Avalon Technologies IPO: అవలాన్ టెక్నాలజీస్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) 2023 ఏప్రిల్ 3, సోమవారం నుంచి ఓపెన్ అవుతుంది. రూ. 865 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఒక్కో షేర్‌ను రూ. 415-436 రేంజ్‌లో (ప్రైస్ బ్యాండ్) ఈ కంపెనీ విక్రయిస్తుంది.
కంపెనీ వ్యాపారం
ఎండ్-టు-ఎండ్ సర్వీస్ సొల్యూషన్స్‌ను అందించే పూర్తి సమగ్ర ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ అవలాన్ టెక్నాలజీస్. ఈ కంపెనీకి US, భారతదేశంలో 12 తయారీ యూనిట్లు ఉన్నాయి. క్యోసాన్ ఇండియా, జోనార్ సిస్టమ్స్ ఇంక్, కాలిన్స్ ఏరోస్పేస్, ఇ-ఇన్ఫోచిప్స్ వంటి పెద్ద కంపెనీలు ఈ కంపెనీ కీలక క్లయింట్ లిస్ట్‌లో ఉన్నాయి.
కేబుల్ అసెంబ్లీ & వైర్ హార్నెస్, షీట్ మెటల్ ఫాబ్రికేషన్, మెషీనింగ్, మాగ్నెటిక్స్, ఇంజెక్షన్ మోల్డ్ ప్లాస్టిక్స్ బిజినెస్ కూడా ఈ కంపెనీ చేస్తోంది.
ప్రి-ఐపీఓ ప్లేస్‌మెంట్ ద్వారా ఈ కంపెనీ రూ. 160 కోట్లు సమీకరించడంతో ఐపీఓ పరిమాణం గతంలోని రూ. 1,025 కోట్ల నుంచి ఇప్పుడు రూ. 865 కోట్లకు తగ్గింది. ఫ్రెష్ షేర్ల ఇష్యూ ద్వారా రూ. 320 కోట్లు సమీకరించబోతోంది. ప్రమోటర్లు, ఇప్పటికే ఉన్న వాటాదార్ల నుంచి మరో రూ. 545 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్‌లో విక్రయిస్తుంది.
OFS కింద.. ప్రమోటర్లు కున్హమద్ బిచా, భాస్కర్ శ్రీనివాసన్ వరుసగా రూ. 131 కోట్లు, రూ.172 కోట్ల వరకు షేర్లను విక్రయిస్తారు. ప్రమోటర్ గ్రూప్‌లోని మరికొందరు కూడా షేర్లను ఆఫ్‌లోడ్ చేస్తారు.
ఏప్రిల్ 6 వరకు సబ్‌స్క్రిప్షన్ అవకాశం
2023 ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే IPOను ఏప్రిల్ 6, గురువారం వరకు సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. ఒక్కో లాట్‌కు 34 ఈక్విటీ షేర్లను కంపెనీ కేటాయించింది. పెట్టుబడిదార్లు లాట్ల రూపంలో బిడ్ వేయాలి. యాంకర్ ఇన్వెస్టర్ల రౌండ్ శుక్రవారం, మార్చి 31న ఉంటుంది.
ఫ్రెష్ ఈక్విటీ సేల్స్ ద్వారా వచ్చే రూ. 320 కోట్లు మాత్రమే కంపెనీ ఖాతాలోకి చేరుతుంది. రుణాల చెల్లింపు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఈ డబ్బును ఉపయోగిస్తారు.
2022 నవంబర్‌తో ముగిసిన కాలానికి, ఈ కంపెనీ రూ. 584 కోట్ల ఆదాయం సంపాదించింది. దీనిపై, పన్ను తర్వాతి లాభం (PAT) రూ. 34 కోట్లు మిగిలింది.
IPOలో.. అర్హత గల సంస్థాగత కొనుగోలుదార్ల (QIBలు) కోసం 75% షేర్లను రిజర్వ్ చేశారు. 15% షేర్లు నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NIIలు), మిగిలిన 10% షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తారు.
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం... అన్ లిస్టెడ్ మార్కెట్‌లో కంపెనీ షేర్లు రూ. 25-30 ప్రీమియంతో చేతులు మారుతున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.