OYP IPO - SEBI: ఎట్టకేలకు, ఆన్‌లైన్ హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఓయో IPO పట్టాలపైకి రాబోతోంది. ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (IPO) ప్రారంభిస్తామంటూ ఒరావెల్‌ స్టేస్‌ (ఓయో మాతృసంస్థ) చాలా కాలం ఇన్వెస్టర్లను ఊరిస్తోంది. ఈ కంపెనీ, శుక్రవారం (31 మార్చి 2023) నాడు ప్రీ-ఫైలింగ్‌ మార్గంలో సెబీకి డ్రాఫ్ట్‌ పేపర్లను సమర్పించినట్లు సమాచారం. ఓయో ఐపీవో కోసం పెట్టుబడిదార్లు రెండు సంవత్సరాలకు పైగా ఎదురు చూస్తున్నారు.


అంతకు ముందు, IPO కోసం 2021 సెప్టెంబర్‌ నెలలో 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా'కు (SEBI) ముసాయిదా పత్రాలను ఓయో సమర్పించింది. సెబీ నుంచి అనుమతి వచ్చి 12 నెలల్లోగా సంబంధింత కంపెనీ IPOను తీసుకురావాల్సి ఉంటుంది. పబ్లిక్‌ ఆఫర్‌ ప్రారంభించడానికి సెబీ అనుమతి ఇచ్చినా, మార్కెట్‌ పరిస్థితులు బాగాలేకపోవడంతో, ఓయో తన IPOను వాయిదా వేస్తూ వచ్చింది. ఐపీవో ప్రారంభించాల్సిన 12 నెలల గడువు ఈ వాయిదాల పర్వంలోనే ముగిసింది. దీంతో, తాజా సమాచారంతో IPO కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని OYOకు సెబీ సూచించింది. సెబీ నిర్దేశం మేరకు, కొత్త సమాచారంతో శుక్రవారం నాడు ప్రీ-ఫైలింగ్‌ మార్గంలో DRHP సమర్పించింది.


సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ప్రీ-ఫైలింగ్‌ పద్ధతిలో సెబీకి డ్రాఫ్ట్‌ పేపర్లు సమర్పించింది కాబట్టి, ఐపీవో ప్రారంభించడానికి ఓయోకి 12 నెలల బదులు 15 నెలల గడువు అందుబాటులోకి వచ్చింది. ఈ సంవత్సరం దీపావళి సమయంలో ఓయో ఐపీవో మార్కెట్‌ ముందుకు రావచ్చని అంచనా.


IPO పరిమాణం తగ్గింపు!
ఓయో ఐపీవోకి సంబంధించి మరో పెద్ద వార్త కూడా బిజినెస్‌ సర్కిల్‌లో తిరుగుతోంది. తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ పరిమాణాన్ని తగ్గించడానికి ఈ కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు బాగా లేకపోవడం, గతంలో వచ్చిన ఐపీవోలు బోల్తా కొట్టడాన్ని దృష్టిలో పెట్టుకుని, 400-600 మిలియన్‌ డాలర్ల (రూ. 3,300 నుంచి రూ. 5,000 కోట్ల) సమీకరణకు ఓయో ప్రయత్నించవచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా. 


కంపెనీపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవాలనుకోవడమే IPO పరిమాణాన్ని తగ్గించడం వెనుక ఉద్దేశ్యంగా OYO వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ గతంలో చెప్పారు. 2020, 2021తో పోలిస్తే ఇప్పుడు పర్యాటక రంగం బాగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో, వీలైనంత త్వరగా IPOను మార్కెట్‌లో లాంచ్‌ చేయాలని చూస్తున్నారు.


OFS షేర్లు లేవు
2021లో ఒకసారి, ఇప్పుడు మరొకసారి కలిపితే, ఓపీవో కోసం ఓయో రెండోసారి దరఖాస్తు చేసింది. ప్రపంచ స్థాయి పెట్టుబడి సంస్థలు సాఫ్ట్‌బ్యాంక్‌, సిఖోయాతో పాటు మైక్రోసాఫ్ట్‌, ఇతర కంపెనీలు ఓయోలో పెట్టుబడులు పెట్టాయి. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం... IPOలో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) ఉండదు. అంటే, ఈ కంపెనీ ప్రమోటర్లు గానీ, ప్రస్తుత షేర్‌హోల్డర్లుగానీ ఒక్కో షేర్‌ కూడా అమ్మకానికి పెట్టట్లేదు. ఈ ఐపీవో ద్వారా మార్కెట్‌లోకి వచ్చేవన్నీ పూర్తిగా ఫ్రెష్‌ షేర్లే.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.