. మధ్యాహ్నం 1.10 గంటల సమయానికి రూ.17.85 లేదా 1.33 శాతం పెరిగి, రూ.1,359 వద్ద కదులుతోంది.
గత నెల రోజుల్లో 21 శాతం, గత ఆరు నెలల కాలంలో 31 శాతం, గత ఏడాది కాలంలోనూ 31 శాతం మేర ఈ కౌంటర్ లాభాలను ఇచ్చింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.