Mankind Pharma shares Listing: దేశంలో నాలుగో అతి పెద్ద ఫార్మా కంపెనీ అయిన మ్యాన్‌కైండ్ ఫార్మా షేర్లు ఇవాళ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యాయి, IPO పెట్టుబడిదార్లకు బ్రహ్మాండమైన లిస్టింగ్‌ గెయిన్స్‌ అందించాయి. మ్యాన్‌కైండ్ ఫార్మా షేర్లు, బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌లో (BSE), రూ. 1300 వద్ద అరంగేట్రం చేశాయి. IPOలో ఒక్కో షేర్‌ను రూ. 1,080 గరిష్ట ధర వద్ద జారీ చేశారు. అంటే, IPO పెట్టుబడిదార్లు ఒక్కో షేరుకు 220 రూపాయలు లేదా 20% బంపర్ లాభాలు పొందారు.


నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో (NSE) కూడా ఒక్కో షేర్‌ రూ. 1300 ధర వద్ద లిస్ట్‌ అయింది. ప్రారంభ ట్రేడింగ్‌లో గరిష్టంగా రూ. 1367కి చేరింది. 


లిస్టింగ్‌కు ముందు, గ్రే మార్కెట్‌లో ఒక్కో షేరు రూ. 105 లేదా 9.72% ప్రీమియంతో ట్రేడయింది. లిస్టింగ్‌ సమయానికి బాగా పెరిగింది, ముఖ్యంగా, ఈ నెల 3న ఐపీవో షేర్ల కేటాయింపు తర్వాత మంచి పెరుగుదల చూసింది.


రూ. 4,326 కోట్ల విలువైన మ్యాన్‌కైండ్ ఫార్మా ఐపీవో, ఈ ఏడాదిలో వచ్చిన అతి పెద్ద పబ్లిక్‌ ఆఫర్‌గా నిలిచింది. ఔషధ రంగంలో, 2020లో రూ. 6,480 కోట్లతో వచ్చిన గ్లాండ్‌ ఫార్మా (Gland Pharma) ఐపీవో తర్వాత ఇదే అతి పెద్దది.


గత నెల 25 నుంచి 27వ తేదీ వరకు IPO ఓపెన్‌లో ఉంది. ఈ ఆఫర్‌ ద్వారా 28 మిలియన్ ఈక్విటీ షేర్లను కంపెనీ ఆఫర్‌ చేస్తే, 429.5 మిలియన్ షేర్ల కోసం బిడ్స్‌ వచ్చాయి.


IPO  ప్రైస్‌ బ్యాండ్‌
పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్‌లో వచ్చిన మ్యాన్‌కైండ్ ఫార్మా IPOలో, ₹1,024-1,080 ప్రైస్ బ్యాండ్‌లో షేర్లను విక్రయించారు. 


IPOకి ముందు, 77 యాంకర్ ఇన్వెస్టర్లకు 12 మిలియన్ ఈక్విటీ షేర్లను కేటాయించి దాదాపు ₹1,297 కోట్లను మ్యాన్‌కైండ్‌ సమీకరించింది.


IPO ప్రైస్‌ బ్యాండ్ గరిష్ట ధర ₹1,080 వద్ద... FY22 ఆదాయాలకు PE రేషియో 30 రెట్లుగా ఉంది, ₹44,000 కోట్ల మార్కెట్ విలువను ‍‌(market capitalisation) ఈ కంపెనీ కమాండ్‌ చేసింది. IPO తర్వాత కంపెనీలో ప్రమోటర్ వాటా 78% శాతానికి తగ్గింది, ప్రస్తుత పెట్టుబడిదార్ల షేర్‌ 12%కు దిగి వచ్చింది.


మ్యాన్‌కైండ్ ఫార్మా వ్యాపారం
మ్యాన్‌కైండ్ ఫార్మా, మన దేశంలో నాలుగో అతి పెద్ద ఫార్మా కంపెనీ. ప్రీగా న్యూస్, మ్యాన్‌ఫోర్స్ కండోమ్స్ వంటి ప్రసిద్ధ బ్రాండ్ పేర్లతో కండోమ్‌లు, ప్రెగ్నెన్సీ కిట్‌లను తయారు చేసి విక్రయిస్తోంది. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 25కి పైగా తయారీ యూనిట్లు ఉన్నాయి. 


ఆర్థికాంశాలు
కంపెనీ ఆదాయం 15.2% CAGR వద్ద, FY20లోని ₹5,865 కోట్ల నుంచి FY22లో ₹7,782 కోట్లకు పెరిగింది. మొత్తం ఫార్మా మార్కెట్ వృద్ధి కంటే 1.5 రెట్లు అధికం. అదే సమయంలో నికర లాభం 17.3% CAGR వద్ద, ₹1,056 కోట్ల నుంచి ₹1,453 కోట్లకు పెరిగింది. 2022 డిసెంబర్‌ నెలతో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి ₹ 6,697 కోట్ల ఆదాయాన్ని, ₹1,016 కోట్ల నికర లాభం, 22.3% ఎబిటా మార్జిన్, 16.6% RoCEని నమోదు చేసింది.


ఆందోళనలు
భారతీయ మార్కెట్‌లోని టాప్‌-4లో ఒకటిగా ఉన్నప్పటికీ, పోటీ కంపెనీలు సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా వంటి లిస్టెడ్ ఫార్మాల కంటే ఈ కంపెనీ చిన్నది.


దేశంలోని గ్రామీణ & సెమీ-అర్బన్‌ ప్రాంతాల్లో వేగంగా, దూకుడుగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ... దీర్ఘకాలిక చికిత్సల్లో, మెట్రోలు, టైర్ 1 నగరాలు, అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించడం కంపెనీకి అంత తేలికైన పని కాదు, అధిక పోటీ ఉంది.  R&Dపై తోటి కంపెనీలు చేస్తున్న ఖర్చు కంటే ఈ కంపెనీ చేస్తున్న వ్యయం తక్కువ, ఆదాయంలో 2.3% మాత్రమే ఖర్చు పెడుతోంది. 


అంతేకాదు... ఫార్మా పోర్ట్‌ఫోలియో లాభదాయకతను నిర్ణయించడంలో కీలకమైన వినియోగదారు ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో ఆదాయాలు & మార్జిన్‌లను ఈ కంపెనీ వెల్లడించలేదు. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.