Nexus Select Trust REIT IPO: బ్లాక్‌స్టోన్ స్పాన్సర్‌ చేస్తున్న 'నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్' ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌లో (IPO) యూనిట్‌ ధర ఖరారైంది. రూ. 95-100ను ప్రైస్‌ బ్యాండ్‌గా కంపెనీ నిర్ణయించింది. రూ. 3,200 కోట్ల REIT IPO ఈ నెల 9వ తేదీన (మంగళవారం) ప్రారంభమవుతుంది. ఇన్వెస్టర్లు బిడ్స్‌ వేయడానికి మే 11వ తేదీ వరకు ఓపెన్‌లో ఉంటుంది.


ఇది భారతదేశంలో మొట్టమొదటి REIT రిటైల్ అసెట్‌ ఆఫర్. ప్రస్తుతం, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో మూడు లిస్టెడ్ REITలు ఉన్నాయి. అవి.. ఎంబసీ ఆఫీస్ పార్క్స్ REIT, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ REIT, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్. అయితే ఇవన్నీ కార్యాలయ ఆస్తులకు సంబంధించినవి.


IPO సైజ్‌ రూ.3,200 కోట్లు
IPOలో రూ. 1,400 కోట్ల విలువైన ఫ్రెష్‌ షేర్లను ఇష్యూ చేస్తారు. మరో రూ. 1,800 కోట్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ (OFS) షేర్లు అందుబాటులోకి వస్తాయి. ప్రైస్‌ బ్యాండ్‌ ఎగువ ధర రూ. 100 వద్ద, IPO విలువ రూ. 3,200 కోట్లుగా ఉంటుంది. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించాలన్న గత ప్రతిపాదనను సవరించి, IPO సైజ్‌ తగ్గించారు.


పెట్టుబడిదార్లు 150 యూనిట్లు, దాని గుణిజాల్లో బిడ్స్‌ వేయవచ్చు. అంటే 150 షేర్లు లేదా 300 (150 x 2) షేర్లు లేదా 450 షేర్లు (150 x 3) లేదా 600 (150 x 4)  షేర్లు ఇలా లాట్స్‌ రూపంలో బిడ్స్‌ దాఖలు చేయాలి.


ఈ నెల 19న లిస్టింగ్‌కు అవకాశం
ఈ IPOలో 75% వాటాను సంస్థాగత పెట్టుబడిదారుల కోసం కంపెనీ రిజర్వ్ చేసింది. విజయవంతమైన బిడ్డర్లకు షేర్ల కేటాయింపు ఈ నెల 16 నాటికి ఖరారవుతుంది. ఈ నెల 19న లిస్టింగ్ జరిగే అవకాశం ఉంది.


17 హై క్వాలిటీ అసెట్స్‌తో కూడిన భారతదేశపు అతి పెద్ద మాల్ ప్లాట్‌ఫామ్ Nexus సెలెక్ట్ ట్రస్ట్‌. దిల్లీ (సెలెక్ట్ సిటీవాక్), నవీ ముంబై (నెక్సస్ సీవుడ్స్), బెంగళూరు (నెక్సస్ కోరమంగళ), చండీగఢ్ (నెక్సస్ ఎలాంటే), అహ్మదాబాద్ (నెక్సస్ అహ్మదాబాద్ వన్) సహా 14 ప్రముఖ జనసమ్మర్ధ నగరాల్లో ఇది విస్తరించి ఉంది. వాటి మొత్తం విస్తీర్ణం 9.8 మిలియన్ చదరపు అడుగులు కాగా, విలువ రూ. 23,000 కోట్లు.


నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ పోర్ట్‌ఫోలియోలోని 17 ఆస్తుల్లో 96% ప్రాంతాన్ని లీజుకు ఇచ్చారు. జర, హెచ్&ఎం, యునిక్లో, సెఫోరా, సూపర్‌డ్రీ, లైఫ్‌స్టైల్, షాపర్స్ స్టాప్, స్టార్‌బక్స్, మెక్‌డొనాల్డ్స్ వంటి ఫేమస్‌ స్టోర్లు సహా దాదాపు 3,000 స్టోర్లు ఈ మాల్స్‌లో ఉన్నాయి. ఆపిల్‌ వంటి 1,100 పైగా జాతీయ & అంతర్జాతీయ బ్రాండ్‌లు ఇక్కడ అమ్ముడవుతున్నాయి.


బ్లాక్‌స్టోన్ స్పాన్సర్ చేస్తున్న మూడో REIT ఇది. భారతదేశంలో మొట్టమొదటి REIT ఎంబసీ ఆఫీస్ పార్క్స్‌ను మొదట ప్రారంభించింది. ఆ తర్వాత మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ REITని ప్రారంభించింది. ఇవి రెండూ ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ అయి ఉన్నాయి.


REIT అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక విధానం. అద్దె వచ్చే ఆస్తులను నిర్మించి విక్రయించడం ద్వారా స్థిరాస్తి రంగంలోకి పెట్టుబడులను ఇవి ఆకర్షిస్తుంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది, రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో భారీ విలువను అన్‌లాక్ చేయడంతో పాటు, రిటైల్ పెట్టుబడిదార్లు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సాయపడుతుంది.


బ్లాక్‌స్టోన్‌కు ఇండియన్‌ మార్కెట్లో భారీ ఉనికి ఉంది. ఇండియన్‌ మార్కెట్‌లోని 40కి పైగా పెట్టుబడుల్లో, రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు 22 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఈ కంపెనీకి ఉన్నాయి. దేశంలోని 7 నగరాల్లో ఉన్న 38 ఆస్తుల్లో సుమారు 100 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్‌ పోర్ట్‌ఫోలియో దీని సొంతం. భారతదేశంలో అతి పెద్ద ఆఫీస్‌ స్పేస్‌ పోర్ట్‌ఫోలియో ఓనర్‌ ఈ కంపెనీ.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.