Tata Play IPO: టాటా గ్రూప్ కంపెనీ టాటా ప్లే ప్రతిపాదిత IPOకి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI ఆమోదం లభించింది. మన దేశంలో 'కాన్ఫిడెన్షియల్‌ ఐపీవో ఫైలింగ్‌' (Confidential IPO filing) చేసిన మొదటి కంపెనీ టాటా ప్లే. అప్‌డేట్ చేసిన డ్రాఫ్ట్ పేపర్‌ను 16 నెలలలోపు సెబీకి ఈ కంపెనీ సమర్పించాల్సి ఉంటుంది. 


'డైరెక్ట్ టు హోమ్' ‍‌(DTH) కంపెనీ టాటా ప్లే, తన IPO కోసం 2022 నవంబర్ 29వ తేదీన SEBI, BSE, NSEలకు పత్రాలను సమర్పించింది. IPO కోసం గోప్యతతో కూడిన డ్రాఫ్ట్ పేపర్ (Draft Red Herring Prospectus) ప్రి-ఫైలింగ్ చేయాలన్న నియమాన్ని SEBI గత సంవత్సరం నుంచి ప్రారంభించింది.


కాన్ఫిడెన్షియల్ ఫైలింగ్ కింద... IPO కోసం వచ్చే కంపెనీ ప్రైవేట్ పద్ధతిలో ఆఫర్ డాక్యుమెంట్‌ సమర్పించడానికి & IPO ప్రారంభించే తేదీ దగ్గర పడే సమయంలో అప్‌డేటెడ్‌ డ్రాఫ్ట్ పేపర్‌ను ఫైల్ చేయడానికి అనుమతి ఉంటుంది. ముసాయిదా పత్రాన్ని రహస్యంగా ఉంచడానికి కంపెనీలకు ఈ నియమం దోహదపడుతుంది. ఫలితంగా.. సెబీ, ఎక్స్ఛేంజ్‌లు 'కాన్ఫిడెన్షియల్‌ ఐపీవో ఫైలింగ్‌'ను మిగిలిన వాళ్లు చూడలేరు. SEBI తన ప్రతిస్పందనను జారీ చేసిన తర్వాత, IPOని ప్రారంభించాలని ఆ కంపెనీ నిర్ణయించుకున్నప్పుడు, అప్‌డేట్‌ చేసిన డ్రాఫ్ట్ పేపర్‌ను SEBIకి మళ్లీ సమర్పిస్తుంది. చేస్తుంది. దీనిని సెబీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు, అందరూ చదవవచ్చు.


టాటా ప్లే (గత పేరు టాటా స్కై) IPO ద్వారా రూ. 2,000 నుంచి 2,500 కోట్ల వరకు సేకరించవచ్చు. డిస్నీ సహా చాలా పెట్టుబడిదార్లకు టాటా స్కైలో వాటాలు ఉన్నాయి. ఆ కంపెనీలు తమ వాటాను IPO ద్వారా విక్రయించాలని భావిస్తున్నాయి. 
IPO కోసం ఐదు లీడ్‌ బ్యాంకులను టాటా ప్లే ఖరారు చేసింది. అవి.. కోటక్ మహీంద్ర క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ, మోర్గాన్ స్టాన్లీ, IIFL.


18 ఏళ్లుగా ఒక్క ఐపీవో కూడా లేదు
2004 తర్వాత టాటా గ్రూప్ నుంచి ఏ కంపెనీ ఐపీఓకి రాలేదు. దాదాపు 18 ఏళ్ల క్రితం, అంటే 2004లో, ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఐపీఓ కోసం వచ్చింది. టాటా గ్రూప్‌ ఐపీవోలో అదే చివరిది. 


టాటా టెక్నాలజీస్ IPO
అయితే, టాటా గ్రూప్‌లోని మరో కంపెనీ టాటా టెక్నాలజీస్ కూడా ఐపిఓ (Tata Technologies IPO) తీసుకురావడానికి ఈ ఏడాది మార్చి నెలలో సెబీకి డ్రాఫ్ట్ పేపర్‌ దాఖలు చేసింది, రెగ్యులేటర్ నుండి అనుమతి కోసం ఎదురు చూస్తోంది. టాటా టెక్నాలజీస్‌ IPO పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూట్‌లో జరుగుతుంది, ఒక్క ఫ్రెష్‌ షేర్‌ను కూడా జారీ చేయడం లేదు. ప్రమోటర్ ఎంటిటీ అయిన టాటా మోటార్స్ సహా ఇప్పటికే ఉన్న మరో ఇద్దరు షేర్‌హోల్డర్లు వాళ్ల వాటాలను అమ్మకానికి పెట్టబోతున్నారు. ఈ IPO ద్వారా 95,708,984 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా అమ్ముతున్నారు, మొత్తం పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో ఇది దాదాపు 23.60%కు సమానం.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.