IPO Market News: ఇనీషియల్‌ పబ్లిక్ ఆఫర్స్‌ (IPO) ద్వారా దాదాపు ₹12,000 కోట్లను సమీకరించడానికి డజనుకు పైగా కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. నెల రోజుల్లోనే ఇవన్నీ మార్కెట్‌ను తాకే అవకాశం ఉంది.


ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ (Five Star Business Finance), గ్లోబల్ హెల్త్ (Global Health), ప్రిస్టీన్ లాజిస్టిక్స్ & ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ (Pristine Logistics & Infraprojects), కేన్స్ టెక్నాలజీ (Kaynes Technology), యూనిపార్ట్స్ ఇండియా ‍‌(Uniparts India) సహా మరికొన్ని కంపెనీలు తమ ఐపీవోలను దీపావళికి ముందు లేదా తర్వాత ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు బ్యాంకర్స్‌ చెబుతున్న మాటలను బట్టి అర్ధం అవుతోంది.


ఈ ఏడాది ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో నిఫ్టీ 50 ఇండెక్స్ 15% పైగా పడిపోయింది. సెకండరీ మార్కెట్ బలహీనంగా ఉండడంతో, మేలో వచ్చిన కొన్ని IPOలు విజయవంతం కాలేక ఇబ్బందులు పడ్డాయి. జూన్, జులైలో పెద్దగా పబ్లిక్‌ ఇష్యూలు లేవు. కేవలం ఆరు కంపెనీలు మాత్రమే పబ్లిక్‌లోకి వచ్చి సుమారు ₹3,500 కోట్లను సేకరించాయి.


₹310 కోట్లు - ₹2,752 కోట్లు 
ట్రాక్షన్‌ టెక్నాలజీస్‌కు (Tracxn Technologies) చెందిన ₹310 కోట్ల IPO ఇవాళ ప్రారంభమైంది. 12వ తేదీన క్లోజ్‌ అవుతుంది.


చెన్నై ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్, దీపావళి తర్వాత ₹2,752 కోట్ల IPO ని ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ నాన్ బ్యాంకింగ్‌ ఫైనాన్స్ కంపెనీకి ఈ ఏడాది జనవరిలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుంచి ఆమోదం లభించింది.


ప్రముఖ కార్డియాలజిస్ట్ నరేష్ ట్రెహాన్ ప్రమోట్ చేస్తున్న గ్లోబల్ హెల్త్, మేదాంత (Medanta) బ్రాండ్‌తో ఆసుపత్రులను నిర్వహిస్తోంది. ఇది కూడా ఈ నెలలోనే IPOని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ₹500 కోట్ల ఫ్రెష్‌ షేర్ల విక్రయంతోపాటు ₹2,200-2,500 కోట్లను సేకరించాలని ఈ హాస్పిటల్ చైన్ చూస్తోంది. 


దిల్లీకి చెందిన ప్రిస్టీన్ లాజిస్టిక్స్ & ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ఈ నెలలో ₹1,200 కోట్ల IPOని ప్రారంభించే అవకాశం ఉంది. కేన్స్ టెక్నాలజీ, యూనిపార్ట్స్ ఇండియా తలో ₹1,000 కోట్లను సమీకరించాలని చూస్తున్నాయి. 


రుస్తోమ్‌జీ గ్రూప్‌లోని కీస్టోన్ రియల్టర్స్‌ (Keystone Realtors) ₹850 కోట్లు, ల్యాండ్‌మార్క్ కార్స్‌ ‍‌(Landmark Cars) ₹762 కోట్లు, ఇండియా ఎక్స్‌పోజిషన్ మార్ట్ (India Exposition Mart) ₹600 కోట్లు, డీసీఎక్స్‌ సిస్టమ్స్ ‍‌(DCX Systems) ₹600 కోట్లు, ఐనాక్స్ గ్రీన్ (Inox Green) ₹500 కోట్లు, జీపీటీ హెల్త్‌కేర్ (GPT Healthcare) ₹500 కోట్ల సమీకరణ కోసం ఒక నెల రోజుల్లనే IPOలను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.


ప్రైమ్ డేటాబేస్ ప్రకారం, 2021లో ₹1.19 లక్షల కోట్లు సేకరించిన 63 కంపెనీలతో పోలిస్తే, ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 21 కంపెనీలు ₹43,776 కోట్లను సేకరించాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.