IPO funding down: 2023 ఆర్థిక సంవత్సరం (FY23) ప్రథమార్థంలో (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు) ఇనీషియల్‌ పబ్లిక్ ఆఫర్ల (IPO) జోరు తగ్గింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే, ఈ ఆరు నెలల కాలంలో కొత్త సంస్థలు సమీకరించిన మొత్తం 32% తగ్గి రూ.35,456 కోట్లకు పరిమితమైంది. ఇండియన్‌ క్యాపిటల్ మార్కెట్‌ను ట్రాక్ చేస్తున్న ప్రైమ్ డేటాబేస్ (Prime Database) రిపోర్ట్‌లోని అంశాలివి.


2022-23లో, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కేవలం 14 IPOలు మాత్రమే వచ్చాయి. క్రితం సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన IPOల సంఖ్య 25 కాగా, అవి సేకరించిన మొత్తం ₹51,979 కోట్లు. ఈ ఏడాది వ్యవధిలో IPOల సంఖ్య, ఫండ్స్‌ గణనీయంగా తగ్గాయి.


FY23 తొలి అర్ధభాగంలో వచ్చిన 14 IPOలు రూ.35,456 కోట్లను సమీకరించాయని ముందే చెప్పుకున్నాం కదా, ఈ మొత్తంలో కేవలం ఒక్క కంపెనీ వాటానే 58 శాతంగా ఉంది. అది, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC). రూ.35,456 కోట్లలో ఈ బెహమోత్‌ వాటానే రూ.20,557 కోట్లు. ఇది కూడా లేకపోతే IPO లెక్కలు మరీ చెత్తగా ఉండేవి.


LIC తర్వాత ఢిల్లీవేరీ (రూ.5,235 కోట్లు), రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌ (రూ.1,581 కోట్లు) ఉన్నాయి. 


2021-22 తొలి అర్ధభాగంతో పోలిస్తే, ఈసారి రిటైల్ ఇన్వెస్టర్ల స్పందన కూడా సగానికి సగం తగ్గింది. 2020-21లో 12.49 లక్షల రిటైల్ దరఖాస్తులు, 2021-22లో 15.56 లక్షలు రాగా, ఈసారి ఆ సంఖ్య 7.57 లక్షలకు పడిపోయింది. వీటిలో, అత్యధిక దరఖాస్తులను ఎల్‌ఐసీ (32.76 లక్షలు) అందుకోగా, హర్ష ఇంజినీర్స్‌ (23.86 లక్షలు), క్యాంపస్ యాక్టివ్‌వేర్ (17.27 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


మొత్తం పబ్లిక్ ఈక్విటీ నిధుల సమీకరణ కూడా 55 శాతం తగ్గింది. గతేడాది ఇది రూ.92,191 కోట్లుగా ఉండగా, ఈసారి రూ.41,919 కోట్లకు దిగివచ్చింది.


చప్పటి లిస్టింగ్స్‌
ఈసారి లిస్టింగ్‌ గెయిన్స్‌ పెద్దగా లేకపోవడం వల్లే IPOకు స్పందన అంతంతమాత్రంగా ఉంది. 2021-22లో సగటున 32 శాతం, 2020-21లో సగటున 42 శాతంతో పోలిస్తే, ఈసారి లిస్టింగ్ గెయిన్స్‌ 12 శాతానికి పడిపోయాయి.


FY23లోని 14 IPOల్లో ఆరు స్టాక్స్‌ 10 శాతానికి పైగా రాబడిని ఇచ్చాయి. హర్ష ఇంజనీర్స్ 47 శాతంతో ఫస్ట్‌ ప్లేస్‌లో నిలబడగా, తర్వాతి స్థానాల్లో సిర్మా SGS (42 శాతం), డ్రీమ్‌ఫోక్స్ (42 శాతం) ఉన్నాయి.


ఈ 14 IPOల్లో 11 స్టాక్స్‌ వాటి ఇష్యూ ప్రైస్‌ కంటే పైన ప్రస్తుతం ట్రేడవుతున్నాయి (26 సెప్టెంబర్, 2022 ముగింపు ధర ప్రకారం).


లైన్‌లో 71 IPOలు
2022-23 రెండో అర్ధభాగం (అక్టోబర్‌ నుంచి మార్చి వరకు) బలంగా కనిపిస్తోంది. రూ.లక్ష కోట్లకు పైగా (రూ.1,05,000 కోట్లు) సమీకరించేందుకు 71 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటికీ సెబీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. మరో 43 కంపెనీలు దాదాపు రూ.70,000 కోట్లను సమీకరించాలని చూస్తున్నాయి, సెబీ ఆమోదం కోసం వేచి ఉన్నాయి.


ఈ మొత్తం 114 కంపెనీల్లో 10 న్యూ ఏజ్‌ టెక్ కంపెనీలు. వీటి టార్గెట్‌ రూ.35,000 కోట్లు


రెండో అర్ధభాగం విషయంలో పేపర్‌ మీద లెక్కలు బాగానే కనిపిస్తున్నాయి. మాంద్యం భయం, వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో సెకండరీ మార్కెట్‌లో కనిపిస్తున్న అస్థిరత ప్రభావం రాబోయే IPOల మీద ఉంటుందని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.