IPO outlook for 2023: స్టాక్ మార్కెట్ పతనం మధ్య, గత ఆర్థిక సంవత్సరంలో (2022-23) IPO మార్కెట్ సరిగా నడవలేదు. ఆ ఆర్థిక సంవత్సరం చివరి నెలల్లో కొన్ని IPOలు మాత్రమే కనిపించాయి. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) ఐపీవో పెట్టుబడిదార్లకు ఆశాజనకంగా ఉండొచ్చు. దాదాపు 54 కంపెనీలు ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్లతో (IPOs) రెడీగా ఉన్నాయి. మార్కెట్‌ పరిస్థితులు అనుకూలిస్తే, ఈ ఐపీవోల ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.


2022-23 ఆర్థిక సంవత్సరం గురించి మాట్లాడితే... ఈ కాలంలో మొత్తం 38 కంపెనీలు IPOల ద్వారా మొత్తం 52,600 కోట్ల రూపాయలను సమీకరించాయి. ఈ 38 కంపెనీల్లో కేవలం రెండు కంపెనీల షేర్లు మాత్రమే 50 శాతం కంటే ఎక్కువ ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ (Dreamfolks Services) షేర్లు 55 శాతం ప్రీమియంతో, ఎలక్ట్రానిక్స్ మార్ట్‌ ఇండియా (Electronics Mart India) షేర్లు 52 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. ప్రభుత్వ బీమా సంస్థ LIC (Life Insurance Corporation of India) IPO కూడా ఆ ఆర్థిక సంవత్సరంలోనే వచ్చింది, సుమారు 9 శాతం డిస్కౌంట్‌తో లిస్ట్‌ అయింది.


లాభం తక్కువ - నష్టం ఎక్కువ
గత ఆర్థిక సంవత్సరంలో లిస్ట్‌ అయిన కొన్ని స్టాక్స్‌ మాత్రమే అనూహ్యంగా రాణించాయి. హరిఓం పైప్ ఇండస్ట్రీస్ (Hariom Pipe Industries), వీనస్ ట్యూబ్స్ అండ్‌ పైప్స్ (Venus Tubes and Pipes) మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. హరిఓం పైప్ ఇండస్ట్రీస్ దాదాపు 225 శాతం, వీనస్ ట్యూబ్స్ అండ్ పైప్స్ దాదాపు 125 శాతం రాబడిని ఇచ్చాయి. ఓవరాల్‌గా చూస్తే మాత్రం, ఎక్కువ IPOలు పెట్టుబడిదార్ల డబ్బును హరించాయి కాబట్టి, గత ఆర్థిక సంవత్సరం చెడు కాలంగా మారింది. ఎల్‌ఐసీ, ఉమ ఎక్స్‌పోర్ట్స్ ‍‌(Uma Exports), ఎలిన్ ఎలక్ట్రానిక్స్ (Elin Electronics) షేర్లు అధ్వాన్నంగా పని చేశాయి, దాదాపు 40 శాతం నష్టం కలిగించాయి.


IPO పైప్‌లైన్‌లో 54 కంపెనీలు
ఏప్రిల్ 01 నుంచి ప్రారంభమమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మాట్లాడుకుంటే, ఈ ఏడాదిలో 54 కంపెనీలు IPO పైప్‌లైన్‌లో ఉన్నాయి. ప్రైమ్ డేటాబేస్ ప్రకారం, ఈ 54 కంపెనీలకు SEBI అనుమతి వచ్చింది. ఇవన్నీ కలిసి ప్రైమరీ మార్కెట్ నుంచి 76,189 కోట్ల రూపాయల వరకు సేకరించేందుకు ప్రయత్నిస్తాయి. ఇవి కాకుండా సెబీ అనుమతి కోసం మరో 19 కంపెనీలు ఎదురు చూస్తున్నాయి, అవి రూ. 32,940 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నాయి.


స్లో మార్కెట్ ప్రభావం
గణాంకాల ప్రకారం... 2022-23 సమయంలో 68 కంపెనీలు IPO తీసుకురావడానికి సెబీకి డ్రాఫ్ట్‌ సమర్పించాయి. అయితే, 37 కంపెనీలు తమ అనుమతిని రద్దు చేసుకున్నాయి. అంటే, సెబీ ఆమోదం పొందిన తర్వాత కూడా, ఐపీఓను వాయిదా వేయడమే మంచిదని ఈ కంపెనీలు భావించాయి. ఆ 37 కంపెనీలు దాదాపు రూ. 52,000 కోట్లు సమీకరించాలనుకున్నాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.