Tata Technologies IPO: 18 సంవత్సరాల తర్వాత, టాటా గ్రూప్‌ నుంచి ఒక కంపెనీ ఐపీవో స్టాక్ మార్కెట్‌లోకి రానుంది. ఆ కంపెనీ టాటా టెక్నాలజీస్. త్వరలోనే IPO సబ్‌స్క్రిప్షన్స్‌ను ఇది ప్రారంభించనుంది. టాటా గ్రూప్‌ నుంచి చివరిసారిగా IPOకు వచ్చిన సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS). 2004లో ఇది ఐపీఓకి వచ్చింది.


మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి, ఈ ఏడాది మార్చి నెలలో ఐపీవో పేపర్లను టాటా టెక్నాలజీస్‌ సమర్పించింది. ప్రస్తుతం రెగ్యులేటర్ నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తోంది. టాటా టెక్నాలజీస్‌ IPO పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) రూట్‌లో జరుగుతుంది, ఒక్క ఫ్రెష్‌ షేర్‌ను కూడా జారీ చేయడం లేదు. 


IPOలో 23.60% వాటా అమ్మకం
ఈ కంపెనీ ప్రమోటర్ ఎంటిటీ అయిన టాటా మోటార్స్ సహా ఇప్పటికే ఉన్న మరో ఇద్దరు షేర్‌హోల్డర్లు వాళ్ల వాటాలను అమ్మకానికి పెట్టబోతున్నారు. ఈ IPO ద్వారా 9,57,08,984 ఈక్విటీ షేర్లను OFS ద్వారా అమ్ముతున్నారు, మొత్తం పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో ఇది దాదాపు 23.60%కు సమానం.


టాటా టెక్నాలజీస్‌లో ఉన్న ప్రస్తుత పెట్టుబడిదార్లు ఆల్ఫా TC హోల్డింగ్స్ Pte, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్-I. ద్వారా అందించబడుతున్న ఆఫర్ ఫర్ సేల్. ప్రమోటర్ కంపెనీ అయిన టాటా మోటార్స్‌కు ప్రస్తుతం ఈ కంపెనీలో 74.69 శాతం వాటా ఉండగా, ఆల్ఫా TC హోల్డింగ్స్ Pteకి 7.26 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్-Iకు 3.63 శాతం వాటా ఉన్నాయి.


IPO ఇష్యూ ధర ఎంత ఉండొచ్చు?
టాటా టెక్నాలజీస్ ఐపీఓలో షేరు ధర ఎంత ఉంటుందనే దానిపై నిపుణులు కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సైయంట్‌కు ఇచ్చిన పోర్షన్‌లో 10 శాతం తగ్గింపును పరిగణనలోకి తీసుకుంటే, ఐపీవోలో ఒక్కో షేరును రూ. 268 ధర వద్ద జారీ చేయవచ్చని తెలుస్తోంది. ఈ ధర ఆధారంగా, టాటా టెక్నాలజీస్ మార్కెట్ విలువ రూ. 10,825 కోట్లుగా ఉంటుంది.


టాటా టెక్నాలజీస్ GMP
గ్రే మార్కెట్‌లో లేదా అనధికార మార్కెట్‌లో టాటా టెక్నాలజీస్ షేర్‌ ధర దాదాపు రూ. 850 స్థాయి ఉందని ప్రైమరీ మార్కెట్‌పై కన్నేసి ఉంచే ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. IPOలో, ఒకవేళ, ఒక్కో టాటా టెక్నాలజీస్ షేరును రూ. 268 ధరను విడుదల చేస్తే, దాని GMP ప్రతి షేరుకు రూ. 582 (850-268 = రూ. 582) అవుతుంది.


త్వరలో ప్రైమరీ మార్కెట్‌లోకి రానున్న టాటా టెక్నాలజీస్ IPO, తన పెట్టుబడిదార్లకు మల్టీబ్యాగర్ రాబడిని ఇవ్వగలదని గ్రే మార్కెట్ సూచిస్తోంది. ప్రస్తుత GMP ఆధారంగా టాటా టెక్నాలజీస్ IPO ధర కంటే గ్రే మార్కెట్‌ ప్రీమియం 200% ఎక్కువగా ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.